Saturday, April 27, 2024

మందకొడిగా ఆస్తుల సర్వే

- Advertisement -
- Advertisement -

CS suspends Charminar Zone Deputy Commissioner and Enumerator

 

చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్, ఎన్యుమరేటర్‌లపై సస్పెన్షన్

ఆస్తుల సర్వేను మరింత వేగం చేయాలని ఆదేశం

నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తుల సర్వే మందకొడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులపై సిఎస్ సోమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్, ఎన్యుమరేటర్‌పై సిఎస్ సస్పెన్షన్ వేటు వేశారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఆస్తుల సర్వేను మరింత వేగవంతం చేయాలని సోమేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లోని వ్యవసాయేతర ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసేందుకు చేపట్టిన ఇంటింటి సర్వే మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో అధికారులపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని, ఎవరైనా ఆస్తుల నమోదులో అలసత్వం, నిర్లక్షం ప్రదర్శిస్తే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సిఎస్ హెచ్చరికలు జారీ చేశారు.

సిఎస్ ఆకస్మిక తనిఖీలు చేయాలని…

అయితే ఆస్తుల నమోదుకు సంబంధించి సర్వర్ డౌన్ అవుతుండడంతో, నెట్ కనెక్షన్ సరిగ్గా లేక పోవడం, యజమానులు సమాచారం ఇవ్వడానికి సకాలంలో స్పందించక పోవడంతో అధికారులు, సిబ్బంది ఆస్తుల నమోదు ప్రక్రియలో వెనుకబడ్డారు. నగరపాలక సిబ్బంది ధరణి పోర్టల్ చెక్ లిస్టు అని, ధరని పోర్టల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పత్రాలని కొన్నింటిని నగరవాసులకు అందచేస్తున్నారు. సదరు పత్రాలు కొందరు నింపి ఇస్తుండగా మరికొందరు ఫోన్ల ద్వారా వివరాలను చెబుతున్నారు. ఇలి ప్రజలు నింపి ఇచ్చిన దరఖాస్తులు, ఫోన్‌లో చెప్పిన వివరాలు వాస్తవమేనా అన్న విషయాన్ని జిహెచ్‌ఎంసి సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

సిబ్బంది లక్ష్యాన్ని పూర్తి చేయకుండా సాకులు చెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సిఎస్ దీనిపై దృష్టి సారించినట్టుగా తెలిసింది. అయినా ప్రజల ఆస్తుల వివరాలను నమోదు చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్షం వహిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సిఎస్ ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. రానున్న రోజుల్లో ఈ విషయంలో ఎంతమందిపై వేటు పడుతుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజుల పాటు ఆస్తుల నమోదు ప్రక్రియకు గడువును పెంచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News