Friday, May 10, 2024

మైనారిటీలను హింసిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

గాంధీ హంతకులను కీర్తిస్తున్నారు
ప్రజలను నిరంతరం భయభ్రాంతులను చేయడమే ఆ నినాదం అర్థం
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నిప్పులు
ఆత్మావలోకనానికి ఇదో సదవకాశం
వ్యక్తిగత లక్షాలకన్నా సంస్థపై ఎక్కువ దృష్టి పెట్టాలి
చింతన్ శిబిర్‌లో పార్టీ శ్రేణులకు పిలుపు

ఉదయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలను హింసిస్తోందని, మహాత్మాగాంధీ హంతకులను కీర్తిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థల విధానాలపై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేధోమథన్ సమావేశాలు శుక్రవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రారంభమయ్యాయి. ‘ నవ సంకల్ప్ శిబిర్’ పేరిట మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను సోనియాగాంధీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల వల్ల ఈ దేశం ఎదుర్కొంటున్న లెక్కలేనన్ని సవాళ్లగురించి చర్చించుకునేందుకు, దానితో పాటుగా ఆత్మావలోకనం చేసుకునేందుకు ఈ సమావేశాలవ్ల మనకు అవకాశం లభించిందని అన్నారు. ‘కనిష్టప్రభుత్వం, గరిష్ఠ పాలన’ అనే నినాదాన్ని ప్రధాని మోడీ, ఆయన సహచరులు వినిపిస్తున్నారని, వారి దృష్టిలో ఈ నినాదం అసలైన అర్థం ఏమిటో ఇప్పుడు స్పష్టంగా, బాధాకరంగా తెలిసిందన్నారు. ఈ నినాదం అర్థాన్ని ఆమె వివరిస్తూ, దేశంలో విభజనను సృష్టించి కొంత మందిని శాశ్వతంగా ఓ వైపునకు చేరే విధంగా చేయడం, ప్రజలు నిరంతరం భయం, అభద్రతా భావాలతో జీవించేలా చేయడం అని చెప్పారు. దీనిని మరింతగా వివరిస్తూ, మన సమాజంలో అంతర్భాగం, మన గణతంత్ర దేశంలో సమానస్థాయి పౌరులు అయిన మైనారిటీలను హింసాత్మకంగా టార్గెట్ చేయడం, క్రూరంగా హింసించడం అని తెలిపారు.

పార్టీ ప్రక్షాళన తప్పనిసరి

ఇది మన ముందున్న అనేక సమస్యలపై ఆలోచించవలసిన సందర్భం కూడానని సోనియా చెప్పారు. జాతీయ సమస్యల గురించి ఆలోచించడానికి, పార్టీవ్యవస్థ గురించి అర్థవంతంగా ఆత్మావలోకనం చేసుకునేందుకు ఇది ఓ అవకాశమని చెప్పారు. పార్టీలో మార్పులు ప్రస్తుతం అత్యవసరమన్నారు. మన పనితీరును మార్చుకోవలసిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత ఆకాంక్షలకన్నా పార్టీకి పెద్దపీట వేయాలన్నారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ పాలన ఇకపై కూడా కొనసాగితే దేశం అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.

మోడీని దీటుగా ఎదుర్కొనేందుకు, పార్టీని ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి, దేశ సమగ్రతను నిలబెట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సోనియా పిలుపునిచ్చారు. గాంధీని చంపిన వారిని కీర్తిస్తూ.. వారిని హీరోలుగా చిత్రీకరించడం ద్వారా గాంధీజీ, నెహ్రూలకు సంబంధించిన జ్ఞాపకాలను లేకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని సోనియా ఆరోపించారు. వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు. మతపరమైన విభజనను ఎదుర్కొని దేశాన్ని పునర్నిర్మించాలనే లక్షంతో మున్ముందు పని చేయాలని నిర్దేశించారు. ‘ పార్టీ మనకు ఎంతో ఇచ్చింది, మనం తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది’ అని ఆమె అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నేతల పని తీరులోనే మార్పు రావాలి

ప్రస్తుత సమయంలో పార్టీలో సత్వరమే సంస్థాగత మార్పులు చేయాల్సిన ఆవశ్యకతను సోనియా నొక్కిచెప్పారు. నేతల పనితీరులోనూ మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని వాఖ్యానించారు. వ్యక్తిగత లక్షాలకన్నా సంస్థపైనే ఎక్కువ దృష్టిపెట్టాలన్నారు. పార్టీ నేతలంతా చింతన్ శిబిర్‌లో తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పాలని కోరిన సోనియా..అయితే పార్టీ ఐక్యంగా, బలంగా ఉందనే సందేశాన్ని దేశానికి ఇవ్వాలన్నారు. పార్టీ వ్యూహాల్లోను మార్పులు అవసరమన్నారు. ద్వేషం రగిలించే మంట ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపిస్తుందన్న ఆమె..ఇది తీవ్రమైన సామాజిన పరిణామాలకు దారి తీస్తుందని, ఊహించినదానికన్నా ప్రమాదకరమైందని అన్నారు.

మొబైల్ ఫోన్లకు నో

చింతన్ శిబిర్‌లో రాహుల్, ప్రియాంక సహా 400 మందికి పైగా నేతలు పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత నిర్వహిస్తున్న ఈ మేధోమథన సదస్సులో కీలక మార్పులు జరుగుతాయని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. సోనియాగాంధీ ప్రారంభోపన్యాసం తర్వాత ప్రతినిధులంతా ఆరు గ్రూపులుగా ఏర్పడి వివిధ అంశాలపై చర్చలు మొదలు పెట్టారు. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు, ఉపాధి, రైతులకు సంబంధించిన అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ చర్చల క్రమంలో పార్టీ పలు జాగ్రత్తలు తీసుకుంది. ఏ ఒక్క నేత కూడా మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకువెళ్లరాదని ఆదేశించింది. చర్చలు జరిగే అంశాల్లో ఏ ఒక్క విషయం కూడా బయటికి రాకుండా గోప్యత పాటించాలని నేతలను ఎఐసిసి అధిష్ఠానం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News