Saturday, April 27, 2024

దళిత నేత ప్రధాని కాగలరా?

- Advertisement -
- Advertisement -

విపక్ష ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన చిచ్చు కొత్తమలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పిఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఆ అవసరం లేదని ఎన్‌సిపి తదితర పక్షాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సుముఖంగా వున్నట్లులేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేరును టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించడంతో అకస్మాత్తుగా కలకలం రేగింది. దీనిపై తాజాగా స్పందించిన ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఎన్నికలకు ముందు పిఎం అభ్యర్థిని ప్రకటించకపోతే ఏమీ కాదంటూ కొట్టిపారేశారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లోనూ ముందుగా పిఎం అభ్యర్థిని ప్రకటించలేదని, ఎన్నికల తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారని ఆయన గుర్తుచేశారు. మార్పు రావాలని ప్రజలు కోరుకుంటే, దానికి అనుగుణంగా వారు నిర్ణయం తీసుకొంటారని చెప్పారు. వాస్తవానికి ఢిల్లీ భేటీకి రెండు రోజుల ముందు ప్రధాని అభ్యర్థిత్వం విషయమై ఎన్నికల అనంతరమే నిర్ణయం తీసుకుంటామని స్వయంగా మమతా ప్రకటించారు. అయితే ఆ మరుసటి రోజున ఆమె ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలవగానే ఆమె ధోరణి మారిపోయింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలలో కూటమి భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించేందుకు కారణమైన రాహుల్ గాంధీని ఇరకాటంలో పడేసేందుకు ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చిన్నట్లు కనిపిస్తోంది.
అదే సమయంలో ఖర్గే పేరును ప్రతిపాదించడం ద్వారా దేశంలో ఇప్పటికే బిజెపి పట్ల విముఖంగా వున్న దళిత వర్గాల ఓట్లను మూకుమ్మడిగా పొందవచ్చని ఎత్తుగడని మమత, కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అయితే, ఓ దళితుడిని ప్రధానిగా ఎన్నుకునేందుకు దేశంలోనే రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. బిఎస్‌పి మినహా ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవ్వరూ సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. గతంలో కనీసం నాలుగు సార్లు ‘దళిత ప్రధాని’ ప్రతిపాదన వచ్చిన్నప్పుడు కీలక రాజకీయ నాయకులు మూకుమ్మడిగా వ్యతిరేకించడం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఆ నాలుగు సార్లు కూడా ప్రధాని పదవికి పరిగణనలోకి వచ్చిన పేరు బాబు జగ్జీవన్ రామ్ కావడం గమనార్హం. మొదటగా 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆ సమయంలో ఆమె కేబినెట్‌లో సీనియర్ మంత్రి అయిన బాబు జగ్జీవన్ రామ్‌ను ‘తాత్కాలిక ప్రధాని’గా చేయాలనే ప్రతిపాదన కాంగ్రెస్ వర్గాలలో వచ్చింది. అయితే, రాజ్యాంగంలో ‘తాత్కాలిక ప్రధాని’ అనే అంశం లేదని, ప్రధాని అంటే పూర్తి స్థాయి ప్రధాని కాగలరని భయంతో ఒకసారి ఆ పదవి చేబడితే ఆయనను దింపడం కష్టం కాగలదని అందుకు వ్యతిరేకించిన ఇందిరాగాంధీ ఏకంగా ఎమర్జెన్సీని విధించారు. ఆ తర్వాత 1977లో మొదటిసారి కాంగ్రెస్ ఓటమి చెంది, జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన్నప్పుడు సుమారు 300 మంది ఎంపిలున్న ఆ పార్టీలో మాజీ లోక్ దళ్, మాజీ జనసంఘ్ పార్టీలకు చెందిన 200 మంది వరకు జగ్జీవన్ రామ్ పేరును ప్రతిపాదించారు. అయితే నాడు పెద్దరికం చేసిన జయప్రకాశ్ నారాయణ్, జెబి కృపాలిని ఎంపిల అభిప్రాయాలను వ్యక్తిగతంగా సేకరించే పేరుతో కేవలం 35 మంది ఎంపిలున్న మొరార్జీ దేశాయ్ పేరును ప్రకటించారు.
ఆనాడు జగ్జీవన్ రామన్‌ను ప్రధానిగా చేస్తే పూర్తి కాలం ఆ ప్రభుత్వం మనుగడ సాగించి ఉండెడిది అనడంలో సందేహం లేదు. ఆ సందర్భంగా ‘భారత దేశంలో ఓ దళిత్ ప్రధాని కావడం అసంభవం’ అంటూ జగ్జీవన్ రామ్ తన అసంతృప్తిని బహిర్గతం చేశారు.

