Monday, April 29, 2024

రాజ్యాంగ స్ఫూర్తి – లింగసమానత

- Advertisement -
- Advertisement -

భారత్ సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ‘భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికంకాని, మతాతీతమైన’ అని లౌకికత్వానికి అర్థాలు. మత స్వేచ్ఛ, హేతు, భౌతిక, మానవతావాదాల పట్ల సహనం, గౌరవం లౌకికమని ఆస్ట్రేలియా రాజ్యాంగ ఆచార్యుడు ఆంథోని రొలాండ్ బ్లాక్ షీల్డ్ నిర్వచించారు. ‘లౌకిక దేశం పౌరులకు మత స్వేచ్ఛనిస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఏ మతానికీ చెందదు. మతంలో జోక్యం చేసుకోదు. మతాన్ని ప్రోత్సహించదు. ‘అమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర గౌరవ ఆచార్యుడు డోనాల్డ్ యూజిన్ స్మిత్ అన్నారు. ‘రాజ్యాంగంలో మనదని చెప్పుకోదగ్గ అంశమే లేదు. మనుస్మృతి ప్రపంచ సమ్మతి, ప్రశంసలను, యాదృచ్ఛిక విధేయతను, అనుగుణ్యతను పొందింది’ అని సంఘ్ గురు మాధవ్ సదాశివ్ గోల్వల్కర్ అమానవీయ అసమానత, అలౌకికత్వాలను పొగిడారు. రాజ్యాంగంలోని 1(1) భారత్ రాష్ట్రాల సమాఖ్య, 19(1) భావ ప్రకటనా స్వేచ్ఛ, 21 జీవన హక్కు, 25(1) మత స్వేచ్ఛ, 51(1) (హెచ్) శాస్త్రీయ దృక్పథం లాంటి అనేక అధికరణలను సంఘ్ ప్రభుత్వం ధిక్కరించింది.
షా బానో కేసులో, ముస్లింలైనా విడాకులివ్వబడిన భార్యలకు మనోవర్తి చెల్లించాలని సుప్రీంకోర్టు 23.04.1985 న తీర్పిచ్చింది. రాజకీయ లబ్ధి కోసం నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ తీర్పును గౌరవించలేదు. బాబ్రీ మసీదును కూలుస్తున్నా మిన్నకున్న నాటి సంఘ్ -కాంగ్రెసీయ ప్రధాని నరసింహారావు, ఆద్వానీ, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, మురళీ మనోహర్ జోషీలను వ్యూహాత్మకంగా కేసు నుండి తప్పించిన నాటి యుపి ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అంటిముట్టనట్లుండిన కాంగ్రెసీయులు మత రాజకీయులే. ముంబయి మతోగ్రదాడిపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక బుట్టదాఖలు, గోధ్రా మారణకాండ నిందితులను వదిలేయటం రాజకీయమే.
