Sunday, April 28, 2024

నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: ప్రధాని మోడీ చురకలు

- Advertisement -
- Advertisement -

నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు
రాహుల్ గాంధీపై పరోక్షంగా ప్రధాని చురకలు
ప్రజాస్వామ్యం ఎంత బలమైందో కశ్మీర్ చూపించింది
అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేశారంటూ ప్రశంసలు
జమ్మూ, కశ్మీర్‌లో ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ తనకు ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ చురకలంటించారు. ఢిల్లీ వేదికగా ప్రతి రోజూ తనను విమర్శిస్తున్నారని, వారందరూ జమ్మూ, కశ్మీర్‌ను చూసి పాఠాలు నేర్చుకోవాలని హితవు చెప్పారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ‘ ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో జమ్మూ, కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చూపించాయి. ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ నన్ను అవమానించాలని, నాకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పాలని చూస్తున్నారు. వారి కపటత్వం, పవిత్రతను ఓ సారి చూడండి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వారు పుదుచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన వెంటనే జమ్మూ, కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాం. జమ్మూ, కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను వారు ఒకసారి చూడాలని కోరుతున్నా. జమ్మూ, కశ్మీర్ ప్రజలు ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేశారు’ అంటూ పరోక్షంగా రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. కాగా రెండు రోజుల క్రితం మోడీ సర్కార్‌ను విమర్శించే క్రమంలో దేశంలో ప్రజాస్వామ్యం లేదంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం తెలిసిందే. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని టెర్రరిస్టులుగా ముద్ర వేస్తున్నరని విమర్శించారు. ఒక వేళ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌వారి జాబితాలో ఉన్నా ఆయనను కూడా టెర్రరిస్టుగానే అభివర్ణిస్తారంటూ ధ్వజమెత్తడం తెలిసిందే.

దేశ అభివృద్ధితో భుజం భుజం కలుపుతూ జమ్మూ, కశ్మీర్ కూడా ఇప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా జమ్మూ, కశ్మీర్‌లో జరిగిన అభివృద్ధి అత్యంత ప్రశంసనీయమైనదని కొనియాడారు. జమ్మూ, కశ్మీర్ చరిత్రలో ఇదో చరిత్రాత్మకమైన రోజుగా ఆయన అభివర్ణించారు. గాంధీ మహాత్ముడి విజన్ అయిన గ్రామస్వరాజ్యాన్ని జమ్మూ, కశ్మీర్ ప్రజలు సాధించారని ప్రశంసించారు. ఎముకలు కొరికే చలిలో సైతం ప్రజలు పెద్ద సంఖ్యలో పోటింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారన్నారు. గతంలో తాము ఇక్కడి ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకున్నామని, అయితే ఆ తర్వాత పొత్తు విచ్ఛిన్నమైందని మోడీ పరోక్షంగా మెహబూబా ముఫ్తీతో కొనసాగిన పొత్తుగురించి వ్యాఖ్యానించారు. ప్రజలందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన నాయకుడ్ని ఎన్నుకోవాలనేదే తమ తాపత్రయంగా ఉండేదని వివరణ ఇచ్చారు. జమ్మూ, కశ్మీర్‌లోని 20 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా జరిగిన జిల్లా అభివృద్ధి మండళ ్ల(డిడిసి) ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ అలయెన్స్ కాంగ్రెస్ పార్టీతో కలిసి 13 జిల్లాల్లో విజయం సాధించగా, బిజెపి జమ్మూలోని ఆరు జిల్లాల్లో గెలుపొందింది. కశ్మీర్‌లో మొట్టమొదటిసారిగా గెలుపొందిన తర్వాత కశ్మీర్ లోయలో కమలం వికసించిందంటూ బిజెపి వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ, కశ్మీర్‌లోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా వర్తింపజేసేందుకు ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాంభించారు. ఈకార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ, కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పాల్గొన్నారు.

PM Modi Slams Rahul Gandhi on Teaching Democracy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News