Monday, April 29, 2024

టీకా ఉత్పత్తికి ప్రైవేటు సాయం

- Advertisement -
- Advertisement -

PM Modi review meeting on Covid 19 situation

టీకా ఉత్పత్తికి ప్రైవేటు సాయం
కలిసికట్టుగా మరోసారి కరోనా కట్టడి
అధికారులతో సమీక్షలో ప్రధాని మోడీ
ట్రిపుల్ టి పటిష్ట అమలుపై దృష్టి
ఆక్సిజన్ నిల్వలు, రెమ్‌డెసివిర్‌పై ఆరా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణకు విరివిగా క్షేత్రస్థాయిలో సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించడం కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచాలని ఇందుకు అవసరం అయితే ప్రభుత్వ ప్రైవేటు రంగాల పూర్తి సామర్థాన్ని వినియోగించుకోవాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా ఉధృతి దశలో కేంద్రం అనుసరిస్తున్న ట్రిపుల్ టి పద్ధతి అంటే టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్ (టిటిటి) ను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉందన్నారు. . దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో తలెత్తిన పరిస్థితి, నియంత్రణ చర్యలపై ప్రధాని మోడీ శనివారం రాత్రి వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు కీలక విషయాలు ఇందులో ప్రస్తావనకువచ్చాయి. సెకండ్‌వేవ్ తీవ్రస్థాయిలో ఉందని, అయితే గత ఏడాది మనమంతా సంఘటితంగా ప్రదర్శించిన సంకల్పబలం ఇప్పుడూ ప్రదర్శిస్తే ఇప్పటి ఉధృతిని తిప్పికొట్టవచ్చునని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా మనం సాధించలేనిది ఏది లేదన్నారు. ఇంతకు ముందు చేసి చూపించాం, ఇప్పుడు మరోసారి దీనిని నిరూపిస్తామన్నారు. అయితే మునుపటి సూత్రాలు, విధానాలు పాటించితీరాలని అయితే త్వరితగతి, మరింత వేగవంతం, అంతకు మించి సమన్వయం సహకారంతో వైరస్ ఇప్పటి రెండో స్థాయిని అరికట్టవచ్చునని తెలిపారు. పత్యేకించి అనేక రాష్ట్రాలలో మౌలిక స్థాయిల్లో వైరస్ ఆటకట్టుకు ఎదురవుతున్న అంశాలను ఉన్నతాధికారులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.

మొత్తం మీద దేశవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రులలో కూడా వైద్యచికిత్సపరంగా అత్యవసరం అయిన ఆక్సిజన్ నిల్వల లేమి, చివరకు అంబులెన్స్‌ల కొరత వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ అంశాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని, అయితే ట్రిపుల్ టి పద్థతికి ప్రత్యామ్నాయం లేదని అధికారులకు ప్రధాని తేల్చిచెప్పారు. ఇప్పుడు వైరస్ డబుల్ మ్యుటెంట్ స్థాయి, వేరియంట్ నమూనాలతో వివిధ ప్రాంతాలలో పలు ఆంక్షలు నెలకొన్నాయి. ఈ దశలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిల్లో వివిధ ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి వ్యాక్సిన్ల కొరత, ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దేశంలో ఇప్పుడు అత్యవసరం అయిన రెమ్‌డెసివిర్ ఇతర ఔషధాల అవసరాలు, నిల్వలు అందుబాటు స్థాయిలు వంటి వాటిపై సమీక్ష జరిగింది. వివిధ రాష్ట్రాలు దేశంలోని ఔషధ పరిశ్రమకు ఉన్న అపార సమర్థతను సరైన విధంగా వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే పదిహేను రోజులలో వివిధ రాష్ట్రాలలో అవసరం అయిన ఆక్సిజన్, కరోనా టీకాల డిమాండ్ ఇందుకు అనుగుణంగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు గురించి ప్రధాని సమీక్షించారు. మహారాష్ట్ర, పంజాబ్ వంటి కరోనా ఉధృతి రాష్ట్రాలకు తగు విధంగా అవసరం అయిన ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా వంటి వాటిపై ప్రధాని దృష్టి సారించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో జిల్లాలవారి కరోనా పరిస్థితి గురించి అధికారులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారని ఆ తరువాత ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. కరోనాపై ఉన్నతాధికారులతో ప్రధాని రెండు రోజుల సమీక్షా సమావేశం శుక్రవారం శనివారం సాగింది. పలుదఫాలుగా సిఎంలు, తాజాగా గవర్నర్లుతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్న ప్రధాని ఇప్పుడు అత్యున్నత స్థాయి ఉన్నతాధికారులతో పరిస్థితిని పరిశీలించి వాస్తవిక పరిస్థితి గురించి ఆరాతీశారు.

PM Modi review meeting on Covid 19 situation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News