ప్రపంచీకరణ ప్రపంచాన్ని మతాంతీకరించింది. మతాన్ని రాజకీయీకరించింది. రాజకీయాల్లో మతం దూరింది. మతోన్మాదులు ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణలను, హింసను ప్రేరేపిస్తున్నారు. అధికారంతో రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా బలపడిన సంఘీయులు హిందూయేతరులను, అవిశ్వాసులను, తమ తాత్వికతతో విభేదించే వారిని పాకిస్తాన్ పొమ్మన్నారు. సర్వమత ప్రజల సొమ్మును ఒక మత వేడుకలకు ఖర్చుపెట్టవచ్చా? నేటి పాలకులు చేస్తున్న ఈ పనులు రాజ్యాంగ విరుద్ధం. కాషాయ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ బోధనలతో భారత విదేశాంగ శాఖ పుస్తకాన్ని ప్రచురించి విదేశాల్లో పంచి సంఘ్ భావ జాలాన్ని ప్రచారం చేస్తోంది. ఈ ఖర్చు ప్రజల సోమ్మే. సంఘ్ సిద్ధాంతకర్త దీనానాథ్ బాత్రా రచించిన ‘తేజోమయ భారత్’ మొదలగు హిందుత్వ తాత్విక పుస్తకాల ముందుమాటల్లో, సభల్లో, సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని హిందు పురాణ ఊహాగాథలను నిజాలుగా, విజ్ఞాన శాస్త్రాంశాలుగా వర్ణించారు. పౌరుల శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలన్న రాజ్యాంగ అధికరణ 51(1) (హెచ్) ను తుంగలో తొక్కారు. ‘82% హిందువులున్న దేశాన్ని హిందుత్వంతో, భగవత్ భావజాలంతో మోడీ ఏలాలనుకుంటున్నారు. ఇతర మతాలను క్రమేపీ నాశనం చేయాలనుకుంటున్నారు. ‘న్యాయమూర్తి పి.బి. సావంత్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ అధికరణ 14 ప్రకారం రాజ్యం ఏ వ్యక్తికీ చట్ట సమానత్వాన్ని తిరస్కరించరాదు, చట్టాలను సమానంగా పరిరక్షించాలి. అధికరణ 15 ప్రకారం ప్రజలు జాతి, మత, కుల, లింగ, జన్మస్థలాల ఆధారంగా ఏ వివక్షకు గురికాకుండా రాజ్యం కాపాడాలి. అధికరణ 15(3) మహిళలకు, పిల్లలకు ప్రత్యేక నిబంధనల అవకాశం కల్పిస్తుంది. మైనారిటీ మతాల్లోనూ రాజ్యాంగ స్ఫూర్తితో స్త్రీ సమానత్వానికి తెర తీయాలి. ప్రార్థనాలయాల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. మన ఉన్నత వర్ణాల వనితలూ అంటరానివారే. ‘నిమ్న’ జాతి మనుషుల్లాగా మ్లేచ్ఛులే. రాజ్యాంగ అధికరణలు 14, 15 లకు అనుగుణంగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లకు చట్టం చేయాలి.
నిబంధన 25 సిక్కు, జైన, బౌద్ధులను హిందువులుగా పేర్కొని, అపోహలు, అపార్థాలు, అనాచరణలకు దారితీసింది. లౌకికత్వాన్ని నీరుగార్చిందని మానవ హక్కుల కార్యకర్తల, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. మతాంశాల జోలికి పోకుండా అవసరమైతే కేవలం ఆలయాల నిర్వహణ, పాలనాంశాలను ప్రభుత్వాలు చేపట్టవచ్చని అధికరణ 25 ప్రస్తావించింది. ఆ మేరకు దేవాదాయ శాఖలు, వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. ఆలయాల నిర్వహణ, పాలనల్లో పాలుపంచుకోటం దేవాదాయ శాఖ విధుల్లో భాగం కావచ్చు. కాని పాలకులు సతీసంతానాలతో దేవాలయాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేవతలకు బట్టలిస్తున్నారు. దేవతలకు బట్టలివ్వటం, పూజల, యజ్ఞాల, క్రతువుల, పుష్కరాల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. అనేక నిబంధనల ద్వారా భారత రాజ్యాంగం లౌకికత్వాన్ని సమర్థిస్తున్నది. 25వ అధికరణ రాజ్యాంగం హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కులకు మూలస్తంభం. భిన్న సంస్కృతుల సంరక్షణా ప్రాముఖ్యతను, విభిన్న ప్రాంతాలలో శాంతియుత సహజీవన ఆలోచనను ప్రజలు, ప్రత్యేకించి పాలకులు, రాజకీయులు అర్థం చేసుకోవాలి. ఈ అధికరణ ఆలోచనా స్వేచ్ఛను, మతాచరణ హక్కును ఇచ్చింది. మతాచారాలు ప్రజాజీవితం, శాంతిభద్రతలు, నైతికత, ఆరోగ్యాలకు భంగం కలిగించరాదనీ చెప్పింది.
