Sunday, April 28, 2024

ప్రాదేశిక వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న మోడీ ప్రభుత్వం : జైరాం రమేశ్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత ఆరు దశాబ్దాలుగా చైనా దళాల నుంచి దేశానికి జరుగుతున్న ప్రాదేశిక వైఫల్యాలను మోడీ ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం ధ్వజమెత్తారు. తూర్పు లద్దాఖ్ లోని వ్యూహాత్మక డెస్పాంగ్ మైదానాలు, డెమ్‌చోక్, తదితర ప్రాంతాల్లో భారత గస్తీని చైనా నిరాకరిస్తోందని ఆయన విమర్శించారు. 1962లో భారత్‌చైనా యుద్ధానికి సంబంధించి చారిత్రక ప్రదేశంగా ఉన్న రెజాంగ్ లా స్మారక చిహ్నాన్ని చైనాతో చర్చల వైఫల్యం సందర్భంగా భారత్ ఆర్మీ ధ్వంసం చేయడాన్ని తప్పు పట్టారు. ఆ ప్రదేశంలో ఆనాడు యుద్ధంలో కీలక పాత్ర వహించిన మేజర్ సింగ్ నేలకొరిగారని గుర్తు చేశారు.

లద్దాఖ్ స్వతంత్ర ప్రతిపత్తి గల హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు చెందిన చుసూల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ఈ విషయాన్ని బయటపెట్టారని జైరాం రమేశ్ పేర్కొన్నారు. 2021లో చైనాతో చర్చలు జరిగినప్పుడు తటస్థ జోన్‌లో ఆ చారిత్రక స్మారక చిహ్నం ఉందని తెలిపారు. ఈ తటస్థ జోన్లు ఇదివరకు ప్రభుత్వ నియంత్రణలో ఉండేవన్నారు. కానీ గత కొన్నేళ్లుగా ప్రాదేశిక వైఫల్యాలను మోడీ ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని చెప్పారు. 2017లో డోక్లాం భారత విజయంగా శుష్క వాదాలు ప్రభుత్వం చేస్తుండగా, మరోవైపు భూటాన్ భూ భాగాన్ని చైనా ఆక్రమిస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చైనా వల్ల జరుగుతున్న విధ్వంసాలపై వాస్తవాలను, ప్రస్తుత యథాతధ స్థితిని ప్రజలకు తెలియజేయాలని, జైరాం రమేశ్ కేంద్రాన్ని అభ్యర్థించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News