Friday, April 26, 2024

ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ శాంత కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Oncologist Dr. Shanta passes away

 

చెన్నై: ప్రఖ్యాత అంకాలజిస్ట్, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఛైర్‌పర్శన్ డాక్టర్ వి.శాంత మంగళవారం తెల్లవారు జామున 3.55 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 93 ఏళ్లు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందారని ఇనిస్టిట్యూట్ సీనియర్ అంకాలజిస్టు చెప్పారు. ఆమె భౌతిక కాయాన్ని పాత క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆవరణకు తరలించారు. క్యాన్సర్ రోగుల సంరక్షణ కోసం తన జీవితాంతం అవిశ్రాంత కృషి చేసిన డాక్టర్ శాంత నోబెల్ గ్రహీతలు సర్ సివి రామన్, సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన వారు. క్యాన్సర్‌పై సాగించిన పోరులో ఆమె చేసిన పరిశోధనలు, వైద్యరంగానికి చేసిన కృషికి రామన్ మెగసెసెతోపాటు పద్శశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఆమెకు లభించాయి. 2005 లో నోబెల్ బహుమతికి కూడా ఆమె నామినేట్ అయ్యారు. 1949 లో ఎంబిబిఎస్ పూర్తి చేసిన శాంత గైనకాలజీ, అబ్‌స్టెట్రిక్స్‌లో ఎండి పూర్తి చేశారు.

ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ ఆధ్వర్యంలో 1954 లో ఏర్పాటైన క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో 1955 లో చేరిన తరువాత అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి, ఆమె కుమారుడు కృష్ణమూర్తి ఈ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కుటీరంలో కేవలం 12 పడకలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రి ఇప్పుడు ప్రముఖ క్యాన్సర్ కేర్ సెంటర్‌గా విస్తరించి దేశవిదేశాల ప్రశంసలను అందుకొంటోంది. ఈ ఇనిస్టిట్యూట్‌కు శాంత ఛైర్‌పర్శన్‌గా ఉన్నారు. 1955 నుంచి క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్ శాంత క్యాన్సర్ చికిత్స పరిశోధన రంగంలో వినూత్న మార్పులను తీసుకువచ్చారు. అల్ట్రా సోనోగ్రఫీ, కంప్యూటరైజ్డ్ బయోగ్రఫీ వంటి అధునాతన వైద్య సౌకర్యాలను మూడు దశాబ్దాల క్రితమే అడయార్ ఇనిస్టిట్యూట్‌లో అందుబాటు లోకి తీసుకు వచ్చారు. పేద ప్రజలకు తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందించి సాయపడ్డారు. క్యాన్సర్ ఔషధాలకు సుంకం మినహాయింపు, క్యాన్సర్ రోగులకు రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణం, తదితర సౌకర్యాలు కల్పించడానికి విశేష కృషి చేశారని అంకాలజిస్టు డాక్టర్ వెంకట్రామన్ రాధాక్రిష్ణన్ కొనియాడారు.

ప్రధాని మోడీ సంతాపం

క్యాన్సర్ రోగులకు అత్యుత్తమ చికిత్స అందించడానికి డాక్టర్ శాంత ఎంతగానే కృషి చేశారని, ఆమె నిర్వహణలో అడయార్ ఆస్పత్రి అణగారిన వర్గాలకు, పేదలకు విశేష సేవలు అందిస్తోందని, అలాంటి వైద్యసేవకురాలు మృతి చెందడం శోచనీయమని ప్రధాని మోడీ సంతాపం వెలిబుచ్చారు. 2018 లో అడయార్ ఇనిస్టిట్యూట్ ను తాను సందర్శించినప్పుడు డాక్టర్ శాంతను కలిసిన ఫోటోలను మోడీ పంచుకున్నారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, నిర్మలాసీతారామన్ తదితర ప్రముఖులు డాక్టర్‌శాంత మృతికి సంతాపం వెలిబుచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News