Wednesday, May 1, 2024

మోడీ ప్రధాని కాదు సేల్స్ మెన్: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Modi is sales man not PM of India

హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజల తరపున ఘన స్వాగతం పలుకుతున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సిఎం కెసిఆర్ అధ్యక్షతన జలవిహార్ లో సభ జరుగుతోంది. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రసంగించారు.  న్యాయవాదిగా యశ్వంత్ సిన్హా ప్రస్తానం మొదలైందన్నారు. కొంత కాలం న్యాయవాదిగా యశ్వంత్ సిన్హా పని చేశారన్నారు. మంచి పేరున్న నాయకుడికి మద్దతు పలకడం తమ అదృష్టమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోధానుసారం ఓటు వేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. దేశానికి గుణాత్మక మార్పు తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపోళ్లు రైతులను కలిస్తాన్, ఉగ్రవాదులని అన్నారని మండిపడ్డారు.

ఇవి చాలదన్నట్టు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని మోడీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ఉద్యమంలో రైతులు మృతి చెందారని, ఉద్యమం చేస్తున్న రైతులను జీపులతో తొక్కించారని మండిపడ్డారు. ఉద్యమంలో మృతి చెందిన రైతులకు మూడు లక్షల రూపాయలు ఇచ్చామన్నారు.  రైతు కుటుంబాలకు సాయం చేస్తే బిజెపి చులకనగా మాట్లాడిందన్నారు. ఉత్తమ ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని, రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటున్నారని, ప్రతిపక్షాలపై ప్రధాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. తాము వేసిన ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. మోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు.

టార్చిలైట్ వేసి వెతికినా మోడీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవన్నారు. వ్యవసాయం పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయని, డీజిల్ సహా అన్ని ధరలు అమాంతంగా పెంచేశారని మండిపడ్డారు. మోడీ పాలనలో దేశ ప్రతిష్టను మసకబారేలా చేశారన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బందిపడ్డారని దుయ్యబట్టారు. మోడీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. మోడీ దేశానికి ప్రధానిగా కాకుండా సేల్స్ మెన్ గా వ్యవహరిస్తున్నారని కెసిఆర్ చురకలంటించారు. మోడీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసన తెలుపుతున్నారని కెసిఆర్ చెప్పారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే మోడీని దోషిగా చూడాల్సి వస్తుందన్నారు. తాము మౌనంగా ఉండమని పోరాటం చేస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్ధమన్నారు. ద్రవ్యోల్బణం పెరిగింది.. దేశ జిడిపి పడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఎంఎల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News