ఇప్పటికి కూడా పరిస్థితులలో పెద్దగా మార్పు కనబడటం లేదు. తిరిగి 1979లో అవిశ్వాస తీర్మానంతో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు మరోసారి జనతా పార్టీ జగ్జీవన్ రామ్‌ను ప్రధానిగా ప్రతిపాదించింది. కానీ నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వ్యక్తిగత రాగద్వేషాలను దృష్టిలో ఉంచుకొని మెజారిటీ లేని చరణ్ సింగ్‌ను ప్రధానిగా ఎంపిక చేయడం, ఆ ప్రభుత్వం పార్లమెంట్ ముఖం చూడలేకపోవడం తెలిసిందే.తిరిగి 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు దేశ చరిత్రలో మొదటిసారిగా ‘ఎవ్వరు ప్రధాని?’ అనే అంశంపై జరిగాయి. ‘దళిత ప్రధానిని ఎన్నుకోండి’ అంటూ జనతా పార్టీ ప్రజల ముందుకు వెళ్ళింది. కానీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఏ పార్టీ కూడా దళిత ప్రధాని అంశాన్ని తెరపైకి తీసుకు రాలేదు.తమ పార్టీ మైనారిటీ, దళిత్, గిరిజన వర్గాలకు రాష్ట్రపతి పదవులు కల్పించిందని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సహితం ‘దళిత ప్రధాని’ అనలేరు. ప్రధాన మంత్రి పదవి ఇవ్వకపోయే, కనీసం కేంద్రంలో అధికారంలో వున్న ఏ రాజకీయ పార్టీ కూడా ఓ దళితుడిని తమ పార్టీ అధ్యక్షునిగా చేసే సాహసం చేయలేకపోతోంది. మొదటిసారిగా 60వ దశకంలో ఇందిరా గాంధీ దామోదరం సంజీవయ్య ను దేశంలో మొదటిసారి దళిత్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో చేస్తే, నాటి కాంగ్రెస్ పార్టీలోని పెత్తందారీ వర్గాలు ఆయనను గద్దె దించే వరకు నిద్ర పోలేదు.ఆయనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆమె చేసినా సొంత పార్టీ వారే సహాయ నిరాకరణ కావించారు.

మూడున్నర దశాబ్దాల అనంతరం ప్రధానిగా వాజపేయి బిజెపి అధ్యక్షునిగా బంగారు లక్ష్మణ్‌ను అధ్యక్షునిగా చేస్తే ఆయన కూడా సొంత పార్టీ వారి నుండే సహాయ నిరాకరణ ఎదుర్కొన్నారు. దామోదరం సంజీవయ్య, బంగారు లక్ష్మణ్‌లపై సొంతపార్టీ వారే కుట్ర పూరితంగా ‘అవినీతి ఆరోపణలు’ చేరి వారిని అపఖ్యాతి పాలు కావించారు. దళిత నేతలుగా సొంత పార్టీ నేతల నుండే ‘వివక్ష’కు గురయ్యారు. ఇందిరా గాంధీ, వాజపేయి వంటి బలమైన నేతలు అండగా వున్నప్పటికీ సంజీవయ్య, లక్ష్మణ్ ఎదురీతకు గురవాల్సి వచ్చింది. అందుకనే ఓ దళితుడిని ప్రధానిగా అంగీకరించేందుకు భారతీయ సమాజం ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం అవుతుంది. సమీప భవిష్యత్తులో సహితం అటువంటి అవకాశం కనిపించడం లేదు. కనీసం కేంద్ర మంత్రి వర్గంలో హోం, రక్షణ వంటి మంత్రిత్వ శాఖలు కొన్ని సందర్భాలలో లభించినా కీలకమైన ఆర్థిక శాఖ ఇప్పటి వరకు దళిత నేతలకు లభించలేదు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలలో ఒక దళిత్ కూడా లేరు. అందుకనే ఇప్పుడు ‘ఇండియా’ కూటమిలో ‘దళిత్ ప్రధాని’ అంశాన్ని మమత, కేజ్రీవాల్ తరపైకి తీసుకు రావడం వెనుక వ్యక్తిగతంగా ఖర్గే పేరును ప్రతిపాదించే ఉద్దేశం కాకపోవచ్చు. దేశంలోని దళిత వర్గాలను ఆకట్టుకోవాలనే ఎత్తుగడ కావచ్చు. వాస్తవానికి ఖర్గే సుదీర్ఘ రాజకీయ జీవనంలో ఏనాడూ ‘ఓ దళిత నేత’గా ముద్ర వేసుకొనే ప్రయత్నం చేయలేదు.

