Monday, April 29, 2024

నేతన్నకు బీమా

- Advertisement -
- Advertisement -

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 7న ప్రారంభం

80వేల మందికి
ప్రయోజనం
60ఏళ్లలోపు ఉన్న ప్రతి నేత
కార్మికుడికి వర్తింపు
దురదృష్టవశాత్తూ మరణిస్తే
రూ.5లక్షల పరిహారం
ప్రీమియం చెల్లింపు బాధ్యత
ప్రభుత్వానిదే ఇందుకోసం
రూ. 50కోట్ల కేటాయింపు..
ఇప్పటికే రూ.25కోట్లు విడుదల
నోడల్ ఏజెన్సీగా చేనేత జౌళి శాఖ
ఎల్‌ఐసితో ఒప్పందం పవర్ లూం అనుబంధ కార్మికులకూ
వర్తింపు : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలి సారిగా రాష్ట్రంలోని నేత కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులకు అందిస్తున్న రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా బీమా పథకాన్ని అమలు చేయాలని తలపెట్టింది. ఇందుకు జాతీయ చేనేత దినోత్సవం రోజున (ఆగస్టు 7) ఈ బీమా పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించనుంది. దీని వల్ల రాష్ట్రంలోని సుమారు 80వేల మంది నేతన్నలకు ప్రయోజనం చేకూరనుంది. 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడుకానున్నారు. నేత కా ర్మికులు మరణిస్తే ఐదు లక్షల బీమా పరిహా రం అందనుంది. జాతీయ చేనేత దినోత్సవం రోజు ప్రారంభం కానున్న నేతన్న బీమా ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సోమవారం సం బంధిత అధికారులతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కెటిఆర్ సమీక్ష చేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. బీమా పథకంతో పాటు ఈ రంగానికి అందుతున్న నిధులు….శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా సమీక్షించారు. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ’నేతన్న బీమా’ పథకాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నటు కెటిఆర్ తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తోందన్నారు. బీమా కాలంలో లబ్ధిదారులైన ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా ’నామినీ’కి పది రోజుల్లోనే రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారన్నారు.

నోడల్ ఏజెన్సీగా చేనేత చేనేత, జౌళి శాఖ

నేతన్నకు బీమా పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని కెటిఆర్ తెలిపారు. ఈ మేరకు భారత జీవితబీమా సంస్థ – ఎల్‌ఐసీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. వార్షిక ప్రీమియం కింద చేనేత, పవర్ లూం కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కెటిఆర్ వివరించారు. ప్రీమియం కోసం రూ.50కోట్లు కేటాయించామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 25 కోట్లు విడుదల చేసినట్లు కెటిఆర్ తెలిపారు. సుమారు 80 వేల మంది చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్నబీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన చేనేత, పవర్ లూం కార్మికులు, అనుబంధ కార్మికులందకీ నేతన్నబీమా పథకాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

చేనేత కార్మికులు నిత్యం మగ్గం గుంతలో కూర్చొని కంటికి కనిపించని పోగులతో పనులు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే బరువైన యంత్రాలను తొక్కాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో 40 ఏళ్లకే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుండటంతో వారి జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుందని….తద్వారా వారి కుటుంబాలకు భరోసాకు నిలుస్తుందన్నారు.

ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్

చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 20162017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ (బిసివెల్ఫేర్ నుండి) రూ. 1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని కెటిఆర్ తెలిపారు. చేనేత, జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్‌కు ఇది అదనమన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ( 202220-23) చేనేత జౌళి శాఖ సాధారణ బడ్జెట్ క్రింద రూ.55.12 కోట్లను కేటాయించామన్నారు. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ క్రింద స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో రూ. 400 కోట్లు కూడా కేటాయించామన్నారు.

చేనేత మిత్ర స్కీం

చేనేత కార్మికులకు ముడి సరుకు కాటన్, సిల్క్, ఉన్ని, నూలు రంగు రసాయనాల కొనుగోలుపై 40 శాతం రాయితీని కల్పించడం జరుగుతోందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10శాతం రాయితీకి అదనమన్నారు. ఈ 40 శాతం రాయితీలో 35శాతం రాయితీ సబ్సిడీ డబ్బు చేనేత కార్మికుల అనుబంధ కార్మికుల వేతనాల పెరుగుదల రూపంలో నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలలోకి చేరు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిగిలిన 5శాతం రాయితీ ముడి సరుకు కొనుగోలు దారులైన మాస్టర్ వీవర్స్ , వీవర్ సంఘాలకు, యూనిట్ల ఖాతాలకు విడుదల అవుతోందన్నారు. చేనేత మిత్ర పథకములో ఇప్పటివరకు 20,501 మంది లబ్ధిదారులు రూ.24.09 కోట్ల
సబ్సిడీని నేరుగా వారి ఖాతాలలోకి వేశామన్నారు.

