Saturday, April 27, 2024

నాలుగు నెలల్లో సింగూరుకు జలాలు

- Advertisement -
- Advertisement -
Harish Rao
పల్లె ప్రగతిలో రాష్ట్రంలో రెండో స్థానం,  ప్రజలు స్వచ్ఛత పాటించకుంటే జరిమానా తప్పదు,  పల్లె ప్రగతి సమ్మేళనంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి: కాళేశ్వరం నీటిని నాలుగు నెలల్లో సింగూరు ప్రాజెక్టుకు తీసుకొస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గ్రామా ల్లో డంప్ యార్డులు, స్మశాన వాటికల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా తర్వాత సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని అభినందించారు. సోమవారం సంగారెడ్డి చౌరస్తాలోని పిఎస్‌ఆర్ గార్డెన్‌లో జరిగిన పల్లెప్రగతి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఆయా డంప్ యార్డుల్లో నిల్వ చేయాలని సూచించారు. తడి చెత్తతో వర్మీ కంపోస్టును తయారు చేసుకుని గ్రామాల్లోని మొక్కలకు ఉపయోగించుకోవాలని మంత్రి చెప్పారు.

దీని కోసం ఎంపిడిఒలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. గ్రామాల్లో నాటిన మొక్కలు 85 శాతానికి పైగా బతికేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. లేకుంటే పల్లె ప్రగతి లక్షం దెబ్బతింటుందని, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా అభివృద్దిలో ముందున్న సర్పంచ్‌లను సన్మానిస్తామన్నారు. మండలానికి ఒక సర్పంచ్‌ను ఎంపిక చేస్తామని చెప్పారు. తాగునీటికి ఇబ్బందికి లేకుండా మిషన్ భగీరథ నీరును రోజు విడిచి రోజు విడుదల చేస్తామని తెలిపారు. అవసరాన్ని బట్టి ఆయా గ్రామాల్లో వృధాగా ఉన్న బోర్లను, బావులను అద్దెకు తీసుకోవాలని, దీనికిగాను నెల ఒక్కింటికి నాలుగు వేల చొప్పున కలెక్టర ద్వారా మంజూరు చేయిస్తామని మంత్రి తెలిపారు.

పల్లె ప్రగతితో అంతిమం గా ప్రజల బాగును సిఎం కోరుకుంటున్నారని, దేశంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ను ఇచ్చినఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇక 24 గంటల కరెం ట్, ప్రతి గ్రామంలో డంప్ యార్డు, వైకుంఠధామం, హరితహారం దేశంలో అభివృద్ది చెందిన రాష్ట్రాలుగా చెప్పుకుంటున్న హర్యానా, పంజాబ్‌లో కూడా లేవన్నారు. జిల్లాలోని అన్ని కార్యదర్శి పోస్టును భర్తీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ నెల 26 వరకు అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి లక్షాన్నిచేరుకోవాలని, ఆ తర్వాత ఎప్పుడైనా సిఎం కెసిఆర్, మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారని హెచ్చరించారు.

నిర్లక్షంగా ఉన్న వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. గ్రామాల్లో ఎవరైతే తడి,పొడి చెత్తను వేరు చేయరో, మొక్కలను సంరక్షించరో, మరుగుదొడ్లను ఉపయోగించరో..వారికి జరిమానా విధించాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదని, ప్రతి నెల 339 కోట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతినెలా 61 కోట్లను డంప్‌యార్డులు, వైకుంఠదామాల బిల్లుల కోసం విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ నిధుల నుంచి సిసి రోడ్ల కోసం 500 కోట్లు విడుదల చేస్తున్నామని, రెండు దశ ల్లో ఈ నిధులు అన్ని గ్రామాలకు చేరుతాయని చెప్పారు. ఈ సందర్భంగా కంగ్టి ఎంపిడిఒ జయసింగ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్‌సి ఫరీదుద్దీన్, ఎంఎల్‌ఎ మానిక్‌రావు, అదనపు కలెక్టర్ రాజశ్రీ షా, జడ్‌పి చైర్‌పర్సన్ మంజుశ్రీ, వైస్ ఛైర్మన్ ప్రభాకర్, జడ్‌పిటిసి సునితా, కొండల్‌రెడ్డి, ఎంపిపి లావణ్య పాల్గొన్నారు.

Minister Harish Rao At village Progress Conference

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News