Tuesday, April 30, 2024

‘అన్నదాత’కు శాంతి పురస్కారం

- Advertisement -
- Advertisement -

Peace Prize to the UN World Food Program

 

అత్యంత వివాదాస్పదుడైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశాలున్నట్టు వచ్చిన వదంతులు చాలా మందిని కలవరపెట్టి ఉండాలి. వాటిని అవాస్తవం చేస్తూ ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థకు శాంతి బహుమతిని ప్రకటించిన నోబెల్ పెద్దలను ఎంతైనా అభినందించాలి. మాసాల తరబడిగా కాల్చుకు తింటున్న కరోనా ప్రపంచ వ్యాప్తంగా మరి 15 కోట్ల మందిని అత్యంత పేదరికంలోకి నెట్టివేస్తుందని వరల్డ్ బ్యాంకు తాజాగా నిగ్గు తేల్చిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధులు ఊడబెరికి వారిని తిన తిండిలేని దుస్థితిలోకి నెట్టివేసింది. ఈ పరిస్థితిలో ప్రపంచంలోనే అతిపెద్ద అన్నదాత అనదగిన సంస్థకు శాంతి బహుమతి లభించడం దానికే కాకుండా అన్నార్తులను ఆదుకునే లక్షణమున్న వారందరికీ ప్రోత్సాహకరం. వ్యక్తులకు బదులుగా సంస్థలకు నోబెల్ శాంతి బహుమతి లభించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యునిసెఫ్, ఐక్యరాజ్యసమితి, సమితి శాంతి సంరక్షక దళాలు, రసాయనిక ఆయుధాల నిషేధ సంస్థ వంటి విశాల జనహితం కోసం కృషి చేస్తున్నవి గతంలో ఈ బహుమతి అందుకున్నాయి. ఈసారి ఆకలిని పారద్రోలే పనిలో నిరంతరం నిమగ్నమై ఉండే ఈ సంస్థకు దక్కడం ఎంతైనా అర్థవంతంగా ఉన్నది. ఏటా 88 దేశాల్లోని దాదాపు 10 కోట్ల మందికి ఇది ఆహార సాయం అందిస్తున్నది. ఆకలి అశాంతికి, అలజడికి, తిరుగుబాటుకు, ఘర్షణలకు దారి తీస్తుంది. దానిని నివారించడానికి చేసే కృషి నిస్సందేహంగా శాంతికి దోహదపడుతుంది. భీషణమైన యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో, తీవ్ర దుర్భిక్షం అలముకున్న చోట్ల నిస్సహాయ ప్రజానీకానికి ఈ సంస్థ ఆహారాన్ని అందిస్తుంది. కరోనా కరాళ నృత్యం చేస్తున్న ప్రాంతాలకు కూడా ఆహారాన్ని చేరవేస్తున్నది. నిరంతర ఘర్షణల నిలయమైన దక్షిణ సూడాన్‌లో విమానాల ద్వారా ఆహార పొట్లాలను జారవిడిచింది.

‘యుద్ధానికి, ఘర్షణకు ఆకలి ఒక ఆయుధంగా ఉపయోగపడకుండా చేయడానికి ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ పాటుపడుతున్నదని, కరోనా ఆకలిని రెట్టింపు చేయనున్న నేపథ్యంలో ఈ సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం సమంజసమైన చర్య అని నార్వేకి చెందిన నోబెల్ కమిటీ అధ్యక్షురాలు బెరిట్ రీస్ ఆండర్సన్ పలికిన పలుకులు గమనించదగినవి. కరోనాతో పోరాటానికి కూడా ఈ సంస్థ గణనీయంగా తోడ్పడుతున్నది. ఇప్పటి 120 దేశాలకు మందులు, వైద్యపరికరాలను పంపించింది. విమానాలు నడవకపోయినా సొంత ప్రయాణ సౌకర్యాలతో ఆరోగ్య కార్యకర్తలను వివిధ ప్రాంతాలకు చేరవేసింది. ఆధునిక నాగరక సమాజాల్లో కూడా ఆకలి, పోషకాహార లేమి భారీ ఎత్తున కొనసాగుతూ ఉండడం మానవాళి సిగ్గుతో తలవంచుకోవలసిన విషయం. అవసరానికి మించినంతగా ఆహారోత్పత్తి జరుగుతున్నది. 700 కోట్ల మంది ప్రపంచ జనాభాకు వాస్తవానికి తిండి లోటు ఉండడానికి వీలు లేదు.

అయితే పండిస్తున్న ఆహారం అందరికీ ఒకే రీతిన అందుబాటులో ఉండడం లేదు. కొందరికైతే పస్తుల విస్తళ్ల్లే. ప్రపంచ జనాభాలో 11.3 శాతం మంది ఆకలి బాధితులే. అంటే మనం ఎంచుకున్న ఆర్థిక వ్యవస్థలు ఎంత లోపభూయిష్టమైనవో తెలుస్తున్నది. చేతిలో తిండి కొనుక్కోడానికి తగినన్ని డబ్బులు లేనివారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అటువంటి వారు దాదాపు 80 కోట్ల మంది ఉంటారని అంచనా. ఒక్క 201819 సంవత్సరంలోనే అదనంగా కోటి మంది క్షుదార్తులు పెరిగారు. 2014తో పోలిస్తే ఆకలి బాధితుల సంఖ్యకు అదనంగా 6 కోట్ల మంది చేరారు. రోజుకు 2100 కేలరీల ఆహారం అందని వారు ఆకలితో బాధపడుతున్న వారుగా పరిగణన పొందుతారు. తగినన్ని మాంసకృత్తులు, విటమిన్లు లభించకపోతే పోషకాహార లేమి బాధిస్తుంది. దాని వల్ల పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు లేకపోడం, వారు ఆకలి చావులకు గురవడం జరుగుతుంది. ప్రపంచ మంతటా ఆర్థిక వ్యత్యాసాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోతున్నాయి.

కొద్ది మంది సంపదలు ఆకాశానికి అంటుతుండగా కోట్లాది మంది పేదరికపు పాతాళంలోకి మరింతగా కూరుకుపోతున్నారు. కేవలం ఆహారమే కాదు ఇతర కనీస వసతులు లేకపోడం రోజురోజుకీ పెరిగిపోతూ వికటాట్టహాసం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి సంస్థలు చేస్తున్న కృషి మహాజ్వాలల మీద చన్నీటి చిలకరింపులనే తలపిస్తుందనడం అసత్యం కాబోదు. అందుచేత ఒకవైపు ఇటువంటి సంస్థల కృషి కొనసాగుతుండగానే మరొక వైపు వీలైనంత న్యాయమైన పంపిణీ జరిగే వ్యవస్థలను ఆవిష్కరించుకోవలసి ఉన్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News