Sunday, May 12, 2024

ఫ్లాయిడ్ హంతకుడికి శిక్ష

- Advertisement -
- Advertisement -

Derek Chauvin who killed Floyd was sentenced

 

“మేము మళ్లీ ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం, అయితే న్యాయం కోసం చేస్తున్న మా పోరాటం ఇక్కడితో ఆగదు” గత ఏడాది అమెరికాలో 46 ఏళ్ల ఆఫ్రికన్ అమెరికన్ నల్ల జాతి పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను హత్య చేసిన పోలీసు అధికారి బెరెక్ చావిన్‌కు శిక్ష పడిందని తెలిసిన వెంటనే ఫ్లాయిడ్ కుటుంబం చేసిన ఈ వ్యాఖ్య చరిత్రలో నిలిచిపోతుంది. పరమ దుర్మార్గుడికి శిక్ష పడినందుకు సంతోషిస్తూనే అమెరికాలో నల్ల జాతి వారి మీద శ్వేత జాతి దురహంకార పోలీసులు అదే పనిగా సాగిస్తున్న హత్యాకాండ, తెల్లవారి వల్లమాలిన తెంపరితనం సమూలంగా అంతమొందితే గాని తాము స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేమన్న ప్రకటన, ప్రతిజ్ఞ కూడా ఫ్లాయిడ్ కుటుంబం స్పందనలో స్పష్టంగా ధ్వనిస్తున్నాయి. ఆ రోజు (2020 మే 25) సాయంత్రం 8 గం.ల ప్రాంతంలో ఫ్లాయిడ్ మినియాపొలిస్ నగరంలోని కప్ ఫుడ్స్ అనే దుకాణంలో సిగరెట్లు కొనుక్కొని వస్తుండగా అతడిచ్చిన 20 డాలర్లు నకిలీవని చెప్పి ఆ సిగరెట్లు తిరిగి ఇచ్చేయాలని షాప్ సిబ్బంది అతని వెంట పడ్డారు.

అందుకాయన నిరాకరించడంతో వారు పోలీసులను పిలిచారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి బెరెక్ చావిన్, ఫ్లాయిడ్‌ను కిందకు తోసేసి అతడి మెడ మీద మోకాలితో గట్టిగా అదిమిపట్టి ఉంచాడు. ఊపిరి ఆడడం లేదు, విడిచి పెట్టాలంటూ ఫ్లాయిడ్ ఎంతగా మొరపెట్టుకున్నా అతడికి దయ కలగలేదు. అలా తొమ్మిది నిమిషాలు గడిచింది. ఆలోగా ఊపిరి ఆగిపోయి ఫ్లాయిడ్ మరణించాడు. ఈ దారుణ ఘటన వీడియో దృశ్యాన్ని చూసిన అమెరికాలోని నల్లవారందరూ బాధతో, కోపంతో ఊగిపోయారు. తెల్ల పోలీసు దుర్మార్గాల పట్ల నిరసన కత్తులు దూశారు. ప్రపంచమంతటి నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. ఈ కేసులో బెరెక్ చావిన్‌పై ప్రయోగించిన రెండో డిగ్రీ హత్య, మూడో డిగ్రీ హత్య, నరమేధం అనే మూడు ఆరోపణలనూ 12 మంది న్యాయమూర్తుల మిన్నెసొట్టా ధర్మాసనం ధ్రువీకరించింది. రెండు మాసాల్లో శిక్ష ప్రకటిస్తారు. అక్కడి చట్టాల ప్రకారం శిక్ష పన్నెండున్నరేళ్ల నుంచి 40 సంవత్సరాల వరకు ఉండొచ్చునని అంటున్నారు. అగ్ర రాజ్యం, అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అనిపించుకుంటున్న అమెరికాలో పోలీసులది ఇష్టారాజ్యమే. వారు చట్టాన్ని అందరి పట్లా ఒకే రకంగా అమలు చేయరు.

