మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ డైరీ 2021 ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.పాపారావు అధ్యక్షతన ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో గల సమావేశ మందిరంలో అంగరంగ వైభవంగా జరిగింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చేతుల మీదుగా తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ డైరీ(దైనందిని) 2021 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రవాణా శాఖ మంత్రి కార్యాలయం ట్రాన్స్‌పోర్ట్ భవన్, ఖైరతాబాద్‌లో జరిగింది. తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ముఖ్య అతిథిగా.. వారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్యనే భారీ స్థాయిలో ఎయంవిఐలను యం.వి.ఐలుగా రవాణాశాఖ చరిత్రలో తొలిసారిగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టి అమలు చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తు చ తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం మన దేశంలో ఏదైనా ఉందంటే అది కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వమే అని నిక్కచ్చిగా చెప్పారు. ఉద్యోగులకు వారి రోజువారీ డ్యూటీలో ఈ డైరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే వారి వృత్తికి సంబంధించిన వివరాలు కూడా డైరీలో పొందుపర్చారని అధ్యక్షులు పాపారావు ద్వారా తనకు తెలియవచ్చిందన్నారు. ఏదో మొక్కుబడిగా డైరీ రూపొందించకుండా, ఉద్యోగులకు సంబంధించిన సాంకేతిక వివరాలు, సర్కులర్‌లు, అప్ టు డేట్ జిఒలతో డైరీని తీసుకువచ్చినందుకు పాపారావుని మంత్రి అభినందించారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న అధ్యక్షుడిగా తమ సంఘ సభ్యుల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి సత్వరమే పరిష్కరిస్తున్న తీరును, అలాగే ఉన్నతాధికారిగా పాపారావు రవాణాశాఖకు చేస్తున్న సేవలను మంత్రి ప్రస్తుతించారు. ఈ సందర్భంగా తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియను చేపట్టి రవాణాశాఖలో ఎన్నడూ జరగని విధంగా చాల మంది ఎయంవిఐలను యంవిఐలుగా పదోన్నతులు కల్పించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి పువ్వాడలకు వినమ్రంగా రవాణా శాఖ ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
మా ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యమ నాయకుడు, ఉద్యోగుల పక్షపాతి అయిన సిఎం కెసిఆర్ త్వరలో ప్రకటించబోయే పిఆర్సి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగానూ, అనుకూలంగా ముమ్మాటికి ఉంటుందని ముందుగానే కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ శాఖ ఉద్యోగులందరికీ తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాపారావు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రవాణా రంగం బాగా నష్టపోయిన కారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రవాణా వాహనాలకు రెండు త్రైమాసికాల పన్ను మాఫీ చేయడం చాలా గొప్ప విషయమని, వారి మంచి మనసుకు నిదర్శనమని పాపారావు తెలిపారు. రవాణాశాఖలో చేపడుతున్న సంస్కరణలు మూలంగా ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ఈ తరుణంలో ప్రజలకు సత్వర సేవలు అందించాలనే ఉద్దేశంతో చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని అందుకు తమ శాఖ ఉద్యోగులు సమాయత్తం అవుతున్నారని పాపారావు ఈ సందర్భంగా తెలిపారు. రవాణాశాఖలో భారీగా చేపడుతున్న సంస్కరణలకు అనుగుణంగా వాహన టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారని, అలాగే నైపుణ్యతను పెంపొందించుకుంటున్నారని చెప్పారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం కూడా రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అధికారులతో పాటు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.