Friday, May 3, 2024

బర్డ్ ‌ఫ్లూ వణుకు

- Advertisement -
- Advertisement -

అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఆ నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు
గ్రుడ్లు, చికెన్ బాగా ఉడికించి తినాలని సలహా
ఐరోపాలోనూ విబృంభిస్తున్న ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా
చికెన్ దిగుమతిపై మధ్యప్రదేశ్‌లో నిషేధం

న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాలలో ఏవియన్ ఇన్‌ఫ్లూయం జా లేదా బర్డ్‌ఫ్లూ ప్రబలినట్లు తేలిందని కేంద్రం బుధవారం ప్రకటించింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని 12 ప్రాంతాలలో ఈ వ్యాధి పక్షులలో ప్రబలినట్లు కేంద్రం తెలిపింది. ఈ వైరస్ పౌల్ట్రీ బాతులకు, కాకులకు, ఇతర వలస పక్షులకు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచనలు పంపినట్లు కేంద్రం తెలిపింది. పక్షులలో అసాధారణ మరణాలు ఏవైనా సంభవించిన పక్షంలో అప్రమత్తంగా ఉండాలని ఇతర రాష్ట్రాలను కూడా హెచ్చరించినట్లు కేంద్ర మత్స, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో బర్డ్‌ఫ్లూ లేదని 2020 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్ది నెలల్లోనే ఈ ఇన్ఫెక్షన్ మళ్లీ ప్రబలినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో మొదటిసారి 2006లో బర్డ్‌ఫ్లూను గుర్తించడం జరిగింది. ఐసిఎఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఎడికు పంపిన నమూనాలు పాజిటివ్‌గా తేలడంతో నాలుగు రాష్ట్రాల్లోని 12 చోట్ల ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందని కేంద్రం తెలిపింది. రాజస్థాన్‌లోని బరాన్, కోట, ఝలావర్ ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సోర్, ఇండో, మాల్వా ప్రాంతాలలో కాకులకు ఈ ఇన్ఫెక్షన్ సోకింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా ప్రాంతంలో వలస పక్షులలో బర్డ్‌ఫ్లూను గుర్తించారు. కేరళలోని కొట్టాయం, అలప్పుళ(4 ప్రాంతాలు)లో పౌల్ట్రీ బాతులలో ఈ ఇన్ఫెక్షన్ కనిపించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి, రోజువారీ పద్ధతిలో వ్యాధి నియంత్రణ చర్యలను సమీక్షించడానికి న్యూఢిల్లీలో కంట్రోల్ రూమ్‌ను నెలకొల్పినట్లు కేంద్రం వివరించింది.
సాధారణంగా సెప్టెంబర్-అక్టోబర్ నుంచి ఫిబ్రవరి-మార్చి వరకు దేశంలోకి ప్రవేశించే వలస పక్షుల ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తుందని కేంద్రం తెలిపింది. కాగా..ఇన్ఫెక్షన్‌కు గురైన పక్షులను తాకడం వల్ల మానవులకు ఇది వ్యాపించే అవకాశం లేకపోలేదని కేంద్రం పేర్కొంది. విషపూరితమైన పౌల్ట్రీ పక్షులను తినడం ద్వారా ఇది మానవులకు వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ప్రత్యక్ష ఆధారాలు ఏవీ లేవని కూడా కేంద్రం పేర్కొంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, చికెన్, గుడ్లు మంచిగా ఉడికించి తినాలని సూచించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అనుమానం ఉన్న పక్షుల నమూనాలను ల్యాబ్‌లకు పంపి పరీక్షలు జరిపించాలని ఆదేశించింది.
ఐరోపాలోనూ….
యురోపియన్ దేశాల్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. జర్మనీ,ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, యుకె, స్వీడన్, పోలాండ్, డెన్మార్క్ తదితర దేశాల్లో ఇప్పటికే బర్డ్ ఫ్లూను గుర్తించారు. ఫ్రాన్స్‌లో ఇప్పటికే ఆరు లక్షల కోళ్లను చంపేశారు. జర్మనీలో 62వేల టర్కీ బాతులను వధించారు. ఈ వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News