నేతన్నకు చేయుత
ఇంతకు పూర్వము ఉమ్మడి రాష్ట్రములో అమలు జరుగుచున్న సహకార త్రిఫ్ట్ ఫండ్ పథకములో చేనేత కార్మికులు వారి వేతనములో 8శాతం పొదుపు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము తరపున 8 శాతం జమ చేయడం జరిగేదన్నారు. ఈ పథకం కేవలం సహకార రంగములోని చేనేత కార్మికులకు మాత్రమే వర్తించేదన్నారు. కానీ టిఆర్‌ఎస్ ఏర్పడిన తరువాత చేనేత కార్మికుడు చెల్లించే 8శాతం త్రిఫ్టు పొదుపునకు రాష్ట్ర వాటాగా 16 శాతం జమ చేయడం జరుగుతోందన్నారు. ఈ పథకమును 2017లో పోచంపల్లిలో ప్రారంభించడం జరిగిందన్నారు.

చేనేత కార్మికులకు ఋణ మాఫీ పథకం
చేనేత కార్మికుల యొక్క సామాజిక,ఆర్థిక బాగు కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తోందన్నారు. అయితే పోటీ ప్రపంచములో వారికి సహేతుకమైన మార్కెట్ లేనందున సరియైన ధరలు రాక వారు బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం లేదన్నారు. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఋణవిముక్తులను చేయడం కోసమే ఋణమాఫీ పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తోందనారు. ఈ పథకం కింద తీసుకున్న వర్కింగ్ కాపిటల్ వ్యక్తిగత రుణాలను ఒక లక్ష వరకు మాఫీ చేయడం జరిగిందన్నారు. ఇందులో 10,148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల ఋణము నుండి విముక్తి అయ్యారని వెల్లడించారు.

బాండ్ ప్రమోషన్,మార్కెటింగ్
చేనేత రంగములో నూతన డిజైన్లు, వస్త్రోత్పత్తి గురించి పరిశోధనలు మార్కెట్ గురించి అధ్యయనం జరుగుతోందని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ పథకం అమలుకై ఇంతవరకు రూ.284.92 లక్షలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇట్టి పరిశోధనలో భాగముగా తెలంగాణలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యము పొంది కాలక్రమేణా అంతరించిపోయిన చేనేత కళాకృతులను వెలికితీసి వాటికి నవీనరీతులలో జోడించడం జరుగుతోందనారు. తద్వారా టిఎస్‌సిఒ పీతాంబరి పట్టు చీరలు, ఆర్మూరు పట్టు చీరలు, హిమ్రా చేనేతలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు లాంటి ఒకప్పటి గొప్ప కళాకృతులను పరిశోధించి తిరిగి వెలికితీసి మనుగడలోనికి తీసుకురావడం జరిగిందన్నారు

బతుకమ్మ చీరల ఉత్పత్తి
రాష్ట్రములోని మరమగ్గాల మాక్స్ యూనిట్ల నుండి బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగుతోందని కెటిఆర్ అన్నారు. ఈ చీరలను బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్రంలో 18 సంలు నిండిన బిపిఎల్ మహిళలందరికి కానుకగా ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ పథకములో ప్రతిఏటా కోటి చీరల ఉత్పత్తి రాష్ట్రములోని మరమగ్గాలపై జరిపించి, యూనిట్ హోల్డర్స్, మరమగ్గాల కార్మికులకు పని కల్పించడం జరుగుతోందన్నారు.

మరమగ్గాల కార్మికులకు త్రిఫ్టు నిధి
ఈ పథకములో మరమగ్గాల కార్మికులు తమ వేతనములలో 8 శాతం పొదుపు ఖాతాకు జమ చేస్తే… రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 8శాతం డబ్బు జమ చేస్తోందన్నారు. ఈ పథకంలో మూడు సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్‌ను జీవో 58 ద్వారా వెసులుబాటు కల్పించామన్నారు. తద్వారా 4301 పవర్ లూమ్ కార్మికులకు రూ.12.07 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తము కోవిడ్ పరిస్థితుల్లో వారికెంతో ఉపయోగపడిందన్నారు. ఈ పథకం చాలా జనరంజకమైన కారణంగా వారి అభ్యర్ధన మేరకు తిరిగి (౩) సంవత్సరాలు పొడిగించడం జరిగిందన్నారు. దీని కోసం అదనపు బడ్జెట్ రూ.18 కోట్లు కేటాయించి, ఈ సంవత్సరమునకు రూ.10 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News