Tuesday, April 30, 2024

పాశ్వాన్‌కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి

- Advertisement -
- Advertisement -
President and Prime Minister pay tribute to Paswan
భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం వద్ద సందర్శించి నివాళులర్పించారు. వారితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, గిరిరాజ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, రాజ్‌నాథ్ సింగ్, అశ్వినీ కుమార్ చౌబే, స్మృతి ఇరాని, ధర్మేంద్ర ప్రధాన్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా పాశ్వాన్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మరో కేంద్ర మంత్రి, ఆర్‌పిఐ అధ్యక్షుడు రాందాస్ అథావలె కూడా పాశ్వాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

పాశ్వాన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, బిజెపి ఎంపీలు ప్రజ్ఞా ఠాకూర్, అనురాగ్ ఠాకూర్, రమేశ్ బిధూరి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, ఆర్‌జెడి ఎంపి మీసా భారతి, ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ప్రభృతులు ఉన్నారు. పాశ్వాన్ మరణంతో దేశం ఒక గొప్ప దళిత, సోషలిస్టు నాయకుడిని కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పాశ్వాన్ ఒక ముఖ్యమైన దళిత నాయకుడని రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు రాసిన ఒక లేఖలో మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. 2004లో తన సారధ్యంలో ఏర్పడిన యుపిఎ ప్రభుత్వంలో పాశ్వాన్ ఒక సభ్యుడిగా ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.

దేశంలోని ప్రముఖ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్ గతంలో వేర్వేరు ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కొద్ది కాలం క్రితం గుండె ఆపరేషన్ చేసుకున్న పాశ్వాన్ కొద్ది వారాలుగా ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపం తెలియచేసేందుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం సమావేశమైంది. పాశ్వాన్ గౌరవార్థం ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులలో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. వినిమయ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్న పాశ్వాన్ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని విమానంలో పాట్నాకు తరలించి శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News