Monday, May 6, 2024

14 నెలల తర్వాత మెహబూబా ముఫ్తీకి విముక్తి..

- Advertisement -
- Advertisement -

Mehabuba mufthi released from House Arrest

శ్రీనగర్: 14 నెలలుగా నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీ ఎట్టకేలకు విముక్తి పొందారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పిడిపి) నాయకురాలు అయిన ముఫ్తీ ప్రజా భద్రతా చట్టం (పిఎస్‌ఎ) పరిధిలో నమోదైన అభియోగాల మేరకు ఇంతకాలం నిర్బంధంలో ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి సంబంధిత ఆర్టికల్ 370ని రద్దు చేసిన కొద్ది గంటలపసంహరించుకోవడానికి ముందు ఆమెను ముందు జాగ్రత్త చర్యల్లోభాగంగా అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెపై కటుతరమైన పిఎస్‌ఎ పరిధిలో కేసులు పెట్టారు. దీనితో ఆమె నిర్బంధం కొనసాగుతూ వచ్చింది. ఎనిమిది నెలల పాటు ఆమెను ప్రభుత్వ కేంద్రాలలో ఉంచారు. ఈ ఏడాది ఎప్రిల్ 7వ తేదీన అధికార నివాసానికి మార్చి అక్కడ గృహ నిర్బంధం విధించారు. ఆమె నిర్బంధాన్ని కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది. మంగళవారం రాత్రి ఆమెకు అధికారికంగా విడుదల ప్రకటించినట్లు జమ్మూ కశ్మీర్ అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ తెలిపారు. విడుదల గురించి మెహబూబా ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. కూతురు ఇల్తిజా ఈ ట్విట్టర్‌ను నిర్వహిస్తున్నారు.

‘ముఫ్తీ ఇంతకాలపు అక్రమ నిర్బంధం ఎట్టకేలకు ముగిసింది. ఈ దశలో ఇంతకాలం ఆమెకు మానసికంగా నైతికంగా మద్దతు ప్రకటిస్తూ వచ్చిన వారందరికీ షుక్రియా తెలియదల్చుకుంటున్నాను. ఈ విషయంలో అందరికీ రుణపడి ఉంటాను’ అంటూ మెహబూబా కూతురు ఇల్తిజా స్పందించారు. ఈ మేరకు తాను ప్రకటన వెలువరిస్తున్నట్లు తెలిపారు. అల్లా అందరినీ రక్షించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ముఫ్తీ తరఫున దాఖలు అయిన పిటిషన్‌పై తదుపరి విచారణ గురువారం జరగనుంది. జులైలో ఆమె నిర్బంధాన్ని రాష్ట్ర అధికార యంత్రాంగం మూడు నెలల పాటు పొడిగించింది. ఇటీవలే సుప్రీంకోర్టు పిటిషన్ విచారణ దశలో పలు ప్రశ్నలు సంధించింది. ఇంతకాలం నిర్బంధంలో ఉంచారు కదా. ఈ ఏడాది అంతా ఆమెను ఇదే విధంగా ఉంచుతారా? అసలు మీ ఆలోచన ఏమిటని ఇటీవలే సుప్రీంకోర్టు ధర్మాసనం అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించింది. ఎంతకాలం ఈ నిర్బంధం అనేది తెలియచేస్తే స్పష్టత ఉంటుంది కదా అని తెలిపింది. ఈ వ్యాఖ్యల తరువాత రెండు వారాలకు ఇప్పుడు అధికార యంత్రాంగం ఆమెకు గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించింది. ముఫ్తీ విడుదల పట్ల మాజీ సిఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. ఆమె నిర్బంధకాండ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు విరుద్ధంగా సాగిందని విమర్శించారు. ఒమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి సీనియర్ అబ్దుల్లా పలువురు రాజకీయ నాయకులు కార్యకర్తలను ఆర్టికల్ 370 రద్దుకు ముందు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సిఎం ఒమర్ మార్చి 25వ తేదీన విడుదల అయ్యారు. ఆయన తండ్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా మార్చి 13వ తేదీన విముక్తి పొందారు.

Mehabuba mufthi released from House Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News