Saturday, April 27, 2024

మోడీజీ.. ‘చైనాపే చర్చ’ ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదంపై మోడీ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మరో సారి విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ‘చైనాపై చర్చ’ప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఓ ట్వీట్ చేశారు.‘ డోక్లా ప్రాంతంలో ‘జంఫేరి’ పర్వత శ్రేణి వరకు చైనా నిర్మాణాలు చేపట్టింది. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా నిలిచే భారత వ్యూహాత్మక ‘ సిలిగురి కారిడార్’కు ఇది ముప్పుగా పరిణమించింది. మన జాతీయ భద్రతకు అత్యంత ఆందోళన కలిగించే అంశం ఇది. నరేంద్ర మోడీజీ..చైనాపై చర్చ ఎప్పుడు ?’ అని ఖర్గే ట్వీట్ చేశారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోడీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఈ సిలిగురి కారిడార్ ప్రాంతంనుంచే వెళ్తాయి.

దీంతో పాటు కీలక పైపులైన్లు, కమ్యూనికేషన్ కేబుళ్లకు కూడా ఇదే మార్గం. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ ప్రాంతంలోని కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు అత్యంత సమీపంలో ఉండే ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే చైనాకు చెందిన చుంబీ లోయ ఉంటుంది. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్‌నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు గత కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు.

కాగా తమ పార్టీ అడిగిన ఏడు ప్రశ్నలకు తన ‘మన్‌కీ బాత్’లో దేశ ప్రజలతో పంచుకోవలసిన రాజకీయ కర్తవ్యం, నైతిక బాధ్యత ప్రధాని మోడీపై ఉందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఒక ప్రకటనలో అన్నారు. సరిహద్దు పరిస్థితిపైన, చైనానుంచి ఎదురవుతున్న సవాళ్లపై పార్లమెంటులో చర్చ ఉండదని మీరు ఎందుకు పట్టుబడుతున్నారో దేశ ప్రజలు తెల్సుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు. ‘మీరు గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా అధినాయకత్వాన్ని 18 సార్లు కలుసుకున్నారు. ఇటీవల బాలిలో జీ జిన్‌పింగ్‌తో కరచాలనం కూడా చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే చైనా తవాంగ్‌లోకి చొరబడింది. అప్పటినుంచి ఏకపక్షంగా సరిహద్దు పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంది’ అని జైరాం రమేశ్ అన్నారు.

తూర్పు లడఖ్ ప్రాంతంలోకి చైనా సైన్యాలు చొచ్చుకు రాలేదని ప్రధానమంత్రి 2020 జూన్ 20న ఎందుకు చెప్పారని కూడా ఆయన ప్రశ్నించారు. 2020 మే నెలకు ముందు మన దళాలు రెగ్యులర్‌గా గస్తీ నిర్వహిస్తుండిన తూర్పు లడఖ్‌లోని వేలాది చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మన బలగాలు తిరిగి స్వాధీనం చేసుకోకుండా అడ్డుకోవడానికి చైనాను మీరు ఎందుకు అనుమతించారని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే మౌంటైన్ స్ట్రైక్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి 2013 జులై 13న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రణాళికను ఎందుకు విరమించుకున్నారో చెప్పాలని కూడా జైరాం రమేశ్ ప్రధానిని ప్రశ్నించారు. అంతేకాకుండా పిఎం కేర్స్ ఫండ్‌కు చైనా కంపెనీలు విరాళాలు ఇవ్వడానికి ఎందుకు అనుమతించారు, గత రెండేళ్లలో చైనానుంచి దిగుమతులు ఎందుకు రికార్డు స్థాయికి పెరిగాయో చెప్పాలని కూడా ఆయన తన ప్రకటనలో ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News