Saturday, April 27, 2024

యాదాద్రి శిల్పం అద్భుతం…

- Advertisement -
- Advertisement -

భువనగిరి ప్రతినిధి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదురోజుల తెలంగాణ పర్యటన ముగిసింది. పర్యనటలో చివరిరోజు శుక్రవారం ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి పుణ్యక్షేత్రంను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ రాష్ట్రపతికి ఆహ్వానం పలికారు. అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు మంగళవాద్యాలు, పూర్ణకుంభం తో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికారు. గర్భాలయంలో లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్రపతికి అర్చకులు చతుర్వేద ఆశీర్వచనాలు అందించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. యాదాద్రి పర్యటన సందర్భంగా రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళ సై కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో విప్ గొంగడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్ పమేల సత్పథి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు దర్శనానంతరం యాదాద్రి పరిసరాలను రాష్ట్రపతి పరిశీలించారు. అద్దాల మండపం, ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆమె తిలకించారు. అద్భుతమైన శిల్పకళను చూసి ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఉత్తర రాజ గోపురం ముందు రాష్ట్రపతితో మంత్రులు, అధికారులు, దేవాలయ సిబ్బంది ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆలయంలో విఐపి దర్శనాలను ఉదయం పూట నిలిపివేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటి ష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండ కింద 3 హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. 1200 మంది సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కొం డపైకి భక్తుల వాహనాలకు అనుమతించలేదు. ఇప్పటివరకు నలుగురు రాష్ట్రపతులు యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారి రాష్ట్రపతి హోదాలో ముర్ము దర్శించుకున్నారు.
రాష్ట్రపతి నిలయంలో విందు
యాదాద్రి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్రమంత్రులు, ఎంపీలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ హకీంపేట ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచా రం శ్రీనివాస్ రెడ్డి వీడ్కోలు పలికారు. ప్రతి ఏటా శీతాకాల విడిది కోసం డిసెంబర్ నెలలో రాష్ట్రపతి హైదరాబాద్‌కు రావడం ఆనవాయితీగా వస్తుంది. కరోనా కారణంగా రెండేళ్ళుగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి దూరంగా ఉన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News