Saturday, May 4, 2024

చంద్రయాన్ భేషు… మెచ్చుకున్న పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: ఇస్రో సాగించిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం అభినందనీయం అని పాకిస్థాన్ తెలిపింది. ఇది భారతదేశపు ఘనమైన శాస్త్రీయ విజయం అని, ఇందుకు ఇస్రో శాస్త్రజ్ఞులు ఇందుకు అభినందనీయులు అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి జహ్రా బలోచ్ స్పందించారు. ఇది సైంటిస్టుల గొప్పదనం అని ఆమె వ్యాఖ్యానించారు. సంపన్న దేశాల బడ్జెట్‌తో పోలిస్తే భారతదేశం తక్కువ ఖర్చుతో ఈ విజయం సాధించిందని పాకిస్థాన్ పత్రికలు పతాకశీర్షికలలో చంద్రయాన్‌పై వార్తా కథనాలు వెలువరించాయి. కాగా పాకిస్థాన్ తరఫున తొలిసారిగా అధికారికంగా శనివారం స్పందన వెలువడింది. ఇంతవరకూ భారతదేశ విజయం గురించి అధికారికంగా పాకిస్థాన్ మాట్లాడలేదు. ఈ మౌనం వీడుతూ పొరుగుదేశాన్ని తొలిసారిగా పాకిస్థాన్ అధికారికంగా విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ద్వారా తెలియచేసింది. ఇక పాకిస్థాన్ ప్రముఖ పత్రిక ది డాన్ చంద్రయాన్‌పై సంపాదకీయం రాసింది.

భారతదేశపు అంతరిక్షపు దాహం అని శీర్షికతో ఇందులో చంద్రయాన్ 3 విజయం చారిత్రకం అని స్పందించారు. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ కూడా సంపాదకీయం వెలువరించింది. భారతదేశ చంద్రమండల ప్రయాణం అని శీర్షికతో ఈ పత్రిక ఎడిటోరియల్ వెలువరించింది. అమెరికా, చైనా, రష్యాలు ఇంతవరకూ చేయలేని విధంగా ఇప్పుడు చంద్రుడి దక్షిణం వైపు చంద్రయాన్ విజయం సాగిందని ఈ పత్రికలో విశ్లేషించారు. సామాజిక మాధ్యమాలలో కూడా పొరుగుదేశం విజయం పట్ల అభినందనలు వెలువడ్డాయి. కొందరు నెటిజన్లు పాకిస్థాన్ అంతరిక్ష సంస్థ సుపార్కో సాధించినదేమిటీ అని ప్రశ్నించారు. 1961లో ఏర్పాటు అయిన ఈ సంస్థ ఇంకా ఓ హౌసింగ్ సొసైటీ మాదిరిగానే ఉందని వ్యాఖ్యానించారు. చురకలు పెట్టారు. అణుబాంబు, అణుశక్తి సంగతి వీడి, కనీసం ఇటువంటి ప్రయోగాలు చేసినా బాగుండేదని కొందరు పౌరులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News