Friday, April 26, 2024

డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం..

- Advertisement -
- Advertisement -

డిప్యూటీ చైర్మన్‌పై 12 పార్టీల అవిశ్వాస తీర్మానం
ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తూట్లు పొడిచారని ఆరోపణ
తీర్మానం ప్రతిపై కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌తో పాటు పలు పార్టీల సంతకాలు

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసతీర్మానం నోటీసు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ 12 పార్టీలు కలిసి ఈ నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ సభ్యుడు అహ్మద్ పటేల్ తెలిపారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్, సమాజ్‌వాది పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎన్‌సిపి, ఆర్‌జెడి, నేషనల్ కాన్ఫరెన్స్, డిఎంకె, ఆమ్‌ఆద్మీపార్టీలు ఈ నోటీసు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రైతు, వ్యవసాయ విధానాలపై ఈ రోజు సభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నోటీసు ఇచ్చినట్లు పటేల్ చెప్పారు. దాదాపు వంద మంది సభ్యులు తీర్మానంపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ లేకపోవడంతో నోటీసును పార్లమెంటు కార్యాలయంలో అందజేశారు. దేశచరిత్రలో ఇదో చీకటి రోజుగా అహ్మద్ పటేల్ అభివర్ణించారు. లోక్‌సభ ఆమోదం పొందిన ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్’ బిల్లు,‘ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీస్’ బిల్లును రాజ్యసభ ఆదివారం ఆమోదించిన విషయం తెలిసిందే.

విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు. అయితే సభ్యులు ఓటింగ్ జరపాలని కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు డిప్యూటీ చైర్మన్ తూట్లు పొడిచారని ఆరోపించాయి. బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమయంలో సభను రేపటికి వాయిదా వేయాలని కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహ రించారని అహ్మద్ పటేల్ ఆరోపించారు. సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత బిల్లులపై ఓటింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ ఆయన వినిపించుకోలేదన్నారు. ఆందోళన చేస్తున్న సభ్యులు రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కూడా కొద్ది సేపు సభలోనే బైఠాయించారు కూడా.

Opp Moves No-Confidence motion against Deputy Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News