Saturday, May 4, 2024

ఇసి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు

- Advertisement -
- Advertisement -

ముస్లింలపై మోడీ వ్యాఖ్యలపై ఇసి చర్య లేదు
కేరళ సిఎం విజయన్ ఆరోపణ
కమిషన్ తీరు శోచనీయమని వ్యాఖ్య

కన్నూర్ (కేరళ) : ముస్లింలపై ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే చర్య తీసుకునే విషయంలో ఎన్నికల కమిషన్ (ఇసి) నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం ఆరోపించారు. కమిషన్ తీరు ‘శోచనీయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇసి వెంటనే చర్య తీసుకోవలసిన పరిస్థితి అది అని, కానీ ఆ విషయమై ఇసి ఇంత వరకు మౌనంగానే ఉందని విజయన్ అన్నారు. ‘అది దురదృష్టకరం. తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని ఇసి స్పష్టం చేసి ఉండవలసింది.

ఇసి వెంటనే చర్య తీసుకుని ఉండవలసింది’ అని విజయన్ కన్నూర్‌లో విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ముందు ప్రస్తావించి ఉండవలసిన అంశం అది అని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రధాని చేస్తున్న అటువంటి ప్రకటనల కారణంగా దేశంలో బిజెపి వ్యతిరేక సెంటిమెంట్ బలపడుతోందని, కాషాయ పార్టీ మరింతగా ఒంటరి అవుతుందని విజయన్ అన్నారు.

మోడీ ఆదివారం రాజస్థాన్ బన్‌స్వాడాలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించినప్పుడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే ఆ పార్టీ ప్రజల సంపదను ముస్లింలకు తిరిగి పంచుతుందని ఆరోపించిన విషయం విదితమే. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు, విలువైన వస్తువులను ‘చొరబాటుదారులకు’, ‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి’ పంచాలని కాంగ్రెస్ యోచిస్తోందని కూడా మోడీ ఆరోపించారు. మోడీ వ్యాఖ్యలను విజయన్ సోమవారం విమర్శిస్తూ, ప్రజల్లో ముస్లింల పట్ల విద్వేషాన్ని సృష్టించేందుకు ప్రధాని ఊహాజనిత కథనాల ద్వారా మతతత్వ ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News