Sunday, April 28, 2024

నాడు అగ్గిపెట్టెలు.. నేడు అన్ని హంగుల ఇండ్లు

- Advertisement -
- Advertisement -

Minister KTR distributes Double bedroom houses

 

హౌసింగ్‌లో దేశానికే తెలంగాణ ఆదర్శం
లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ల పంపిణీ
పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం
డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే ఇళ్లన్ని అగ్గిపెట్టెల్లా, డబ్బాల్లా ఉండేవని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. దానికే పేదల కోసం ఎంతో చేసినట్లుగా ఫోజులు కొట్టే వారని విమర్శించారు. అందులో అంతులేని అవినీతికి పాల్పడ్డారన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించి డబ్బులు దండుకున్నారని ధ్వజమెత్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులు పైసా చెల్లించే అవసరం లేకుండానే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. గృహనిర్మాణ ఇండ్ల నిర్మాణ థకం క్రింద గత 35 ఏండ్లలో రాష్టంలో 40 లక్షల ఇండ్లు నిర్మించినట్లు గత పాలకులు లెక్కలు చూపారని, అయితే నిజంగానే అన్ని ఇండ్లు నిర్మించి ఉంటే నేడు రాష్ట్రంలో సొంతిండ్లు లేని వారెందుకున్నారని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పే దమ్ము ఆ పార్టీలకు ఉందా? అని మంత్రి కెటిఆర్ నిలదీశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఇందులో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్టం చేపట్టని విధంగా రూ.18 వేల కోట్ల వ్యయంతో 2.50 లక్షల రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. గతంలో పెద్దలు ఇల్లు కట్టి చూడు… పెండ్లి చేసి చూడు అని చెబుతుండేవారని, దీనికి అర్ధం ఈ రెండు పనులు చాలా కష్టంతో కూడుకున్నవన్నారు. కాని సిఎం కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక వైపు పేదింటి ఆడబిడ్డ పెండ్లికి మేనమామగా రూ.1 లక్ష 16 వేలు ఇస్తుండగా, మరోవైపు పేదింట పెద్ద కొడుకుగా పేదలు ఆత్మ గౌరవంగా చుట్టపోడు వచ్చినా ఇబ్బంది లేకుండా రెండు పడక గదులు, ఒక కిచెన్, ఒక హాలులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు.

సోమవారం నగరంలోని జియాగూడ, గోడేకీ కబర్, కట్టెలమండి తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.95కోట్లతో నిర్మించిన 1152 ఇళ్లను అర్హులైన వారికి మంత్రి కెటిఆర్ అందజేశారు. లబ్ధిదారులంతా సామూహికంగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పేదలకు అసలైన దసరా పండుగ ఇదన్నారు. ఎన్నో యేళ్ళుగా సొంతింటి కోసం కన్న కళలు ఇప్పుడు నేరవేరయాన్నారు. దీంతో వారి ఆనందానికి అవధలు లేకుండా ఉన్నాయన్నారు. ముఖ్యంగా లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం చూస్తుంటే…మాటల్లో వర్ణించ లేని విధంగా ఉందని అన్నారు. ఇదే సిఎం కెసిఆర్ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవనం సాగించాలన్న ఏకైక లక్షంతోనే రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిందన్నారు.

ప్రైవేటు అపార్టుమెంట్లకు దీటుగా, గేటెడ్ కమ్యునిటి ప్రాంగణాల్లో ఉన్న సౌకర్యాలకు ఏ మాత్రం తీసిపోకుండా డబుల్‌బెడ్ రూమ్ ప్రాంగణాల్లో కూడా ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. చూడచక్కని మొక్కలు, చిన్నారుల కోసం పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లు మార్కెట్‌లో రూ.70 వేల కోట్లు ఉంటుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఇళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 56 షాపుల కాంప్లెక్స్‌లను కూడా నిర్మించామన్నారు. లబ్ధిదారులంతా ఒక సొసైటీగా ఏర్పడి అద్దెకచ్చిన షాపులపై వచ్చే మొత్తంతో లిఫ్టులు, పారిశుద్ధ పనులను సమక్రంగా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే అందమైన కాలనీగా మలుచుకోవాలని మంత్రి కెటిఆర్ అన్నారు. పైరవీలకు తావు లేకుండా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. తాము కట్టించిన ఇళ్లలో ఒక్కోదానికి సర్కారు రూ.9 లక్షలు ఖర్చుచేసిందని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే తాము ఇళ్లు కట్టి ఇస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం లక్ష ఇళ్లు కట్టి సిద్ధంగా ఉంచామని, దశలవారీగా పేదలకు అందిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గత ప్రభుత్వాల్లో పేదల ఇళ్ల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఎక్కడా అవినీతి మరకలు అంటలేదన్నారు. ఇది పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని ఆయన వ్యాఖ్యానించారు.

మురికివాడలు లేని నగరంగా రూపాందించాలన్నదే సిఎం లక్ష్యం

హైదరాబాద్ నగరాన్ని మురికివాడలు లేని నగరంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్ధాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి కెటిఆర్ అన్నారు. అందుకే సొంత ఇళ్లులేని పేదలందరికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. ఇదేదో మొక్కుబడిగా కాకుండా నాణ్యత విషయంలోనూ, డబ్బుల విషయంలో రాజీపడకుండా నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ రాక ముందు కరెంట్ ఉంటే వార్త…కాని ఇపుడు కరెంట్ పోతే వార్త అని అన్నారు. తాను చిన్నప్పుడు అబిడ్స్ ప్రాంతంలో ఒక పాఠశాలలో చదువుకున్నానని మంత్రి కెటిఆర్ తెలిపారు. అప్పట్లో ఎప్పుడు గొడవలు జరిగేవని, రోజుల తరబడి కర్ఫ్యూలు ఉండేవన్నారు. ఇప్పుడు నగరంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు. 60 ఏళ్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాన్నామని కెటిఆర్ అన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. మూసీ సుందరీకరణ త్వరలోనే చేపడతామని వ్యాఖ్యానించారు.

విజయదశమి కానుకగా పేదలకు సొంత ఇల్లు

పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం విజయదశమి కానుకగా ప్రభుత్వం సాకారం చేసిందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ కాలనీలో సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పేదకుటుంబాల కోసం అవసరమైన అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు. తాగునీరు, విద్యుత్, సిసి రోడ్లు, షాపింగ్ కాoప్లెక్స్‌తో పాటు బస్తీ దవాఖాన వంటి ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పించందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఏకైక సిఎం కెసిఆర్ అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 560 చదరపు అడుగలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నామని ఆయన అన్నారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఎల్‌ఎలు రాజాసింగ్, కౌసర్ మొహియుద్దీన్, జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమొహంతి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News