Monday, May 6, 2024

రాజకీయాల్లో నేరస్థులు

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india ఎన్నికల్లో నేరగాళ్ళను అభ్యర్థులుగా నిలబెట్టడానికి వారు చేస్తున్న ప్రజాసేవే కారణమని రాజకీయ పార్టీలు గతంలో చెప్పాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఈ మధ్య అన్నారు. నిరుపేదలు అత్యధికంగా గల దేశంలో వారికి వేసవిలో చలివేంద్రమో, యెన్నికల వేళ మందు బాటిలో ఇవ్వడమే ప్రజాసేవ అయితే వారిని సేవా తత్పరులుగా ఎలా భావించగలం? ఒకవైపు సాధారణ ప్రజలను తొక్కిపెట్టి, ప్రశ్నించేవారి ప్రాణల మీద గురిపెట్టి బీభత్సం సృష్టిస్తున్న నేరగాళ్లు ఏ విధంగా సేవాపరులవుతారు? అలా కాకుండా ఉచిత పాఠశాలలో, వైద్యశాలలో కట్టించి పేదరికం తిరిగి వారి జీవితాల్లో చొరబడకుండా చూస్తున్నవారు యెంతమంది వున్నారు? కేవలం తమకున్న అర్ధబలాన్ని, గూండాలను ఉపయోగించి ప్రజలను భయపెట్టి, తాత్కాలిక ప్రలోభాలతో వోట్లు చేసుకోడం, అలాగే పార్టీలకు విరివిగా విరాళాలిచ్చే నేర దళపతులకు రాజకీయ పదవులు, ఎన్నికల్లో పార్టీ టికెట్లు లభిస్తున్నాయన్నది వాస్తవం.

గోవా తదితర రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నందున చట్ట సభలను నేరస్థులు లేని సౌధాలుగా మార్చాలనే దీక్షతో, రాజకీయాలను ప్రక్షాళన చేసే లక్ష్యంతో సిఇసి ప్రత్యేక కార్యాచరణను చేపట్టారు. అది నెరవేరుతుందా? పార్టీలు తాము బరిలో నిలబెట్టే అభ్యర్థుల నేపధ్యాన్ని, ముఖ్యంగా క్రిమినల్ కేసులుంటే ఆ వివరాలను వార్తా పత్రికలలో ప్రచురించడం ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆయన అన్నారు. రాజకీయాల నుంచి నేరస్థులను పారద్రోలాలని ఎన్నికల కమిషన్ చేసిన అభ్యర్ధనను మన్నిస్తూ సుప్రీంకోర్టు చాలా ఆదేశాలను జారీ చేసి వుంది. వొత్తిడిని తట్టులోలేక యుపిఎ హయాంలో కేంద్రం సైతం వొక చట్టం తెచ్చింది. రెండేళ్లకు తక్కువ కాకుండా శిక్షపడిన చట్టసభల సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలనీ ఆ చట్టం నిర్దేశిస్తున్నది.

పార్లమెంటు సభ్యుల్లో 49 శాతం మంది నేర నేపథ్యమున్నవారని, కనీసం 26 శాతం మందిపై తీవ్ర శిక్షలున్నాయని తెలిసిన తర్వాత సుప్రీం కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. రాజకీయ నాయకులపై గల కేసుల విచారణను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున ఆ పని చకచక సాగుతున్నది. సుప్రీం ఆదేశాల పాటింపులో భాగంగా ఇప్పుడు సిఇసి పార్టీలను దారిలోకి తెచ్చే పనిలో పడ్డారు. నేర చరితులు ఎన్నికైన తర్వాత ప్రజల అవసరాలు ప్రభుత్వాలు నెరవేర్చేలా చేయడంలో బాగా పని చేస్తున్నారనే అభిప్రాయం సర్వేల్లో విలువడడం ఒక వైచిత్రి. మంచివారు, చదువుకున్నవారు ఎన్నికై స్వప్రయోజనాలు చూసుకొంటూ గద్దె మీద ఉన్నవారిని ప్రసన్నం చేసుకోడమే లక్ష్యంగా పని చేయడం వల్ల నేర నేపథ్యం గలవారు మంచి ప్రజాప్రతినిధులుగా పేరు తెచ్చుకోడమే నిజమైతే ఇది వ్యక్తి ఆరాధనను పెంచి వ్యవస్థలను బలి తీసుకొంటుంది. మంచి పాలకుల మీద కేసులు మోపించి తప్పించడం వంటివి ప్రబలుతాయి. ప్రజలలో, ఎన్నికలలో పోటీ చేసే వారిలో రాజ్యాంగ చైతన్యాన్ని పెంపొందించడమే ప్రజాస్వామ్యానికి రక్ష. సుప్రీంకోర్టు ఎంతగా పట్టించుకొని ఎన్ని సార్లు గట్టి ఆదేశాలిస్తున్నా దేశంలోని ఎంపిలు, ఎంఎల్‌ఎలపై పెండింగ్‌లో పడిన అవినీతి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది.

2018 డిసెంబర్‌లో హైకోర్టులిచ్చిన సమాచారం ప్రకారం అప్పటికీ 4122 కేసులు అపరిష్కృతంగా వుండగా, ఈ సంఖ్య 2020 మార్చి నాటికి 4222కి పెరిగింది. 2020 సెప్టెంబర్ నాటికి 4859కి ఎగబాకింది. ఆ విధంగా 17 శాతం ఉధృతి నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను దిగువ న్యాయస్థానాలు, వాటికి అనుసంధానంగా వున్న దర్యాప్తు విభాగాలు గట్టిగా పట్టించుకొని వుంటే ఇలా జరిగేది కాదు. మొత్తం మన రాజకీయ, న్యాయ వ్యవస్థల్లోనే చిత్తశుద్ధి లోపించిందని స్పష్టపడుతున్నది. దొరికితే దొంగ, దొరకని వాడు దొర అనే విషయం రుజువవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుల అనుమతితో కేసులను ఉపసంహరించుకోవచ్చునని సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఇచ్చిన వెసులుబాటు కూడా దుర్వినియోగమైంది. ఈ ఉత్తర్వులను ఆసరా చేసుకొని సీరియస్ కేసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో సంభవించింది. తర్వాత న్యాయ స్థానాల శీల సమగ్రత మీద కూడా అనుమానాలేర్పడ్డాయి.

ఇలా దేశ వ్యాప్తంగా వివిధ చిన్న, పెద్ద న్యాయస్థానాలను ప్రభావితం చేసి ఎంత మంది నేర చరిత్రులైన రాజకీయ నాయకులు తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారో ఊహించవచ్చు. ప్రజాస్వామ్యం వికసించే దేశంలో జరగవలసివేవీ ఇక్కడ చోటు చేసుకోడం లేదు. మహిళలకు కోటా బిల్లుపై సమగ్ర చర్చ జరిపించి అణగారిన వర్గాల వారు కోరుతున్న మేరకు వారి మహిళలకు కూడా దామాషా ప్రాతినిధ్యం కల్పించడం, వెనుకబడిన తరగతులకు చట్ట సభల్లో కోటా ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఏళ్లూపూళ్లుగా ఎదురు చూస్తున్నాయి. ప్రజాస్వామ్యం మన దేశంలో అంతిమంగా ధనబలం, అంగబలం వున్నవారి చేతి బందీగా మారిపోతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News