Wednesday, May 8, 2024

సోనియా నాయకత్వాన్ని ఎన్నడూ ప్రశ్నించలేదు

- Advertisement -
- Advertisement -

 పార్టీ బలోపేతమే మా ఉద్దేశం 
 కాంగ్రెస్ అధినేత్రికి లేఖ రాసిన కొందరు పార్టీ నేతల స్పష్టీకరణ,

 మనసు నొప్పించి ఉంటే క్షమించండి, సోనియాకు వీరప్ప మొయిలీ వినతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వాన్ని తామెన్నడూ ప్రశ్నించలేదని, ఆమె పట్ల ఎల్లవేళలా గౌరవ మర్యాదలు, కృతజ్ఞతా భావం కలిగి ఉంటామని, అయితే అదే సమయంలో పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించే తాము లేఖ రాశామని పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో కొందరు చెప్పారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)ఆన్‌లైన్ సమావేశంలో వీరు రాసిన లేఖపైనే ప్రధానంగా వాడీ వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. లేఖ రాసిన వారు బిజిపితో కుమ్మక్కయినట్లుగా కనిపిస్తోందని రాహుల్ గాంధీ ఘాటుగా వ్యాఖ్యానించడం, దానిపై పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్‌లు తీవ్రస్థాయిలో స్పందించినట్ల వార్తలు రావడం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదని, అందువల్ల తాము చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ఆ తర్వాత వారు ప్రకటించారు. సోనియాగాంధీ పార్టీకి తల్లిలాంటివారని, ఆమె మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని లేఖ రాసిన వారిలో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిటీ కూడా అన్నారు. ఒక వేళ తెలిసో తెలియకో అలాంటిది జరిగి ఉంటే క్షమాపణ కోరుతున్నామన్నారు.ఆమె పట్ల ఎల్లవేళలా గౌరవమర్యాదలు, కృతజ్ఞతాభావం కలిగి ఉంటామన్నారు. అయితే అదే సమయంలో పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించే లేఖ రాశామని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాము రాసిన లేఖ పార్టీ అధినాయకత్వాన్ని సవాలు చేస్తూ రాసింది కాదని, పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తూ రాసింది మాత్రమేనని కాంగ్రెస్ ఎంపి వివేక్ తన్ఖా అన్నారు.

న్యాయస్థానంలో కానీ, ప్రజా జీవితంలో కానీ నిజం మాట్లాడడమే నిజమైన డిఫెన్స్ అని, చరిత్ర ధైర్యవంతులను మాత్రమే గుర్తిస్తుంది తప్ప పిరికివాళ్లను కాదంటూయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి మాజీ కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ స్పందిస్తూ, ‘చాలా బాగా చెప్పారు. లేఖ రాయడం నేరం కాదని, అందులో మేము లేవనెత్తిన అంశాలు తప్పక పరిశీలించదగ్గవనే విషయాన్ని లేఖ రాయడాన్ని నేరంగా భావిస్తున్న వారు ఈ రోజుకాకుంటే రేపయినా గ్రహిస్తారు’ అని ట్వీట్ చేశారు. కాగా, ‘ఇది ఒక పదవికి సంబంధించినది కాదు, దేశానికి సంబంధించిన సమస్య’ అని మరో సీనియర్ నాయకుడు కపిల్ సిబల్’ ఓ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. కాగా లేఖపై సంతకం చేసిన వారిలో కొంతమంది సిడబ్లుసి సమావేశానికి హాజరయ్యారని, సమావేశం తీసుకున్న నిర్ణయాలపట్ల సంతృప్తి చెందారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నాయకుడు చెప్పారు.‘ సోనియాగాంధీ లేదా రాహుల్ గాంధీ నాయకత్వంపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు, సోనియాజీ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఆమోదమే’నని కూడా ఆ నాయకుడు చెప్పారు.
అంతేకాదు పార్టీని బలోపేతం చేయడం కోసమే తాము కృషి చేస్తున్నామే తప్ప ఏ వ్యక్తికీ వ్యతిరేకంగా కాదని కూడా ఆ నాయకుడు అన్నారు. కాగా ఈ లేఖ రాసిన 23 మందిలో చాలా మంది ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించడం కొసమెరుపు.

Veerappa moily apology to Sonia Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News