Wednesday, May 1, 2024

యుపిఎనా.. అదెక్కడుంది?

- Advertisement -
- Advertisement -

Mamatha Meets NCP chief Sharad Pawar

కాంగ్రెస్‌పై తృణమూల్ అధినేత్రి మమతా బెనరీ పరోక్ష విమర్శ్జ
ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో రాజకీయ చర్చ

ముంబయి: మరో రెండేళ్ల తర్వాత జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రతిపక్షాల కూటమి ఏర్పడే అవకాశముందని తాను భావిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ స్థానంలో బలమైన విపక్ష కూటమికి నేతృత్వం వహించాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న ప్రతిపక్షాల సమావేశాలకు తృణమూల్ దూరంగా ఉండడమే కాకుండా ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తేవడానికి దీదీ ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో బుధవారం ఆమె ముంబయిలో ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మమత విలేఖరులతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం యుపిఎ లేదని కాంగ్రెస్ లక్షంగా విమర్శలు గుప్పించారు.

యుపిఎకు పవార్ నాయకత్వం వహిస్తారా అని అడగ్గా,‘ యుపిఎనా అదెక్కడుంది? దేశంలో ఇప్పుడు యుపిఎ లేదు. మేమంతా కలిసి దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని మమత అన్నారు. శరద్ పవార్ సీనియర్ నేత అని,ఆయనతో రాజకీయ అంశాలు చర్చించానని.. పవార్ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవించానని దీదీ చెప్పుకొచ్చారు. బిజెపిని మట్టి కరిపించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని మమత పిలుపునిచ్చిన క్రమంలో శరద్ పవార్ ఆమెతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్రలో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన మమత మంగళవారం సాయంత్రం శివసేన నేతలు ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్‌లతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో భేటీ కావాలనుకున్నప్పటికీ థాకరే ఇటీవల సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న కారణంగా అది జరగలేదు.

ఎవరినీ దూరం పెట్టం: పవార్

కాగా మమతతో భేటీపై శరద్ పవార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన పవార్ తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తాము అనేక అంశాలు చర్చించామని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి, ప్రజల మేలు కోసం ఉమ్మడి కృషిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తాము అంగీకరించినట్లు ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో భావసారూప్యం ఉన్న శక్తులన్నీ ఒక్కటి కావాలని, ఉమ్మడి నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది మమత ఉద్దేశమన్న పవార్ తమ ఆలోచనలు ఈ రోజు కోసం కాదని, రాబోయే ఎన్నికల కోసమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లేని కూటమి రాబోతోందా అని అడగ్గా, ‘బిజెపిని వ్యతిరేకించే వారంతా మాతో కలపడాన్ని స్వాగతిస్తాం. ఎవరినీ మినహాయించే ప్రసక్తి లేదు’ అని పవార్ స్పష్టం చేశారు. శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌తో పపాటుగా ఎన్‌సిపి కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News