Wednesday, May 15, 2024

ఏలురులో విస్తరిస్తున్న వింత వ్యాధి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మూర్చ రోగం కారణంగా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో 100 మందికి పైగా రోగులు వింత రోగ లక్షణాలతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఫలితంగా వీరి సంఖ్య ఇప్పటివరకూ 451కు చేరింది. మూర్చ, తలనొప్పి, వికారం, వాంతులు, నీరసం లాంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారితో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పడకలన్నీ నిండిపోతున్నాయి. అంతు చిక్కని వ్యాధిని గుర్తించేందుకు రక్త నమూనాలు, వైరల్, బాక్టీరియల్, ఫంగల్ టెస్టులతో పాటు ఆహారం, నీరు, వాయు కాలుష్య పరిస్థితులపైనా పరీక్షలు నిర్వహించినప్పటికీ ఈ వింతరోగం తాలూకు వివరాలు తెలియకపోవటంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. అయితే రోగుల కణజాలలకు సంబంధించిన కల్చర్ టెస్టు ద్వారా వింత రోగం తాలూకు గుట్టు బయటకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ సహా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, పూణెలోని వైరాలజీ ల్యాబ్, సిసిఎంబి , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లాంటి సంస్థలకు వివిధ నమూనాలను పంపి పరీక్ష చేసినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు అంతకంతకూ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఏలూరు నగరంలోని 62 వార్డు సచివాలయాలు, పరిసర గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రాలను వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఆందోళనకర పరిస్థితిలో ప్రభుత్వాస్పత్రి వరకు వచ్చేలోపు ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో వైద్యం చేయించుకోవాలని సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది.
బాధితులకు సిఎం పరామర్శ:
పశ్చిమగోదావరి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వింతవ్యాధితో చికిత్స పొందుతున్న రోగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను సిఎం జగన్‌తో పాటు మంత్రి పేర్ని నాని, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్‌పి సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
డబ్ల్యూహెచ్‌వొ వైద్య బృందం రాక:
అంతుచిక్కని వింత వ్యాధిని గుర్తించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైద్య బృందం మంగళవారం ఏలూరుకు రానుంది. ఈ బృందం ఏలూరులో వింత వ్యాధిగా సంచలనం రేపుతున్న వైనంపై అధ్యయనం చేయనుంది. ఈ బృందంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఉన్నారని వైద్య అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రపంచ దేశాల దృష్టి పడటంతో వ్యాధిని నిర్ధారించేందుకు డబ్ల్యూహెచ్‌వొ బృందం రానుంది. ఈ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తున్నప్పటికీ వ్యాధి కారకాలను వైద్యులు తెలుసుకోలేకపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 443 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో 243 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 16 మందిని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 183 మంది చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో ఏలూరులో అసలేం జరుగుతోందన్న విషయాలను తెలుసుకునేందుకు మంగళవారం డబ్ల్యూహెచ్‌వొ వైద్య బృందం రానుందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.

Mystery illness cases rises to 450 in Eluru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News