Friday, April 26, 2024

ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 257

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉపాధి హామీ పనులకు కూలీలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా కోరారు. శనివారం ఆ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డిఆర్డిఓలు, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీలు ఉపాధి పనులకు కూలీల హాజరుపై ఆయన సమీక్షించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజువారీగా సగటున 50 మందికి తగ్గకుండా కూలీలు హాజరుతో జిల్లా వ్యాప్తంగా పది వేల మంది కూలీలకు తగ్గకుండా ఉపాధి పనులకు ప్రతిరోజు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ నెల 20వ తేదీలోగా 10 లక్షల వేజ్ సీకర్లు ఉపాధి పనులకు హాజరయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని, చేపట్టిన పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలలు అనుకూలంగా ఉన్నందున పెద్ద సంఖ్యలో కూలీలు హాజరయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. కూలీల సంఖ్య పెరగడంతో పాటు కనీస వేతనం రూ. 257 వరకు అనుమతి ఉన్నందున సగటు కూలి పెరగాలని ఆయన అన్నారు. ఈ విషయంలో క్షేత్ర సహాయకులతో తరచూ టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించాలని, పనులు వాటి కొలతలు సక్రమంగా చేపట్టినచో సగటు కూలి పెరుగుతుందని ఆయన అధికారులకు సూచించారు. ఉపాధి హామీలో భాగంగా చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ పనులను మార్చి 25లోగా పూర్తి చేసి పనుల వివరాలను ఎఫ్‌టిఓలో ఆన్‌లైన్ నమోదులు చేపట్టాలని ఆయన కోరారు.

పనులన్నింటికీ ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు తరచూ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సంజీవరావు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News