Friday, April 26, 2024

సంక్షుభిత జీవితపు నిశ్శబ్ద ఘోషలు గ్లూక్ కవితలు

- Advertisement -
- Advertisement -

Louis Elizabeth Gl‌uck was awarded the Nobel Prize

 

సాదాసీదా అందం వ్యక్తిగత మనుగడను సార్వజనిక స్థాయికి తీసుకుపోతుంది, అనే విస్పష్టమైన కవితా భావాన్ని వ్యక్తపరచినందుకు లూయీస్ ఎలిజబెత్ గ్లూక్‌ను ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం వరించింది. న్యూయార్క్ లో పుట్టి లాంగ్ ఐలండ్ లో పెరిగిన గ్లూక్, తన కౌమారదశలో Anorexia Nervosa అనే మానసికవ్యాధికి గురైంది. ఆకలి అసలే లేకపోవడం ఈ వ్యాధి లక్షణం. తల్లిమీద ఆధారపడటం మానేందుకు తాను చేసిన ప్రయత్నంగా దాన్ని ఆమె పేర్కొన్నది. మరొక వ్యాసంలో, తను ఆ వ్యాధితో బాధ పడటాన్ని తన అక్క మృతశిశువుగా పుట్టిన సంఘటనతో ముడి పెట్టింది.

ఈమె కవిత్వంలో భాషాపరమైన కచ్చితత్వంతో పాటు సాదాసీదా ధ్వని, గేయలక్షణం కనిపిస్తాయి. శ్రమపడి ఏర్చికూర్చిన అరుదైన పదాలను పొదుపుగా వాడుతుంది ఆమె, అన్నారు మరొకరు. జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న పదాల ద్వారా బలమైన గేయతత్వాన్ని రూపు దిద్దుకున్న కవితలు ఆమెవి. ఎమిలీ డికిన్సన్, ఎలిజబెత్ బిషప్ మొదలైన కవులు ఈ రకానికి చెందినవారు. లూయీస్ గ్లూక్ తన కవిత్వంలో ప్రాస ద్వారాకన్న పునశ్చరణ, enjambment మొదలైన టెక్నిక్ ల ద్వారా లయను సాధించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తుంది. Enjambment అంటే ఒక వాక్యం లేదా పంక్తి సహజంగా ముగిసే వీలున్నా దాన్ని అక్కడ ముగించకుండా మధ్యలో కొన్ని phrases ను (పదబంధాలను, లేదా పదసమూహాలను) చొప్పించడం. ఈ పద్ధతి వలన సాధారణ పాఠకుల మనసులలో ఒక రకమైన అయోమయం ఏర్పడే అవకాశమున్నా, అది ‘దృతలయ’ను (fast tempo ను) సాధించడమే కాక, ఉద్దేశించిన ప్రధాన భావాన్ని మరింత బలంగా వ్యక్తీకరిస్తుందని అంటారు. ఈమెను ‘ఒక ప్రత్యేకమైన గొంతుక’గా గుర్తించారు విమర్శకులు.

గ్లూక్ తన మొదటి కవితా సంపుటిని 1968 లో Firstborn అనే పేరుతో ప్రచురించినప్పుడు విమర్శకుల నుండి మంచి స్పందన లభించింది. కానీ తర్వాత తన రచనావ్యాసంగంలో ఏర్పడిన అంతరాయం వలన 1975 దాకా ఆమె తన రెండవ పుస్తకాన్ని తీసుకురాలేకపోయింది. 1980 లో తన యిల్లు కాలిపోయి చాలా నష్టం జరిగింతర్వాత, 1985 లో The Triumph of Achilles అన్న మరో కవితా సంపుటిని వెలువరించింది ఆమె. ఆ పుస్తకానికి అవార్డు దొరికింది. అందులోని కవిత్వం మరింత ‘స్పష్టమైనది, స్వచ్ఛమైనది, పదునైనది,’ అని మెచ్చుకున్నాడొక విమర్శకుడు. 1985 లో ఆమె తండ్రి చనిపోయాడు. ఆ దుఃఖపు నేపథ్యం ఆమెను Ararat అనే మరో కవితా సంపుటిని రాసేలా చేసింది.

గార్నర్ అనే విమర్శకుడు దాన్ని గత 25 సంవత్సరాల కాలంలో అచ్చయిన అమెరికన్ కవిత్వంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన, వ్యథాభరితమైన కవితా సంపుటిగా వర్ణించాడు. The Wild Iris అనే కవిత్వ పుస్తకాన్ని ఆమె 1992 లో వెలువరించింది. అందులో తోటలోని పువ్వులు తోటమాలితో, దేవునితో జీవితం గురించి సంభాషించడం ఉంటుంది. దీన్ని ఒక పత్రిక అద్భుతమైన సౌందర్యమున్న పుస్తకంగా, ప్రాధాన్యమున్న రచనగా చెప్తూ ప్రశంసించింది. మరో పత్రిక ‘అమెరికన్ కవితా రంగంలో మైలురాయి’ అని పొగిడింది. ఈ పుస్తకానికి 1993 లో ప్యూలిట్జర్ బహుమతి లభించింది.

గ్లూక్ 1990 లో కవిత్వం మీద వ్యాసాలను, Meadowlands (1996), Vita Nova (1999) అన్న కవితా సంపుటాలను ప్రచురించింది. 2001 లో The Seven Ages నూ, 2004 లో October అనే శీర్షికతో ఒక దీర్ఘకవితనూ రాసింది. తర్వాత ఆమె రాసిన మరికొన్ని కవిత్వ పుస్తకాలు వెలుగు చూశాయి.

ఎక్కువ వరకు సొంతజీవితం గురించి ఉత్తమ పురుషలో రాసినందుకు గ్లూక్ ను కన్ఫెషనల్ కవిగా గుర్తించారు విమర్శకులు. ప్రాథమిక అవగాహన స్థాయిలో చూసినప్పుడు ఈ అభిప్రాయం తప్పకుండా కొంతవరకు నిజమే అన్నాడు రాబర్ట్ బేకర్. మరొకాయనేమో, గ్లూక్ తన పాఠకులను సంబోధించకుండా రాసిన కవిత్వాన్ని చదివితే ఆమెను కన్ఫెషనల్ కవిగా పరిగణించలేం అని వ్యాఖ్యానించాడు.

గ్లూక్ తన జీవితాన్ని తనే తవ్వి పరిశీలిస్తుంది. అయితే ఆమె భావాలు దుఖం, జాలి, నిర్లిప్తతలను ప్రకటిస్తాయే తప్ప స్త్రీవాదం వైపు మొగ్గవు. నిజానికి ఆమె రాసిన ఏ కవితా, శత్రువును పసిగట్టడం పట్ల ఆసక్తిని కనబరచదు. ఆ విధంగా, ఆమె కవితలు ఏకపక్షమైన అభియోగాన్ని ప్రతిబింబిస్తాయి. గ్లూక్ స్వరంలో తీవ్రత, ధిక్కారం, ఛీత్కారం, ఎదిరించడం కనిపించవు. స్వగతాన్ని (soliloquy ని) పోలివుండే ఆమె శైలి సౌమ్యతనే సూచిస్తుంది. ఒక కవితలో, ఆత్మ మౌనంగా ఉంటుంది. ఒకవేళ మాట్లాడితే ఆ పనిని నిద్రలోనే చేస్తుంది, అంటుంది గ్లూక్. గ్లూక్ రాసిన రెండు కవితలకు నా ఈ అనువాదాలను చదవండి. వీటిలోని సార్వజనీనతను (unive rsality ని), భిన్నత్వాన్ని మనం గమనించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News