Saturday, April 27, 2024

దేశాభివృద్ధికి అధికారులే సారథులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్దికి అధికారులు సారథులు.. భవిష్యత్తుకు వారథులుగా నిలవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాజకీయాల్లో విలువలు దిగజారిపోయి చట్ట సభలు కాస్తా కొట్లాడుకునే సభలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత సివిల్ సర్వీసెస్ దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని రాజకీయ నాయకులు, సివిల్ సర్వీసెస్, న్యాయ వ్యవస్థ , మీడియా రంగంలో పనిచేసే వారంతా నిష్పాక్షికంగా తమ బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. ఆయా రంగాల్లో వారు సమర్థవంతంగా సేవలు అందిస్తే.. దేశం వృద్ధి దూసుకపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వారు దేశాన్ని, ప్రజల ఆలోచనలను కూడా దోచుకున్నారని విమర్శించారు. దేశ పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలని, సివిల్ సర్వీసెస్‌లో ఉన్నవారు నీతి, నిజాయతీతో వ్యవహరించాలని సూచించారు.

ప్రజలకు నేరుగా లబ్ధి కలగజేయడంలో సివిల్ సర్వీసెస్ అధికారులదే కీలకపాత్ర అని గుర్తు చేశారు. కాలానుగుణంగా.. భవిష్యత్ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. అధికారులు.. ప్రజల బాధలను సావధానంగా, ఓర్పుగా వినాలని సూచించారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది ఇప్పుడున్న రాజకీయ నాయకులు అవకాశవాదులుగా మారిపోతున్నారని.. క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ వంటివి ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు తనమని సివిల్ సర్వీస్ ఆదర్శవంతమని.. శాంతికి విఘాతం కలిగించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఎన్నికలు వచ్చినప్పుడు పక్షపాతంగా ఓట్లు వేయడం సరికాదని, సివిల్ సర్వీసెస్‌లో ఉండే వారు తెలివిగా వ్యవహరించాలన్నారు. పరిపాలన ఉత్తర్వులు.. కోర్టు వాదనలు స్థానిక భాషలో ఉండాలి సంప్రదాయాన్ని పాటించాలని.. పెద్దలు చూపిన దారిలో నడవాలని పేర్కొన్నారు. తెలుగు భాష చదువుకున్న తాను భారత ఉపరాష్ట్రపతి కాలేదా అని ప్రశ్నించారు. మాతృభాషలో చదివితే ఉన్నత స్థానాలకు వెళ్లలేమన్నది అపోహ మాత్రమేనని పరిపాలన ఉత్తర్వులు మాతృభాషలో ఉండాలని.. కోర్టులు సైతం స్థానిక భాషల్లో వాదనలు వినిపించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News