Monday, April 29, 2024

ఇంటర్నెట్‌లో చూశా.. రూ. 25 వేలు కట్టను… ప్రయాణికుడి వాదన

- Advertisement -
- Advertisement -

ముంబై : ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తన అనుచిత ప్రవర్తనతో తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన అతడిని, కాళ్లు చేతులు కట్టేసి సీటులో కూర్చోబెట్టారు. అనంతరం విమానయాన సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది. ఈ క్రమం లోనే కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినా , తన ‘ఇంటర్నెట్ ’వాదనతో దాన్ని నిరాకరించి జైలుకే వెళ్తానని చెప్పడం గమనార్హం. దీంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని ఆదేశించింది. భారత సంతతికి చెందిన రత్నాకర్ ద్వివేది (37) ఇటీవల లండన్ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. విమానం లోని బాత్రూంకి వెళ్లి పొగతాగుతుండగా, అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో అరవడం మొదలు పెట్టిన అతడు, అంతటితో ఆగకుండా విమాన డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు.

అతడి ప్రవర్తనతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు అతడి కాళ్లు, చేతులు కట్టేసి కుర్చీలోనే కూర్చునేలా చేశామని విమాన సిబ్బంది వెల్లడించారు. ముంబై చేరుకున్న వెంటనే అతడిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీకి అప్పజెప్పడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎయిరిండియా వెల్లడించింది. దీంతో అతడిపై ఐపిసితోపాటు ఎయిర్ క్రాఫ్ట్ చట్టం 1937 లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, రూ. 25 వేలు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మొత్తాన్ని చెల్లించేందుకు అతడు నిరాకరించాడు. ఇంటర్నెట్‌లో వెతికితే సంబంధిత సెక్షన్ కింద రూ. 250 మాత్రమే జరిమానాగా ఉందని, అంతే చెల్లిస్తానని వాదించాడు. కావాలంటే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. దీంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News