Friday, April 26, 2024

కరోనాపై పోరాటానికి ముందుకు రండి

- Advertisement -
- Advertisement -

Modi Video conference with sportsmen

 

ఐదు అంశాలతో సందేశాలు ఇవ్వాలని

క్రీడాకారులకు ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మరిని రూపుమాపేందుకు జరుగుతున్న పోరాటానికి క్రీడాకారులు మద్దతుగా నిలువాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. కరోనా రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో దీనిపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు భారత క్రీడాకారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలత సందేశాలతో ప్రజలను చైతన్య పరచాలని కోరారు. శుక్రవారం కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుతో కలిసి ప్రముఖ క్రీడా కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, స్టార్ అథ్లెట్లు నీరజ్ చోప్రా, హిమాదాస్, భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, పారా అథ్లెట్ శరద్ కుమార్, బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఐదు అంశాలతో కూడిన సందేశాలను ప్రజలకు ఇవ్వాలని క్రీడా ప్రముఖులకు సూచించారు.

లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని పిలుపు నివ్వాలి. కరోనాపై అవగాహన కల్పించడమే కాకుండా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతేగాక సామాజిక దూరం పాటించాలని కోరాలి. కరోనా మహమ్మరి కట్టడి చేసేందుకు వైద్యులు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించి, వారి సేవలు ఎంత కీలకమో తెలియ జేయాలి. ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు మీరు పడిన శ్రమ, కఠోన సాధన, అంకితభావం తదితర విషయాలను ప్రజలకు వివరించాలి. వారు కూడా మీలాగే అంకితభావంతో కరోనాపై పోరాటానికి ముందుకు వచ్చేలా చూడాలి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా నుంచి బయట పడాలంటే సామాజిక దూరం పాటించక తప్పదు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నా చాలా చోట్ల ప్రజలు దీన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్షం నెరవేరడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు వారి కర్తవ్యం గురించి వివరిస్తూ కరోనాపై పోరాటంలో ప్రభుత్వాలకు అండగా నిలిచేలా క్రీడాకారులు కృషి చేయాలని ప్రధాని కోరారు.

భారత్‌లో క్రీడాకారులకు ఉన్న ఆదరణ మరేవరికీ లేదని, మీరిచ్చే సలహాలు, సూచనలు వారిపై కచ్చితంగా ప్రభావం చూపుతాయనే నమ్మకాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. అసాధారణ ఆటతో భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన మీరు కరోనాపై ప్రజలను చైతన్య వంతులు చేసేందుకు నడుం బిగించాల్సిన అవసరం అసన్నమైందన్నారు. కాగా, ప్రజలకు ఇవ్వాల్సిన ఐదు అంశాలను క్రీడాకారులకు ప్రధాని వివరించారు. మహమ్మరిపై పోరాడాలనే సంకల్పం, సామాజిక దూరాన్ని పాటించాలనే నిగ్రహం, సానుకూలత ధోరణిలో ఉండాలనే అనుకూలత, కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ, మీడియా సిబ్బంది తదితరులపై గౌరవం, పిఎం కేర్స్‌కు తమవంతు సహాయం చేసేలా సహకారం అనే అంశాలు ఉండాలని ప్రధాని సూచించారు. అంతేగాక కరోనా కట్టడికి ఆయుష్ మంత్రిత్వ శాఖ జారిచేసిన మార్గదర్శకాలను పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రధాని మోడీ క్రీడా ప్రముఖులను కోరారు. ఇక, ప్రధాని పిలుపుకు క్రీడా ప్రముఖులందరూ సానుకూలంగా స్పందించారు. కరోనా మహమ్మరి కట్టడిలో తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

 

Modi Video conference with sportsmen
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News