Sunday, May 5, 2024

స్థానికుల సాయంతో పుల్వామా దాడి

- Advertisement -
- Advertisement -

 ఎన్‌ఐఎ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడి
 13వేల పేజీల ఛార్జీషీట్ దాఖలు
 జైషే అధినేత మసూద్ ఇతరుల పేర్లు
 సూసైడ్ బాంబర్ అంతిమక్షణాల వీడియో

జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) మంగళవారం చార్జీషీట్ దాఖలు చేసింది. ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన ఈ అభియోగపత్రంలో మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహమ్మద్ అధినేత మసూద్ అజర్ పేరు ప్రముఖంగా ప్రస్తావించారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో 2019లో ఓ పకడ్బందీ వ్యూహంతో ఉగ్రవాదులు భయానక ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో 40 మంది జవాన్లు బలి అయ్యారు. తొలుత ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్న ఈ కేసును ఎన్‌ఐఎ అత్యంత ప్రతిష్టాత్మకంగా సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టింది.

పలు రకాలుగా సాగించిన దర్యాప్తు క్రమంలో అక్కడ లభించిన ఎలక్ట్రానిక్ పరికరాల సాక్షాలు, చిక్కిన కొందరు ఉగ్రవాదులు, ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల సానుభూతిపరుల స్టేట్‌మెంట్లను ప్రాతిపదికగా చేసుకుని కేసును నియా చాకచక్యంగా ఛేదించింది. పలు వేర్వేరు ఘటనలలో అరెస్టు అయిన ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను విచారించిన క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా నియా ఈ కేసుకు సంబంధించి మొత్తం 13500 పేజీల చార్జీషీట్‌ను దాఖలు చేసింది. పుల్వామా ప్రాంతానికి చెందిన వారే కొందరు ఉగ్రవాదులకు తమ వంతుగా సహకారం అందించారు. సూసైడ్ బాంబర్ అయిన అదిల్ దార్ అంతిమక్షణాలను కూడా స్థానికులు తమ సెల్‌ఫోన్ల ద్వారా చిత్రీకరించినట్లు కూడా ఈ చార్జీషీట్‌లో వెల్లడైంది. ఈ ఆత్మాహుతి దాడికి దిగిన అదిల్ ఈ చర్య కోసం 200 కిలోల పేలుడు పదార్థాలను వంటికి బిగించుకుని ఓ వాహనంతో వేగంగా వెళ్లి సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటన గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరిగింది. లెత్‌పోరా వద్ద జరిగిన ఈ ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం రేపింది. ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి, స్థానికుల నుంచి చాలా కాలంగా ఉగ్రవాదులకు సరైన ఆశ్రయం దక్కిందని, ఈ క్రమంలోనే ఈ అత్యంత భయానక ఉగ్రవాద దాడితో సిఆర్‌పిఎఫ్ బలగాలను మట్టుపెట్టారని వెల్లడైంది. ఈ కేసును ఎన్‌ఐఎ సంయుక్త సంచాలకులు అనిల్ శుక్లా సారథ్యంలో దర్యాప్తు జరిపారు.

ఇక పలు రకాలుగా హైటెక్ పరిజ్ఞానాన్ని వాడుకున్నారని, ఇ కామర్స్ వేదికలను ఉగ్రవాద చర్య కోసం వ్యూహకర్తలు వినియోగించుకున్నారని తెలిసింది. వారికి అవసరం అయిన శక్తివంతమైన బ్యాటరీలు, ఐ ఫోన్లు, కొన్ని రకాల రసాయనాలు వంటివి అక్కడి వారి నుంచే ఫోన్ల చెల్లింపుల ద్వారా సేకరించుకున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఏడుగురిని అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్న అజర్ కాకుండా ఈ కేసులో ఏడుగురు ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరు వివిధ ఎన్‌కౌంటర్లల్లో హతులయ్యారు. నలుగురు తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు జమ్మూ కశ్మీర్‌లోనే తలదాచుకుని ఉన్నట్లు కనుగొన్నారు. వీరిలో ఒకరు స్థానికుడు మరొకరు పాకిస్థానీయుడు. మసూద్ అజర్ బంధువులు అయిన అబ్దుల్లా రౌఫ్, అమ్మర్ అల్వీల పేర్లను కూడా చార్జీషీట్‌లో చేర్చారు. వీరు అంతా కూడా ఈ కేసుకు సంబంధించి ప్రధాన కుట్రదారులుగా పేర్కొన్నారు.

NIA Chargesheet on Pulwama Attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News