Monday, April 29, 2024

2 నుంచి 4 వారాలు కీలకం

- Advertisement -
- Advertisement -

Omicron cases are likely to increase:Dr Srinivasa rao

రెండు, మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల
సంక్రాంతి తర్వాత మూడో దశ ముప్పు పొంది వుంది
ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధం
ఒమిక్రాన్‌పై ప్రజలు భయపడాల్సిన పని లేదు
డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ 6రెట్లు వేగంగా వ్యాప్తి
వేరియెంట్ ఏదైనా మాస్క్, టీకాతోనే రక్షణ : డిహెచ్

సమూహాల్లో వేడుకలొద్దు కుటుంబంతోనే మంచిది

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అన్ని విధానాలుగా సన్నద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో గత 2, 3 రోజుల నుంచి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు సంకేతమన్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని.. మన దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు.అయితే కేసుల పెరుగుదలపై ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. గత రెండు వేవ్‌ల్లో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని.. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

అతికొద్ది వారాల్లో గతంలో ఎన్నడూ స్థాయిలో కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చని చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. లక్షణాలు లేని వారికి టెస్టులు చేసి వ్యాధి ఉందని ముద్ర వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. లక్షణాలు కనిపించినవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు.రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వెల్లడించారు. వచ్చే 2 నుంచి 4 వారాలు అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ఎటువంటి ప్రయాణ చరిత్ర, ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా ఒమిక్రాన్ వ్యాప్తిస్తోందని చెప్పారు. ఒమిక్రాన్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారని, ఇది థర్డ్‌వేవ్ ప్రారంభానికి సూచిక అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. అమెరికాలో 4 లక్షలకు పైగా, ఫ్రాన్స్‌లో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని.. దేశంలోనూ రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు.

కొత్త వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు కనిపించకపోవడంతో.. ఐసోలేషన్ సమయాన్ని కూడా కొన్ని దేశాలు తగ్గించాయని పేర్కొన్నారు. ఒక శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా… భారీ మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో 62 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని, అందులో 3 కేసులు కాంటాక్ట్ లేకుండా వచ్చాయని తెలిపారు. అన్ని శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయలేమని అన్నారు. ఇంతకుముందు కొవిడ్ వచ్చిన కొందిరిలో మళ్లీ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకుని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పాజిటివిటి రేటు 0.6 నుంచి పెరుగుతుందని చెప్పారు. మూడో దశతో కొవిడ్ నుంచి విముక్తి లభించే సూచనలున్నాయని అభిప్రాయపడ్డారు. త్వరలో భారత్ బయోటెక్ నాజర్ స్పే అందుబాటులోకి రానుందని, మొల్ను ఫిరావిల్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

వేరియంట్ ఏదైనా మాస్క్, టీకా మాత్రమే రక్షణ కల్పిస్తాయి

జాతీయ స్థాయిలో ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో ఉండటం పట్ల డీహెచ్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు డీహెచ్ సానుభూతి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలతో ఒమిక్రాన్ వ్యాప్తికి అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యుల మధ్యనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. సమూహంగా చేసుకునే వేడుకలు వద్దని అన్నారు. మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. వేరియంట్ ఏదైనా మాస్క్, టీకా మాత్రమే రక్షణ కల్పిస్తాయని డీహెచ్ స్పష్టం చేశారు.

2వ తేదీ వరకు సభలు, ర్యాలీలపై నిషేధం

రాష్ట్రంలో కోవిడ్, ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా జనవరి 2 వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్‌పిలకు, పోలీస్ కమీషనర్ల ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కోవిడ్ నిబంధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను అమలు చేస్తున్నామని, ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులను ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలనే అంశాల పట్ల ప్రజలను చెతన్య వంతులను చేస్తున్నామని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వారికి కోవిడ్ నిబంధనల ఉల్లంఘన మేరకు రూ. 1000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని డిజిపి తెలిపారు. అనుమతి పొందిన కార్యక్రమాలలో విధిగా కోవిడ్ నియమ, నిబంధనలను పాటించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ప్రత్యేక ఆదేశాలిచ్చినట్లు డిజిపి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News