అందువల్లన ఆయన ప్రభావం కర్నాటక వెలుపల దళిత వర్గాలలో పెద్దగా ఉండకపోవచ్చు. ఎవ్వరూ తమను తాము ప్రధాని అభ్యర్థిగా చెప్పుకొనే ప్రయత్నం బహిరంగంగా చేయకపోయినప్పటికీ ‘ఇండియా’ కూటమిలో పలువురు నాయకులలో అటువంటి ఆశలు ఉన్నాయి. ఖర్గే పేరు ప్రతిపాదనపై బీహార్ సిఎం, జెడియు నేత నితీశ్ కుమార్, ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వీరిద్దరూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నితీశ్‌ను పిఎం అభ్యర్థిగా పేర్కొంటూ బీహార్‌లో పలు చోట్ల పోస్టర్లు కూడా వెలిశాయి.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనే ‘ఇండియా’ కూటమిలో విభేదాలు బహిర్గతమయ్యాయి. కూటమిలో పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌పి, ఆప్ తదితర పార్టీలు పోటీగా అభ్యర్థులను బరిలోకి దింపాయి. సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ మిత్రద్రోహానికి పాల్పడిందని ఆరోపించిన అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మధ్యప్రదేశ్‌లో సొంతంగా బరిలోకి దిగింది. అయితే, ఖర్గే పేరు జాతీయ స్థాయిలో దళిత వర్గాలపై తగిన ప్రభావం చూపకపోయినా ఇప్పటికే బిజెపి బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో ‘ఇండియా’ కూటమి దూసుకుపోయే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు దక్షిణాది నుండి దేవెగౌడ, పివి నరసింహారావులు మాత్రమే ప్రధాని పదవి చేపట్టగలిగారు. పైగా, అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెబుతూ ఉండడంతో ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ‘ఇండియా’ కూటమికి 2024 ఎన్నికలలో కొంత సానుకూలత ఏర్పడవచ్చు. అయితే, ప్రధాని పదవికి ప్రజాదరణతో నరేంద్ర మోడీతో వ్యక్తిగతంగా పోటీపడ గల నేతలు ఎవ్వరూ ఇప్పుడు దేశంలో లేరని చెప్పవచ్చు. 2014లో ఆయన పట్ల ఎంతటి ప్రజాకర్షణ ఉందో, ఇప్పడు కూడా అంతకన్నా ఎక్కువ కాకపోయినప్పటికీ అంతగానే వుంది.ఈ విషయంలో ఖర్గే మోడీకి దరిదాపులలోకి రాలేరు. ‘ఇండియా’ కూటమి నేతలు 2024 ఎన్నికలను మోడీకి, మోడీ వ్యతిరేకుల మధ్య పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, మోడీ- రాహుల్ మధ్య పోరుగా మార్చే ప్రయత్నం బిజెపి వర్గాల నుండి జరుగుతుంది. అందుకనే తాను ‘ప్రధాని అభ్యర్థి’ కాదు అనే సంకేతం ఇచ్చేందుకు రాహుల్ ప్రయత్నించాల్సి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News