Friday, May 3, 2024

పట్టణాలు.. ఇక మోడల్ టౌన్‌లు

- Advertisement -
- Advertisement -

smart toilet

 

ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్‌రూంలు, పబ్లిక్ టాయిలెట్లు
పిపిపి పద్దతిలో నిర్మాణం… ప్రతి 100 మందికి ఒకటి
బస్, రైల్వే స్టేషన్‌లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు
ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు
వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు ప్రారంభించాలన్న మున్సిపల్ శాఖ

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని పట్టణాలను మోడల్ టౌన్‌లుగా తీర్చిదిద్దాలని, వచ్చే మూడు నెలల్లో ఆ ప్రక్రియను ప్రారంభించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి మున్సిపల్ కార్పోరేషన్, కౌన్సిల్ ప్రాంతాల్లో ముందుగా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్‌రూంలు, పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని మున్సిపల్ కమిషనర్‌లకు పురపాలక శాఖ ఈ నెల 14వ తేదీన 182681/2020– సర్కూలర్‌తో ఆదేశాలు జారీచేసింది. వీటి నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేయాలని మున్సిపల్ కమిషనర్‌లకు స్పష్టం చేసింది. మోడల్ టౌన్‌లోని ప్రజలకు, ప్రయాణికులకు, వాహనదారులకు ఆధునిక పద్దతుల్లో కనీస వసతులను కల్పించడం ద్వారా టౌన్ రూపురేఖలు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

స్థానిక జనాభను పరిగణలోకి తీసుకుని, రాకపోకలు సాగించే వారి సంఖ్య ఆధారంగా వాష్‌రూంలు, పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్దంచేయాలని కమిషనర్‌లకు పురపాలక శాఖ సూచించింది. గత ఫిబ్రవరి 18వ తేదీన ‘పట్టణ ప్రగతి’ నిర్వహణపై మంత్రులు, కలెక్టర్లు, కమిషనర్‌లతో నిర్వహించిన సమావేశంలో ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్‌రూంలను ప్రతి మున్సిపాలిటీలో నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అనంతరం ఫిబ్రవరి 24, 25 తేదీల్లో మహబూబ్‌నగర్, దేవరకొండ, కల్వకుర్తిల్లో జరిగిన పట్టణ ప్రగతిల్లో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కమిషనర్‌లకు మార్గనిర్దేశకాలను పురపాలక శాఖ పంపించింది.

అధ్యయనం చేయాలి
ప్రతి పట్టణంలోని జనాభ, రాకపోకలు సాగించే వారి సంఖ్యను అంచనావేస్తూ ఎన్ని పబ్లిక్ టాయిలెట్లు, ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్‌రూంలు అవసరమవుతాయో అంచనా వేసేందుకు ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని మున్సిపల్ కమిషనర్‌లకు పురపాలక శాఖ సూచించింది. వాటి నమూనా, నిర్మించడం, ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణ, బదిలీ చేయడం (డిబిఎఫ్‌ఓటి) విధానంలో స్మార్ట్ వాష్‌రూంలను పిపిపి విధానంలో ఏర్పాటు చేసేందుకుగానూ ప్రైవేట్ వారిని ప్రోత్సహించాలని సూచించింది. ఈపాటికే పట్టణంలోని స్మార్ట్ టాయిలెట్లకు పునరావసం, నిర్వహణ, బదిలీ(ఆర్‌ఓటి) పద్దతిలో అత్యాధునికంగా తీర్చిదిద్దడం చేయాలని సూచించింది.

అవసరమైన ప్రాంతంలో ప్రైవేట్ సంస్థలను, సంఘాలను, స్వయం సహాయక గ్రూపులను కూడా వీటి నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని కమిషనర్‌లకు సూచించింది. నమూనాలను మున్సిపాలిటీ లేదా కలెక్టర్ అధ్యక్షతన ఉన్న జిల్లా కమిటి ఆమోదం పొందాలి, కేటాయించిన భూమిలో స్మార్ట్ వాష్ రూంల లేఅవుట్‌ను నమోదుచేయబడాలి, ప్రస్తుతమున్న పబ్లిక్ టాయిలెట్లను ఇంటిగ్రేటెడ్ వాష్‌రూంలుగా అభివృద్ధి చేస్తే ప్రస్తుతమున్న వారికి పునరావాసం కల్పించాలి అని పురపాలక శాఖ వెల్లడించింది. ప్రధానంగా బస్, రైల్వే స్టేషన్‌లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు, జనం అధికంగా చేరే ప్రదేశాల్లో వీటిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ పేర్కొన్నది.

పిపిపి పద్ధతిలో
బస్‌షెల్టర్‌లపైనా, బస్‌స్టాప్‌ల వద్ద పట్టణాల్లో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్‌రూంలు, పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్‌లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పిపిపి) పద్దతిలో నిర్మించాలని కమిషనర్‌లకు మున్సిపల్ విభాగం స్పష్టం చేసింది. స్వచ్చభారత్ మిషన్(అర్బన్) మార్గనిర్దేశకాలకు లోబడి మున్సిపాలిటీలు తమతమ పరిధిలోని జనాభకు అనుగుణంగా పురుషులకు, మహిళలకు ఎన్ని స్మార్ట్ వాష్‌రూంలు, పబ్లిక్ టాయిలెట్లు కావాలి అనేది అంచనా వేసి ప్రణాళికలను రూపొందించాలని మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది.

100 మందికి ఒకటి చొప్పున 400 మంది వరకు, 400 మందికి మించితే రాకపోకలు సాగించే వారిని దృష్టిలోపెట్టుకుని ప్రతి 250 మందికి ఒక టాయిలెట్‌ను నిర్మించాలని, ప్రతి 50 మందికి ఒక మూత్రశాలను, ప్రతి టాయిలెట్‌కు ఒక వాష్ బేసిన్‌ను ఏర్పాటుచేసే విధంగా ప్రతిపాదనలను సిద్దం చేయాలని, మహిళలకు ప్రతి 100 మంది మహిళలకు రెండు వాష్‌రూంలను 200 మంది వరకు, 200 మందికి పైబడి ఉంటే ప్రతి 100 మందికి ఒక స్మార్ట్ వాష్‌రూంలను, మూత్రశాలలు లేకుండా నిర్మించాలని మున్సిపల్ కమిషనర్‌లకు పురపాలక శాఖ స్పష్టం చేసింది. కమ్యూనిటీ వాష్‌రూంలను పురుషులకు ప్రతి 35 మందికి ఒకటి, ప్రతి 25 మంది మహిళలకు ఒక టాయిలెట్‌ను నిర్మించాలని మున్సిపల్ శాఖ వెల్లడించింది.

 

Make cities as model towns
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News