Saturday, May 4, 2024

జోష్ నింపిన సిరీస్

- Advertisement -
- Advertisement -

New Josh in Team India

రోహిత్ సేన అదరహో

కోల్‌కతా: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్ టీమిండియాలో కొత్త జోష్‌ను నింపిందనే చెప్పాలి. వరల్డ్‌కప్‌లో కివీస్ చేతిలో అవమానకరీతిలో ఓటమి పాలై నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా కళ్లు చెదిరే రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచుల్లోనూ కివీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంతో రానున్న టెస్టు సిరీస్‌కు మరింత సమరోత్సాహంతో బరిలోకి దిగే అవకాశం భారత్‌కు కలిగింది. రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్‌లు ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. అంతేగాక సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అద్భుతంగా రాణించడం టీమిండియాకు సానుకూల అంశంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. టి20 ప్రపంచకప్‌లో తమను ఓడించిన న్యూజిలాండ్‌పై భారత్ కళ్లు చెదిరే రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా మూడు మ్యాచుల్లోనూ గెలిచి కివీస్ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసింది. రానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సమరోత్సాహంతో బరిలోకి దిగుతుండగా కివీస్ మాత్రం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.

భారీ ఆశలతో బరిలోకి దిగిన కివీస్ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేక పోయింది. బ్యాటింగ్ వైఫల్యం కివీస్‌ను వెంటాడింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతావారు ఘోరంగా విలమయ్యారు. కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు బ్యాట్స్‌మెన్‌లు ఫామ్ కోల్పోవడం కివీస్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. సొంత గడ్డపై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద జట్టుకైనా భారత్‌ను ఎదుర్కొవాలంటే పెద్ద సవాల్ వంటిదే. ఇక న్యూజిలాండ్ వంటి జట్టుకైతే ఇది మరింత కఠినమైన పరీక్షగా చెప్పక తప్పదు. ఈ సవాల్‌కు కివీస్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడక తప్పదు.

సమరోత్సాహంతో..

మరోవైపు కివీస్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. కీలక ఆటగాళ్లు లేకున్నా న్యూజిలాండ్ వంటి బలమైన జట్టును భారత్ చిత్తుగా ఓడించడం గమనార్హం. ఈ సిరీస్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్‌లు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. జట్టును ముందుండి నడిపించారు. ఇక యువ ఆటగాడు సూర్యకుమార్ కూడా ఒక మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు కూడా పర్వాలేదనిపించారు. రానున్న రోజుల్లో వీరంతా టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకున్నారనే చెప్పాలి. ఇక యువ ఆటగాళ్లు హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్‌లు కూడా జట్టు యాజమాన్యం తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టారు. ఐపిఎల్ మాదిరిగానే కివీస్ సిరీస్‌లో కూడా నిలకడైన ప్రదర్శన చేశారు. సీనియర్లు భువనేశ్వర్, అశ్విన్‌లు కూడా తమ పాత్రను సమర్థంగా పోషించారు. ఇలా జట్టు సభ్యులంత సమష్టిగా రాణించడం టీమిండియాకు సానుకూల అంశంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News