Tuesday, April 30, 2024

సెమీస్‌లో జ్వరేవ్, ఒసాకా

- Advertisement -
- Advertisement -

సెమీస్‌లో జ్వరేవ్, ఒసాకా
బుస్టా, బ్రాడీ ముందుకు, యూఎస్ ఓపెన్

Naomi Osaka reached to US Open 2020 Semi Final

న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వరేవ్, జపాన్ ఆశాకిరణం నవోమి ఒసాకా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మరోవైపు అమెరికా సంచలనం జెన్నిఫర్ బ్రాడీ, స్పెయిన్ స్టార్ కరెనొ బుస్టా కూడా క్వార్టర్ ఫైనల్ పోరులో విజయం సాధించి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో 28వ సీడ్ బ్రాడీ 63, 62 తేడాతో కజకిస్థాన్ క్రీడాకారిణి యులియాను చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రాడీ ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో చెలరేగి పోయిన బ్రాడీ లక్షం దిశగా అడుగులు వేసింది. ఆమె ధాటికి ప్రత్యర్థి యులియా కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన బ్రాడీ తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. ఆ తర్వాత కూడా కూడా జోరును కొనసాగించింది. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన బ్రాడీ వరుసగా రెండో సెట్‌ను కూడా గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఎదురులేని నవోమి
మరోవైపు మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ నవోవి ఒసాకా (జపాన్) విజయం సాధించింది. అమెరికా క్రీడాకారిణి షెల్బి రోజర్స్‌తో జరిగిన పోరులో ఒసాకా అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఒసాకా 63, 64తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో ఒసాకా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. ఒసాకా ధాటికి రోజర్స్ కనీస పోటీ కూడా ఇవ్వడంలో విఫలమైంది. చెలరేగి ఆడిన ఒసాకా అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం ఒసాకాకు కాస్త పోటీ ఎదురైంది. ఈసారి ప్రత్యర్థి కాస్త మెరుగైన ఆటను కనబరిచింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ కీలక సమయంలో రోజర్స్ ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ఒసాకా వరుసగా రెండో సెట్‌ను కూడా గెలిచి సెమీస్‌కు చేరుకుంది.
జ్వరేవ్ జోరు
మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో జ్వరేవ్ క్రొయేషియాకు చెందిన 27వ సీడ్ బొర్నా కొరిక్‌ను ఓడించాడు. నాలుగు సెట్ల సమరంలో జ్వరేవ్ 16, 76, 76, 63తో విజయం సాధించాడు. తొలి సెట్‌లో కొరిక్ జోరును ప్రదర్శించాడు. అసాధారణ షాట్లతో విరుచుకు పడిన కొరిక్ ఏ దశలోనూ జ్వరేవ్‌కు కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. అద్భుత ఆటతో అలవోకగా సెట్‌ను సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా కొరిక్ మెరుగైన ఆటను కనబరిచాడు. కానీ జ్వరేవ్ ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో వరుసగా రెండు సెట్లను టైబ్రేకర్‌లో సొంతం చేసుకున్నాడు. అంతేగాక నాలుగో సెట్‌లో మరింత దూకుడుగా ఆడాడు. అనూహ్యంగా పుంజుకున్న జ్వరేవ్ వరుసగా మూడు సెట్లను గెలిచి సెమీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.
చెమటోడ్చిన బుస్టా
మరో క్వార్టర్ ఫైనల్లో జపాన్ స్టార్ బుస్టా చెమటోడ్చి నెగ్గాడు. 12వ సీడ్ డానిల్ షపావలావ్ (కెనడా)తో జరిగిన హోరాహోరీ సమరంలో బుస్టా విజయం సాధించాడు. ఇద్దరు కూడా సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. దీంతో హోరాహోరీ పోరాటం తప్పలేదు. కాగా, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన బుస్టా 36, 76, 76, 06, 63తో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. తొలి సెట్‌లో గెలిచిన డానిల్ ఆ తర్వాత వరుసగా రెండింటిలో ఓటమి పాలయ్యాడు. నాలుగో సెట్‌లో మళ్లీ పుంజుకున్నాడు. ఒక్క గేమ్‌ను కూడా కోల్పోకుండానే సెట్‌ను సాధించాడు. కానీ, ఫలితాన్ని తేల్చే ఐదో సెట్‌లో వరుస తప్పిదాలకు పాల్పడి ఓటమి కొని తెచ్చుకున్నాడు.

Naomi Osaka reached to US Open 2020 Semi Final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News