Thursday, May 16, 2024

మణిపూర్ ఘటన భయానకం:సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడానికి సంబంధించి వెలుగుచూసిన వీడియోను భయానకంగా సుప్రీంకోర్టు సోమవారం అభివర్ణించింది. ఈ ఘటనకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఇప్పటివరకు తీసుకున్న చర్య్లలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు మహిళలను అరాచక మూకలకు నేరుగా అప్పగించిన రాష్ట్ర పోలీసులకు ఈ కేసు దర్యాప్తును అప్పగించదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయాధికారులు తమ వాదనలను వినిపించిన తర్వాత మణిపూర్‌లో పరిస్థితిని పర్యవేక్షించడానికి ఒక సిట్‌ను కాని, మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని కాని నియమించే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మణిపూర్ హింసాకాండపై దాఖలైన పలు పిటిషన్ల విచారణను మంగళవారం నిర్వహిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన మే 4వ తేదీన వెలుగుచూసినప్పటికీ మణిపూర్ పోలీసులు మే 18న ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారని, ఇందుకు 14 రోజులు ఎందుకు పట్టిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

పోలీసులు ఏం చేస్తున్నారు..వీడియో కేసులో ఎఫ్‌ఐఆర్‌ను జూన్ 24న మెజిస్టీరియల్ కోర్టుకు ఎందుకు బదిలీ చేశారు. అది కూడా ఒక నెల మూడు రోజుల తర్వాత అని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనంలో జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.

ఇది చాలా భయానకం. పోలీసులే ఆ ఇద్దరు మహిళలను మూకల చేతిలో పెట్టినట్లు మీడియా వార్తలు వచ్చాయి. మణిపూర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయకూడదని మేము భావిస్తున్నాము అని ధర్మాసనం తెలిపింది.

ధర్మాసనం ప్రశ్నలకు జవాబివ్వడానికి కొంత వ్యవధి ఇవ్వాలని అటార్నీ జనరల్ వెంకటరమణి కోరగా ఇప్పటికే సమయం మించిపోయిందని, హింసాకాండతో అల్లాడిపోతున్న రాష్ట్రానికి, సర్వం కోల్పోయిన బాధితులకు సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతేనా ఉందని ధర్మాసనం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి, ఎంతమందిని అరెస్టు చేశారో వివరాలు సమర్పించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధిత ప్రజల పునరావాసం కోసం రాష్ట్రానికి ఎంతమేర సహాయం అందచేశారని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News