బహిరంగ ప్రదేశాల్లో మతాచారాలు, పూజా కార్యక్రమాలు చేయరాదు. దేవాలయాలు, మసీదులలో జంతు బలులు, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు. మత వేడుకల్లో, ప్రార్థనల్లో టపాసులు, మైకుల వినియోగ సమయాన్ని సుప్రీం కోర్టు కుదించింది. ప్రత్యక్ష మత సంబంధం లేని కార్యక్రమాలు, రాజకీయ, ఆర్థికాంశాలను క్రమబద్ధీకరించే చట్టాలు చేసే అధికారం రాజ్యానికున్నాయి. నేడు రోడ్లను దేవుళ్ళు ఆక్రమించారు. భక్తులు మతాచారాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. శబ్ద, వాయు, జల, పర్యావరణ కాలుష్యాలను పెంచుతున్నారు. మత హత్యలకు పాల్పడుతున్నారు. వీటి నియంత్రణకు పాలక వర్గాలు తమ రాజ్యాంగ హక్కులను వాడుకోవు. భయంతో, నైతిక క్షీణతతో, రాజకీయ లబ్ధినాశించి ఈ అరాచకాల జోలికి పోవు. పాలకులు, మతాచారులు, కార్పొరేట్లు కుమ్మక్కయ్యారు. సమాజాన్ని మతంతో విభజిస్తున్నారు. ఫలితంగా దైనందిన జీవితంలో మతం తిష్ట వేసింది. మానవత్వం నశించింది.
ప్రధాని గంగమ్మ పిలుస్తోందన్నారు. ఆమెకు హారతిచ్చి పార్లమెంటుకెళ్ళారు. గంగా హారతి ఏర్పాటు చేశారు. ఈ ఘన కార్యాన్ని విదేశీ పాలకులకు ప్రదర్శించారు. గంగా ప్రక్షాళన గాలికొదిలారు. రాజకీయులు, అధికారులు మోడీ అడుగుజాడల్లో నడిచారు. కాలుష్యాన్ని పట్టించుకోలేదు. భారత్‌లో బిజెపి పాలనలో, ప్రభుత్వ సంస్థల కాషాయీకరణ, మతీకరణ గమనించిన పాకిస్తాన్ అభ్యుదయ కవయిత్రి ఫహ్మిదా రియాజ్ హిందుత్వ ప్రచారాన్ని పాకిస్తాన్ ఇస్లాం మత మౌఢ్యంతో పోల్చారు. మీరూ మాలాగే అయ్యారని మన లౌకిక పతనానికి బాధపడ్డారు. రాజ్యాంగ పద్ధతుల్లో అధికారం పొందినవారే రాజ్యాంగాన్ని ఎగతాళి చేశారు. ధిక్కరించారు. లింగసమానతను, లౌకికత్వాన్ని బలహీనపరిచారు. మతోన్మాద సంస్థల స్థాపన, వాటి అనుబంధ చర్యలు రాజ్యాంగంలో లేవు. ఈ లొసుగులకు బిరడా బిగించే కార్యక్రమాలు చేపట్టవలసిన బాధ్యత పౌర సమాజాలదే.
నేటి పరిస్థితుల్లో మతోన్మాద నియంత్రణ, లౌకికత్వ పునరుద్ధరణ అత్యవసరం. లౌకిక రాజ్యం మత మైనారిటీలకే కాదు మెజారిటీ మతస్థుల సంక్షేమానికీ అవసరం. మత కల్లోలాలు జరక్కుండా లౌకిక భావాలను అభివృద్ధి చేయాలి. మత ప్రమేయం లేని రాజకీయాలు అమలు కావాలి. వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోని మేరకే మత స్వేచ్ఛను అనుమతించాలి. సామాజిక వైఖరిని, దృక్పథాన్ని సకారాత్మకంగా మార్చాలి. బహుళ మతాల, సంస్కృతుల భారత సమాజంలో పాలకులు, నాయకులు, అధికారులు, ప్రజలు లౌకికత్వాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News