Sunday, April 28, 2024

చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు వేయలేదు: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్  : చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు విధించలేదని, కానీ చేనేతపై పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం మోడీ నేతృత్వంలోని బిజెపిదేనని స్పష్టం చేశారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో చేనేతలు ఆలోచించాలని కోరారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే గణేష్‌తో కలిసి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పద్మశాలిలతో ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకునే క్రమంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వచ్చామని తెలిపారు. 52 తర్ప సంఘాలకు ఇప్పటికే ఇచ్చిన నిధులు కాకుండా మరిన్ని నిధులు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే బిగాల గణేష్ విజ్ఞప్తి చేశారని, దాంతో 52 తర్ప సంఘాల భవనాల నిర్మాణాలకు తన ఎమ్మెల్సీ నిధుల నుంచి కోటి రూపాయలు ఇస్తున్నానని ప్రకటించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి పథకాలు అందేలా కుల సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంఘాల పనితీరుపై కూడా పునరాలోచన చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాకముందు పద్మశాలిల కులవృత్తి ప్రమాదంతో ఉండేదని, ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ భూములు కూడా లేవని చెప్పారు. దాంతో బాగా చదువుకొని చాలా మంది డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా ఆయా వృత్తులో స్థిర పడ్డారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పద్మాశాలీలు పేదరికంలో ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బట్టల వ్యాపారస్థులకు అనేక ప్రోత్సాహకాలు కెసిఆర్ ప్రభుత్వం ఇస్తుందని, 24 గంటల నిరంతర విద్యుత్తు ఇస్తుండడం వల్ల బట్టల దుకాణాల్లో డీజిల్ కంపు లేదని వివరించారు. గత ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను కుదేలు చేశాయని విమర్శించారు. బీడీ కార్మికులకే కాకుండా టేకేదారులకు కూడా పెన్షన్ అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని తేల్చి చెప్పారు. మూడోసారి బిగాల గణేష్‌కు తమ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో గణేష్‌కు అండగా నిలబడి ఆశీర్వదించి మరోసారి శాసనసభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కుల, మత బేధం లేకుండా అన్ని సంఘాలకు నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రతి కుల సంఘం నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. కోటి 50 లక్షల రూపాయలతో పద్మశాలి కల్యాణ మండపం నిర్మాణం, 25 లక్షల రూపాయలతో మార్కండేయ మందిర నిర్మాణం, 25 లక్షలతో పద్మశాలి స్మశాన వాటిక నిర్మాణం, రెండుసార్లు నగరంలోని 51 పద్మశాలి సంఘాలకు 5కోట్ల రూపాయల సిడిపి నిధులు మంజూరు చేశామన్నారు. ఈ నిధులను పద్మశాలిలు సద్వినియోగం చేసుకొని సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ కవిత కృషితో బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం నింపిందన్నారు. ఈ తొమ్మిది ఏళ్ళలో నగరంలో అన్ని కుల సంఘాలకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో కుల మతాలకు గౌరవం పెరిగిందన్నారు.

పద్మశాలీలకు 3 కార్పొరేట్ టికెట్ ఇచ్చామన్నారు. ఆలయ ధర్మకర్తలుగా పద్మశాలీలకు పదవులను అందించామని, అందులో భాగంగా కంఠేశ్వర్ ఆలయ చైర్మన్‌గా బిల్ల మహేష్‌ను నియమించామన్నారు. మిమ్మల్ని ఆదరించి కడుపులో పెట్టుకొని చూస్తున్నామని, మీరు బిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్, పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు గజ్జెటి వెంకటనర్సయ్య, యాదగిరి, ఎనగందుల మురళి, బిల్ల మహేష్, సిరిగాధ ధర్మపురి, సత్యపాల్, కస్తూరి గంగారాజు, శివలింగం, శంకర్, కార్పొరేటర్ ఆకుల హేమలత, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News