Sunday, April 28, 2024

సంపాదకీయం: చరిత్రాత్మక సందర్భం

- Advertisement -
- Advertisement -

Question is when will corona vaccine come

దేశానికి, జాతికి గర్వకారణమయ్యే నేత్ర పర్వంగా చిరస్థాయిని పొందే కొత్త పార్లమెంటు భవన సముదాయా (సెంట్రల్ విస్టా)నికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ ఘట్టం భారత దేశ చరిత్రలో కీలకమైనదిగా నిలిచిపోతుంది. 130 కోట్ల మందికి పైగా జనాభా గలిగి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పుకున్న సువిశాల దేశ ఆధునిక పార్లమెంటరీ అవసరాలకు తగినట్టు అన్ని హంగులతో కూడిన నూతన భవన సముదాయం ఉండి తీరాల్సిందే. త్వరితంగా అభివృద్ధి చెందుతున్న జాతికి అది చిహ్నంగా నిలుస్తుంది. 2026 తర్వాత జరిగే నియోజక వర్గాల పునర్విభజనకు అనుగుణంగా ఎక్కువ మంది సభ్యులు సమావేశమవ్వడానికి సరిపడేటట్టు కొత్త భవనాన్ని నిర్మించదలిచారు. 1927లో బ్రిటిష్ పాలకుల హయాంలో వారి అవసరాల కోసం నిర్మించిన భవనంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య భారత పార్లమెంటు నడుస్తున్నది. రాజ్యాంగ సభ సమావేశాలకు వేదికగా మొదలై ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొలువుదీరే విశిష్ట మందిరంగా ఉపయోగపడుతున్నది.

అందులో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిసి 790 మంది సమావేశం కావడానికి వసతి ఉన్నది. కొత్త పార్లమెంటు భవనాన్ని ఇప్పటి దాని కంటే అత్యధిక విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 1224 మంది పార్లమెంటు సభ్యులు కూచోడానికి అవకాశం కల్పించనున్నారు. ఆ భవనం సరసనే కేంద్ర ప్రభుత్వ సచివాలయ (నార్త్, సౌత్ బ్లాక్‌లు) విభాగాలు, ఉపరాష్ట్రపతి, ప్రధాని భవనాలు తదితరాలు ఉంటాయి. మన ప్రజాస్వామ్య ఘన వారసత్వాన్ని చాటుతూ రాజ్యాంగ మంది రం కూడా కొత్త పార్లమెంటు భవనంలో ఉంటుంది. అత్యాధునిక డిజిటల్ సాంకేతిక నైపుణాలు ఉపయోగించి పెద్ద పెద్ద టివి స్క్రీన్లు వంటివి ఏర్పాటు చేస్తారు. కాగితం అవసరం లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకునే సదుపాయాలు కలిగిస్తారు. దాదాపు రూ. వెయ్యి కోట్ల నిధుల ఖర్చుతో మొదలై రూ. 20 వేల కోట్లతో మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంకల్పించినట్టు సమాచారం.

2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జరిగే పార్లమెంటు సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించాలని సంకల్పించారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీకి ఈ సందర్భంలో రాసిన లేఖలో పేర్కొన్నట్టు కొత్త పార్లమెంటు భవనం దేశ ఆత్మ గౌరవానికి, పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఇంత భారీ ప్రాజెక్టును, దేశ సమున్నతి చిహ్నాన్ని నిర్మించుకోడానికి సమకట్టే ముందు ప్రతి పక్షాలను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వారి సంపూర్ణ ఆమోదంతో అడుగు వేసి ఉంటే బాగుండేది. ఈ నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. తాము తీర్పు ఇవ్వక ముందే నిర్మాణ స్థలంలోని వృక్షాలను వేరొక చోటికి తరలించడం వంటి పనులు చురుగ్గా సాగుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం ధర్మాసనానికి ఆగ్రహం కలిగించింది. దానితో కేవలం శంకుస్థాపన మాత్రమే చేయాలని చెట్లు తరలించడం, నిర్మాణాలు చేపట్టడం వంటి పనులు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇది, జాతి ప్రతిష్ఠకు సంబంధించిన అతి గొప్ప నిర్మాణ విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రదర్శించిన దూకుడును ఎత్తి చూపుతున్నది. భవన శంకుస్థాపన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగంలో మన ప్రజాస్వామ్య మూలాల ప్రస్తావన విరివిగా ఉంది. రుగ్వేద కాలం నుంచే ప్రజాసామ్య విలువలకు కట్టుబడి ఉన్నామని, మనది కేవలం ఎన్నికలతో సరిపుచ్చే జనతంత్రం కాదని అన్నారు. దేశ చరిత్రలోనే మైలురాయిగా మిగిలిపోతుందని ఈ దినం పేర్కొన్నారు. భారత దేశ సంస్కృతిలో ప్రజాస్వామ్యం అంతర్భాగమని అన్నారు. అది మన జీవన విధానమని కూడా అభిప్రాయపడ్డారు. శతాబ్దాల అనుభవాల నుంచి పరిణతి చెందిన ఘనమైన వ్యవస్థ అని వర్ణించారు. మంచి పాలనతో విభేదాలను పరిష్కరించుకోడం భిన్న అభిప్రాయాలు, విభిన్న కోణాలకు అవకాశం ఇవ్వడం మన ప్రజాస్వామ్య అంతశ్చైతన్య ప్రవాహాలని కూడా ఉగ్గడించారు.

అయితే ఆయన నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఊత కర్రలు లేకుండా సొంత బలంతో ఏర్పాటైన తర్వాత దేశంలో నిజమైన ప్రజాస్వామ్య విలువలు సమాధిగతమవుతున్నాయని, భిన్నాభిప్రాయానికి తావులేని ఉక్కబోత వాతావరణం నెలకొన్నదనే అభిప్రాయం నాటుకుపోయింది. ప్రజల ప్రజాస్వామ్య స్వేచ్ఛలకు, భిన్నత్వంలో ఏకత్వానికి అపాయకర పరిస్థితులు దాపురించాయనే భావన నెలకొన్నది. ప్రధాని మోడీ చెబుతున్న ఘనమైన ప్రజాస్వామ్య విలువలకు వాస్తవ పరిస్థితులకు గల వైరుధ్యాన్ని తొలగించినప్పుడే నవ శతాబ్దికి గుర్తుగా నిర్మాణం కాబోతున్న సెంట్రల్ విస్టా భవన భారీ సముదాయానికి సార్థకత కలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News