Tuesday, April 30, 2024

కొత్త జోన్లతో సమన్యాయం

- Advertisement -
- Advertisement -

Presidential seal of approval for the new zonal system

 

రాష్ట్రంలో ఎన్నాళ్లుగానో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న వివిధ రకాల ఉద్యోగాల నియామకాల ప్రకటనలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కూడిన నూతన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. భారత రాజ్యాంగంలోని 371 డి లోని(1) ( 2) క్లాజుల కింద ఉండబడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్) ఆర్డర్-2018కి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 19న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రతిబంధకంగా తయారైన పాత జోనల్ వ్యవస్థ స్థానంలో నూతన జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడటంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఎదురవుతున్న ఆటంకాలు అన్ని తొలగిపోయాయి.

2018లోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్ వ్యవస్థను రాష్ట్రపతి ఆమోదించినప్పటికీ తదనంతరం ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పాటు చేయడం, ప్రజల కోరిక మేరకు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్చడం లాంటి సవరణలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సూచించడం తాజాగా వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో కొత్త జోనల్ విధానం అమల్లోకి రానుంది. నూతన జోనల్ విధానంలో విద్యార్థులకు, ఉద్యోగులకు పలు రకాల ప్రయోజనాలు సమకూరనున్నాయి. విద్య, ఉద్యోగాల్లో అసమానతలు రూపు మాసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు రానున్నాయి. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందిన జిల్లాలే కాక మారుమూల ఏజెన్సీ, వెనుకబడిన జిల్లాలకు కూడా న్యాయం జరుగనుంది. ఉమ్మడి రాష్ట్రంలోని జోన్‌ల విధానంలో తెలంగాణకు జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్రప్రభుత్వం నూతన జోనల్ విధానానికి రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం దానిని రాష్ట్రపతి ఆమోదించడంతో ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న సమస్య పరిష్కారమైంది. నూతన జోనల్ విధానంలో 95 శాతం కొలువులలో స్థానికులకే అవకాశాలు రానున్నాయి.33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లలో అన్ని రకాల పోస్టుల్లోను ఓపెన్ కోటా ఐదు శాతానికి పరిమితం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాలలో తెలంగాణ ప్రాంతం వారికి పూర్తిగా అన్యాయం జరిగింది. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన వివక్షతకు వ్యతిరేకంగా 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. నాటి ఉద్యమాన్ని చల్లార్చడానికి స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల కల్పనకు గాను 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371 (డి) అధికరణను పార్లమెంట్ ఆమోదించింది. ఈ సవరణ చట్టం 1974 జూలై 1నుండి అమల్లోకి వచ్చింది. 371(డి) నిబంధనను అమలు చేయడానికి 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి వెలువరించిన 674 జీవో నే రాష్ట్రపతి ఉత్తర్వులుగా అమల్లోకి వచ్చాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా జోనల్, మల్టీ జోనల్, జిల్లా యూనిట్ గా జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆరు జోన్లుగా విభజిస్తే తెలంగాణ ప్రాంతంలో ఐదవ, ఆరవ జోన్లు ఏర్పాటయ్యాయి. జోన్ -5లో పాత వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు జోన్ -6లో పూర్వ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు ఏర్పాటయ్యాయి.

