Friday, April 26, 2024

అల్జిమర్స్ దశలను ఆలస్యం చేసే కొత్త మందు

- Advertisement -
- Advertisement -

అల్జిమర్స్ అంటే చిత్రమైన మతిమరుపు. మెదడు ఫలకంపై ఉండే జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ క్రమంగా చెరిగిపోతుంటాయి. పాత విషయాలన్నీ గుర్తుంటాయి. కానీ తక్షణ సంఘటనలేవీ గుర్తుకు రావు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం జరిగినవి సులువుగా చెప్పగలుగుతారు. కానీ నిన్నామొన్నా జరిగినవి గుర్తుకు రావు. కానీ దీనిపై అవగాహన లేని వారు కోరి గుర్తుకు రాలేదని అబద్ధం చెబుతున్నారని వారికి పరిచయం ఉన్న వ్యక్తులు అనుమానం పడవచ్చు. ఇటువంటి విచిత్రమైన ప్రవర్తన కలిగించే అల్జిమర్స్ వ్యాధి నివారణకు ప్రస్తుతం మందులేవీ లేవు. కానీ ఆయా లక్షణాలు ప్రవర్తనలు తగ్గడానికి కొన్ని చికిత్సలు ఉపయోగపడతాయి.

అల్జిమర్స్ లక్షణాలు మారిపోతుంటాయి కాబట్టి ఒకే మందు పనిచేయదు. కుంగుబాటుకు యాంటీ డిప్రెసెంట్లు, భ్రమలకు లోనవుతుంటే యాంటీ సైకాటిక్స్, మానసిక స్థితి మారుతుంటే మూడ్ స్టెబిలైజర్లు ఈ విధంగా ఆయా లక్షణాల తీవ్రతను బట్టి మందులను మార్చాల్సి ఉంటుంది. అయితే అల్జిమర్స్ ప్రారంభ దశను ఆలస్యం చేసే ఔషధం కొత్తగా రూపొందింది. జపాన్‌కు చెందిన ఎల్‌సాల్, అమెరికాకు చెందిన బయోజెన్ సంస్థలు ఉమ్మడిగా ఈ ఔషధాన్ని తయారు చేశాయి. దీన్ని లెక్వింబి అని పిలుస్తారు. జనవరి 23 నుంచి ఇది మార్కెట్ లోకి అందుబాటు లోకి వస్తుందని ప్రకటించారు. అల్జిమర్స్‌కు మూలకారణమైన బీటా అమైలాయిడ్ కణాలను ఈ ఔషధం గుర్తించి వాటి పెరుగుదలను ఆలస్యం చేస్తుంది. అల్జిమర్స్‌ను ఇది పూర్తిగా నివారించలేకున్నా రోగ దశలను మాంద్యం చేస్తుంది. ప్రతి రెండు వారాలకు నాలుగు డోసులు వాడవలసి ఉంటుంది.

ఈ ఔషధం లిక్వెంబిని 1800 మందిపై ప్రయోగించి అధ్యయనం చేశారు. సానుకూల ఫలితాలు కనిపించాయని న్యూయార్క్ మౌంట్‌సినాయ్ ఆస్పత్రి లోని అల్జిమర్స్ వైద్య నిపుణుడు డాక్టర్ శామ్ గండీ వివరించారు. అల్జిమర్స్ మూడు దశల్లో కొనసాగుతూ ఉంటుంది. చివరి దశకు చేరుకోడానికి కనీసం ఐదారేళ్లు పడుతుంది. తొలిదశలో రోజువారీ చిన్నచిన్న విషయాలు మరిచిపోతుంటారు. రెండో దశలో తాము ఎక్కడున్నామన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఆరోజు తేదీ, వారం అన్న విషయాలు కూడా గుర్తుండవు. పగలంతా నిద్రపోతూ , రాత్రంతా మెలకువతో ఉంటారు. మూడో దశలో తాము రోజూ ఉపయోగించే రేజర్ వంటి వాటిని మర్చిపోతారు. తలుపు గడ పెట్టుకోవడం వంటివి గుర్తుకు రావు. నడవ లేరు, పక్కపై ఉండిపోతుంటారు. రోజూ చేసే పనులకు ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది.

ఈ దశల మధ్యలో రానురాను పాత విషయాలు కూడా మరిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబీకులను కూడా మరిచిపోవచ్చు. ఈ వ్యాధి మానసికంగా కూడా కుంగదీస్తుంది. ప్రవర్తనా మారిపోతుంటుంది. అందుకే కుంగుబాటు, నిరాసక్తత, కోపం, భ్రాంతుల వంటివన్నీ అల్జిమర్స్ లక్షణాలుగా వైద్యులు గుర్తిస్తున్నారు. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జిమర్స్ ఒకటని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 5.7 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతుండగా, వీరిలో 50 లక్షల మంది మనదేశానికి చెందిన వారే ఉండటం విశేషం. వీరి సంఖ్య 2030 నాటికి 76 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా వృద్ధుల్లో దాదాపు అరవై ఏళ్లు దాటాక ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాయ్ అల్జిమర్స్ అనే జర్మన్ సైకియాట్రిస్టు ఈ రుగ్మతను కనుగొన్నారు. దాంతో అతడి పేరే ఈ వ్యాధికి స్థిర పడింది.

పురుషులతో పోలిస్తే మహిళలు మూడు రెట్లు ఎక్కువగా అల్జిమర్స్‌కు గురవుతున్నారు. వృద్ధాప్యం వచ్చాక అన్ని కణాలతోపాటు మెదడు కణాలూ కొంతవరకు శిధిలమౌతుంటాయి. కొందరిలో ఈ పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది. వారిలో మెదడు కణాలు మరీ ఎక్కువగా నశిస్తుంటాయి. వారి మెదడు క్రమంగా కుదించుకు పోతుండడంతో ప్రధానంగా ఫ్రంటల్, టెంపోరల్ , పెరైటల్ అనే భాగాల్లోని కణాలు కుంచించుకుపోతుంటాయి. దీంతో మెదడు తన బరువులో 20 శాతం కోల్పోతుంది. మైక్రోస్కోపిక్‌తో పరిశీలిస్తే న్యూరో ఫైబ్రిలేటరీ టాంజిల్స్ అనే అమైలాయిడ్ ప్రొటీన్లు మెదడు మీద కనిపిస్తాయి. వాటి ఆధారం గానే అల్జిమర్స్‌ను నిర్ధారిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News