Sunday, April 28, 2024

యుపిలో మోడీ, యోగిని పొగిడినందుకు హత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రయాణికుల మధ్య జరిగిన రాజకీయ వాగ్వివాదం హత్యకు దారితీసింది. జీపులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ప్రధాని నరేంద్ర మోడీని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కీర్తించడంతో ఆగ్రహించిన జీపు డ్రైవర్ ఆ ప్రయాణికుడిని జీపులో నుంచి కిందకు గెంటేసి, వాహనంతో తొక్కించి చంపివేశాడు. జీపు డ్రైవర్‌ను అంజద్‌గా గుర్తించిన పోలీసులు అతడి స్వగ్రామంలో అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

జిల్లాలోని మహోఖర్ వద్ద ఈ సంఘటన జరిగింది. మృతుడిని రాజేష్ ధర్ దూబేగా గుర్తించారు. ఒక వివాహంలో పాల్గొని ఇంటికి తిరిగివస్తుండగా దూబే హత్యకు గురయ్యాడు.

జీపులో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న దూబే, జీపులోని మరి కొందరు ప్రయాణికుల మధ్య రాజకీయాలపై జోరుగా చర్చ జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారి మధ్య రాజకీయాలపై వేడివాడిగా వాగ్యుద్ధం సాగిందని, ఒక దశలో ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి యోగిని కీర్తిస్తూ దూబే మాట్లాడడంతో డ్రైవింగ్ చేస్తున్న అంజద్‌కు కోపం వచ్చిందని పోలీసులు చెప్పారు.

దీంతో అతను దుబేను జీపులోనుంచి బయటకు తోసేశాడని, జీపు రియర్ వ్యూ అద్దం పట్టుకుని వేలాడుతున్న అతడిని గట్టిగా నెట్టడంతో అతను జీపు వెనుక చక్రాల కింద పడ్డాడని వారు చెప్పారు. జీపును ఆపకుండా అతడిని అంజద్ తొక్కించడంతో దూబే అక్కడికక్కడే మరణించాడని పోలీసులు చెప్పారు. అంజద్ అక్కడి నుంచి పరారయ్యాడని వారు తెలిపారు. పోలీసులు అంజద్ స్వగ్రామం చేరుకుని అరెస్టు చేశారు. డ్రైవర్ అంజద్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News