Tuesday, April 30, 2024

నేపాల్ సుప్రీం తీర్పు

- Advertisement -
- Advertisement -

Nepal's Supreme Court reinstates dissolved House of Representatives

 

నేపాల్‌లో కథ తల్లకిందులయింది. పాలక నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సిపి) లో తిరుగుబాటు తట్టుకోలేక ప్రధాని కెపి శర్మ ఓలి గత డిసెంబర్‌లో రద్దు చేయించిన పార్లమెంటు దిగువ సభ (ప్రతినిధుల సభ)కు సుప్రీంకోర్టు మంగళవారం నాడు తిరిగి ప్రాణం పోసింది. దీనితో అక్కడ రాజకీయం మరింత వేడెక్కనున్నది. పునరుద్ధరించిన సభను వచ్చే 13 రోజుల్లో సమావేశ పరచాలని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. సభ రద్దును సవాలు చేస్తూ దాఖలైన 13 రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఇది ప్రధాని ఓలికి గట్టి దెబ్బ. అధికార పార్టీలో ఆయన ప్రత్యర్థి వర్గ సారథి పుష్పకమల్ దహాల్ ‘ప్రచండ’కి విశేష బలాన్నిచ్చే పరిణామం. 275 మంది సభ్యులున్న దిగువ సభను ఏక పక్షంగా రద్దు చేయించే అధికారాన్ని ప్రధానికిస్తున్న నిబంధన ఏదీ రాజ్యాంగంలో లేదు. అయినా కెపి శర్మ ఓలి గత ఏడాది డిసెంబర్ 20న మంత్రివర్గాన్ని సమావేశ పరచి రద్దు తీర్మానాన్ని ఆమోదింప చేసి దేశాధ్యక్షురాలు బిందేశ్వరీ దేవి భండారీకి పంపించగా తక్షణమే ఆమె దానిని ఆమోదించారు.

ప్రతినిధుల సభలో విశేష బలమున్న ప్రత్యర్థి వర్గం అవిశ్వాస తీర్మానం తెచ్చి తనను దించివేస్తుందనే భయంతోనే శర్మ ఓలి సభను రద్దు చేయించారనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ప్రస్తుత ప్రతినిధుల సభకు 2017లో ఎన్నికలు జరిగాయి. 2018 మార్చిలో సభ తొలిసారి సమావేశమైంది. ఐదేళ్ల ఆయుష్షున్న సభ మరి రెండేళ్లకు పైగా కొనసాగవలసి ఉంది. దీనిని రద్దు చేస్తూ వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని దేశాధ్యక్షురాలు ఆదేశించారు. అప్పటి వరకు అధికారాన్ని ఎదురు లేకుండా అనుభవించవచ్చునని శర్మ ఓలి ధీమా పడ్డారు. ఇప్పుడు ఆ ఎన్నికలు కూడా రద్దు అయినట్టు భావించాలి. ఓలి నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్కిస్టు లెనినిస్టు) ప్రచండ సారథ్యంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) 2018 మే నెలలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సిపి) గా ఏకమయ్యాయి. అప్పట్లో కుదిరిన అంగీకారం ప్రకారం అధికారాన్ని చెరి రెండున్నరేళ్ల పాటు ఇద్దరూ పంచుకోవాలి. ఈ ఒప్పందాన్ని ఓలి ఖాతరు చేయకపోడంతో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి ముదిరిపోయాయి.

భారత సరిహద్దు ప్రాంతమైన కాలాపానీని నేపాల్‌లో చేరుస్తూ గత ఏడాది జులైలో తాను విడుదల చేసిన వివాదాస్పద పటానికి పార్లమెంటు ఏకగ్రీవ మద్దతు లభించడంతో తనకు ఎదురు లేదని ప్రధాని ఓలి ధీమాకు గురయ్యారు. అయితే తన రాజీనామాకు పార్టీలో డిమాండు రోజురోజుకీ బలం పుంజుకోడంతో పార్లమెంటును రద్దు చేసి అధికారంలో కొనసాగడమే శరణ్యమని ఆయన భావించారు. ప్రతినిధుల సభ ఐదేళ్ల పాటు ఉండాలని చెప్పిన రాజ్యాంగం దాని రద్దుకి అవకాశం కల్పించినప్పటికీ ప్రధాని ఇష్టానిష్టాల మీద అది జరగడానికి అవకాశం ఇవ్వలేదు. అయినా ఏకపక్షంగా ఓలి సభను రద్దు చేయించడం ఆయనకు శత్రువులను పెంచిందనే చెప్పాలి. చైనా ఆడించినట్టల్లా ఆడడం ద్వారా తుదికంటా అధికారంలో కొనసాగవచ్చునని ఓలి ఆశించారు. అందుకే అనేక సందర్భాల్లో ఇండియాను విమర్శిస్తూ మాట్లాడారు. ఒక దశలో అసలు అయోధ్య నేపాల్‌లో ఉందని, రాముడిని ఇండియా తమ వద్ద నుంచి కాజేసిందని కూడా శర్మ ఓలి ప్రకటించారు. ఆ విధంగా భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని శర్మ ఓలి ప్రభుత్వం పలుసార్లు చేసింది.

దేశ పటంలో మార్పుల నాటకానికి కూడా అందుకే తెర లేపారు. శర్మ ఓలి, ప్రచండ వర్గాల మధ్య విభేదాలను తొలగించడానికి చైనా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న సందర్భమూ ఉన్నది. గత ఏడాది మే నెలలో నేపాల్‌లోని చైనా రాయబారి ఇద్దరు నాయకుల మధ్య భేటీ ఏర్పాటు చేసి రాజీ కుదిర్చారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. త్వరలో సమావేశమయ్యే దిగువ సభలో బల పరీక్ష నెగ్గడానికి ఓలి సన్నాహాలు చేసుకుంటారో, ఆ లోగానే రాజీనామా చేసి తప్పుకుంటారో చూడవలసి ఉంది. చిరకాలం పాటు రాచరికంలో మగ్గిన మన పొరుగు చిన్న దేశమైన నేపాల్ ప్రజాస్వామ్యంలో పరిఢవిల్లుతుందని పెట్టుకున్న ఆశలను అక్కడి పాలక పక్ష వైరుధ్యాలు వమ్ము చేస్తుండడం బాధాకరం. తిరిగి ప్రాబల్యం పుంజుకోడానికి రాచరిక శక్తులు పన్నుతున్న కుట్రలు ఫలించరాదనే ప్రజాసామ్య ప్రియులు కోరుకుంటారు. చిరకాలంగా భారత్‌పై ఆధారపడుతూ బతుకుతూ వచ్చిన నేపాల్ పూర్తిగా చైనా చేతుల్లోకి పోకుండా చూచుకోవలసిన బాధ్యత మనపై ఉంది. అందుచేత సున్నితమైన ఈ సందర్భంలో మన పాలకులు తెలివిగా అడుగులు వేయాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News