ఈ విధానంలో జిల్లా స్థాయి ఉద్యోగ నియామకాల్లో 80 శాతం, జోనల్ పోస్టుల్లో 70 శాతం, మల్టీ జోనల్ పోస్టుల్లో 60 శాతం పోస్టులు స్థానికులకు కేటాయించారు. జిల్లా స్థాయిలో 20 శాతం పోస్టులు, జోనల్ స్థాయిలో 30 శాతం, మల్టీ జోనల్ పరిధిలో 40 శాతం పోస్టులు ఓపెన్ టు ఆల్ కింద ఉండటంతో దాదాపు మొత్తం ఆంధ్ర ప్రాంతం వారే తన్నుకు పోయారు. గ్రూప్-1 లోని రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరి) పోస్టులలో 100 శాతం, మరికొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్ కోటా కింద ఉండటంతో ఆంధ్ర ప్రాంతం వారితో పాటు ఇతర రాష్ట్రాల వారు పోటీపడి ఉద్యోగాలు దక్కించుకోవడంతో తెలంగాణ ప్రాంతం వారికి ఉద్యోగ ఫలాలు అందకుండా పోయాయి. 371 (డి) అధికరణ తీసుకు వచ్చినప్పటికీ తెలంగాణ వారికి లాభం లేకుండా పోయింది. తెలంగాణలో 6వ జోన్ లో భాగంగా ఉన్న హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ గా గుర్తిస్తూ 2009 అక్టోబర్ 9న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ముల్కీ రూల్స్ కు, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని దానికి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, బంద్‌లతో తెలంగాణ ప్రాంతం అట్టుడికిపోయింది.

హింసాత్మక ఘటనలు ఏర్పడ్డాయి. ఫ్రీ జోన్ సమస్య పై ఆందోళనలు వెల్లువెత్తడంతో హైదరాబాద్ ఫ్రీ జోన్‌గా గుర్తించడానికి కారణమైన రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 లోని క్లాజ్ 14 (ఎఫ్)ను కేంద్ర హోంశాఖ 2011లో తొలగించి ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్ ను ఫ్రీజోన్ నుంచి తొలగించి ఆరవ జోన్ లోనే కొనసాగించారు. కానీ ఈ చర్యలతో తెలంగాణ ప్రజలు ఉపశమనం పొందక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా సుదీర్ఘంగా పోరాడి 2014లో తమ స్వరాష్ట్ర కలను సాధించుకున్నారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్ పిఎస్‌సి)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ కేటగిరీల ఉద్యోగాలను గుర్తించినప్పటికీ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జోనల్ వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకాలు నిలిచిపోయాయి. తెలంగాణలో తొలుత 31 జిల్లాల ఏర్పాటు చేయడం, రెండు జోన్లను ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్‌లుగా మార్చే ప్రక్రియలో ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది.

కొత్త జోనల్ వ్యవస్థకు 2018 లోనే రాష్ట్రపతి ఆమోదం లభించినప్పటికి మరో రెండు జిల్లాల ఏర్పాటు, వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్‌కు మార్చడం లాంటి వాటికి రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి రావడంతో రెండు సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. ప్రధానంగా జోన్ ల సమస్యతో గ్రూప్-1, గ్రూప్- 3 ఉద్యోగాలు భర్తీకి నోచుకోలేదు. గ్రూప్- 2, గ్రూప్- 4 నియామకాలు, జోన్- 5( పూర్వ వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలు) జోన్-6 (పూర్వ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల) ప్రాతిపదికన భర్తీ చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత వివిధ ఉద్యోగ సంఘాలు, వివిధ శాఖాధిపతులతో అనేక సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

తాజాగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులతో అన్ని గ్రూప్ కేటగిరీల ఉద్యోగాలు భర్తీ చేయడానికి మార్గం ఏర్పడింది. నూతన జోనల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం 34 రకాల రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరి) పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నుంచి తొలగించి మల్టీ జోనల్ పరిధిలోకి తెచ్చింది. కొన్ని కేటగిరీ పోస్టులు జోనల్, జిల్లాస్థాయి పోస్టులుగా మారనున్నాయి. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల మధ్య ప్రస్తుత ఉద్యోగులను విభజించాల్సి ఉంది. జనాభా ప్రాతిపదికన ఏయే జిల్లాలకు ఉద్యోగులు ఎంతమంది ఉండాలని అంశంపైనా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. పాత జోనల్ విధానంలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లానే స్థానిక జిల్లాగా పరిగణించేవారు. కొత్త జోనల్ విధానం ప్రకారం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి మధ్య వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు. ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన 50 వేల ఉద్యోగాలు కొత్త జోనల్ వ్యవస్థ లో భర్తీ కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News