Wednesday, May 15, 2024

ఆప్షన్ల గడువుపై పరిశీలన

- Advertisement -
- Advertisement -
Minister Sabita Indrareddy Meets Teachers Unions
ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి సబిత భేటీ
టీచర్ల కేటాయింపులపై వినతిపత్రాలు అందజేసిన నేతలు

హైదరాబాద్ : కొత్త జిల్లాలవారీగా టీచర్లను కేటాయింపులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి టీచర్ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీచర్ సంఘాల నేతలు తమ అభ్యంతరాలను ప్రస్తావించారు. ఉపాధ్యాయ సంఘాలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను మంత్రికి అందజేశారు. అయితే ఉపాధ్యాయులు ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు గడువు కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి టీచర్ సంఘాల నేతలతో చెప్పినట్లు తెలిసింది. స్థానికత అంశంపై సిఎస్‌తో చర్చించాలని చెప్పినట్లు సమాచారం. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి అన్నట్లు తెలిసింది.

ఉపాధ్యాయుల కేటాయింపులో సీనియారిటీతోపాటు కొత్త జిల్లా స్థానికతను కూడా పరిగణలోకి తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవిలు కోరారు. నూతన జిల్లాలో 80 శాతం పోస్టులు ఆ జిల్లా స్థానికులకు కేటాయించాలని తెలిపారు. ఉపాధ్యాయుల కేటాయింపుల్లో గడువు పెంచుతూ స్థానికత పాటించాలని ఎస్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జి.సందానందం గౌడ్, ఎం.పర్వతరెడ్డిలు కోరారు. టీచర్ పోస్టుల కేటాయింపు స్థానికత ఆధారంగా పారదర్శకంగా చేపట్టాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుఉల కె.రమణ, మైస శ్రీనివాసులు కోరారు. సీనియారిటీ జాబితా అనేది రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా చేయాలని బిసిటిఎ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు తెలిపారు. ఐఛ్చికతలను మొదటి ప్రాధాన్యతగా స్థానికతలను తీసుకోవాలని, ఆ తర్వాత సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని టిపిటియు రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ కోరారు. ఉమ్మడి జిల్లాలవారీగా సీనియారిటీ జాబితా ప్రకటించి అభ్యంతరాలను 2 వారాల గడువు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరాంకుశం రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజ రంగారెడ్డి, కోశాధికారి బి.తుకారాం కోరారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది సీనియారిటీ జాబితాను ప్రచురించి కేటాయింపులు చేపట్టాలని అన్నారు.

ఉత్తర్వులు సవరించాలి

నూతన జిల్లాలకు ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన కేటాయింపునకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను సవరించాలని పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీ రెల్లి కమలాకర్‌రావులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంత్రి కలిసిన వారి లో ఎంఎల్‌సిలు కాటేపల్లి జనార్థన్‌రెడ్డి, రఘోత్తం రెడ్డి, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్‌లు ఉన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభు త్వం ఇచ్చిన మార్గదర్శకాలపై అభిప్రాయాలను కో రుతూ ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు లక్షమంది ఉపాధ్యాయులందరినీ స్థానచలనం కలిగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఈ సందర్భంగా పిఆర్‌టియు టిఎస్ సంఘం నేతలు తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీలను పోస్టుల సంఖ్యకు అనుపాతంలో ఉంచుటకు ఒక జిల్లా నుండి కొంత మంది వేరే జిల్లాకు వెళ్ళవలసిన సందర్భంలో సీనియర్ల ఐచ్ఛికాన్ని పరిగణిస్తూ త ప్పనిసరి అయితే జూనియర్ ఉపాధ్యాయుడికి స్థా నచలనం కలిగే విధంగా మార్గదర్శకాలను సవరించాలని కోరారు.

తప్పనిసరి అయితే కేటాయింపులలో వితంతువులను, వికలాంగులను, స్పౌజ్, వ్యాధిగ్రస్తులను, ఒంటరి మహిళలను మినహాయించాలని అన్నా రు. అదేవిధంగా సీనియారిటీ లిస్టులు రూపొందించడానికి అన్ని జిల్లాల్లో ఒకేవిధమైన మార్గదర్శకాలను రాతపూర్వక ఉత్తర్వుల ద్వారా ఇవ్వాలని పేర్కొన్నారు. పనిచేస్తున్న జిల్లాకే కేటాయింపు జరిగితే ఆ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో కొనసాగుతాడా..? లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులు ఐచ్ఛికాలను మార్చుకొనుటకు మరొక అవకాశం ఇవ్వాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని పిఆర్‌టియు నేతలు తెలిపారు.

పిఆర్‌టియుఎస్ చేసిన సూచనలు

1. ప్రస్తుత నూతన జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారిని పాఠశాలల్లోనే కొనసాగించాలి.
2. ఉమ్మడి జిల్లా పరిధిలో ఖాళీలను తగిన అనుపాతములో సరిచేయుటకు తప్పనిసరిగా ఉపాధ్యాయులను ప్రక్క జిల్లాకు కేటాయించవలసి వచ్చినప్పుడు సీనియర్ ఐచ్ఛికాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తప్పనిసరైనప్పుడు సర్వీసు పరంగా జూనియర్ ఉపాధ్యాయుడిని కేటాయిస్తూ వితంతువులను, వికలాంగులను, స్పౌజ్, వ్యాధిగ్రస్తులను మినహాయించాలి.
3. సీనియారిటీని రూపొందించుటకు అన్ని జిల్లాలలో ఒకేవిధమైన మార్గదర్శకాలు ఉండేవిధంగా ఉత్తర్వులు జారీచేయాలి.
4. సీనియారిటీ జాబితాలలోని లోపాలను సరిచేయుటకు ఒకరోజు సమయం ఇవ్వాలి.
5. ఐచ్ఛికాలను మార్చుకొనుటకు ఉపాధ్యాయులకు ఒకరోజు అవకాశం ఇవ్వాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News