భిన్న జాతుల ప్రజలున్న ఆ దేశంలో ఆఫ్రికన్ అమెరికన్లను నిత్య నేరస్థులుగా చూసే జాతి వివక్ష వారి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. అక్కడి మిగతా అన్ని జాతుల వారి కంటే ఆఫ్రికన్ అమెరికన్లే అతి ఎక్కువగా పోలీసు కాల్పుల్లో బలి అవుతుంటారు. పోలీసు కాల్పులకు ప్రాణాలు కోల్పోతున్న తెల్లవారి కంటే నల్ల జాతి వారి సంఖ్య మూడు రెట్లు ఎక్కువని కొన్ని అధ్యయనాలు, ఏడున్నర రెట్లు అధికమని మరి కొన్ని నివేదికలు నిర్ధారించాయి. అదే సందర్భంలో పోలీసులపై నమోదయ్యే 98 శాతం హత్య కేసుల్లో వారు నిర్దోషులుగా బయటపడుతుంటారని వెల్లడైంది. అత్యంత అరుదుగా గాని పోలీసులకు శిక్ష పడదు. అందుకే ఫ్లాయిడ్ హత్య కేసులో బెరిక్ చావిన్‌కు శిక్ష పడడం అసాధారణ స్థాయి హర్షాతిరేకానికి దారి తీసింది. ఈ తీర్పుతో అమెరికాలో పోలీసు సంస్కరణలు పురి విప్పుకుంటాయని ఆశిస్తున్నారు. పోలీసులు చేసే హత్యలు కూడా మామూలు హత్య కేసుల మాదిరిగానే నిష్పాక్షిక విచారణకు నిలబడి వారికి తగిన శిక్షలు పడడం జరుగుతుందని భావిస్తున్నారు. పోలీసులకు జవాబుదారీతనం నెలకొంటుందని ఎదురు చూస్తున్నారు.

ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికాలో ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ (నల్ల జాతి వారి ప్రాణాల గురించి మాట్లాడుకుందాం) ఉద్యమం ఉధృతంగా సాగింది. అమెరికాలో ప్రతి 10 లక్షల మంది శ్వేత జాతీయుల్లో 2.9 మంది పోలీసు కాల్పుల్లో మరణిస్తుంటే, ప్రతి 10 లక్షల మంది నల్ల జాతి వారిలో 7.2 మంది బలి అవుతున్నారు. అంటే జాతి వివక్ష అక్కడ ఎంతగా పాతుకుపోయి ఉందో అర్థంకాక మానదు. ఫ్లాయిడ్ కేసులో శిక్ష ప్రకటిస్తూ వచ్చిన తీర్పు పోలీసు జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నవారికి లభించిన ఒక చిన్న విజయమని, బాధిత జాతికి స్వల్ప ఊరట అని హర్షించిన అమెరికన్ పౌర హక్కుల సంఘం ఈ హత్యకు అవకాశమిచ్చిన వ్యవస్థ మాత్రం చెక్కుచెదరకుండా ఇంకా అలాగే ఉందని కుండబద్దలు కొట్టింది.

అందుచేత పోలీసులకు అపరిమిత అధికారాలు కల్పిస్తున్న నియమ నిబంధనలను సమూలంగా మారిస్తే తప్ప నల్ల జాతి వారి పట్ల అక్కడి పోలీసు వ్యవస్థకున్న చిన్నచూపు తొలగదు. విచిత్రమేమంటే ఫ్లాయిడ్ హత్య జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఆ హత్యను ఖండిస్తూనే పోలీసు కాల్పుల్లో నల్లవారి కంటే తెల్లవారే ఎక్కువగా చనిపోతున్నారని బుకాయించారు. ఇప్పుడక్కడి రాజకీయ వాతావరణంలో పూర్తి మార్పు వచ్చింది కాబట్టి ముందు ముందు ఆఫ్రికన్ అమెరికన్ల పట్ల, ఇతర శ్వేతేతర జాతుల పట్ల అమెరికన్ పోలీసు వ్యవస్థ తీరు ఎలా ఉండబోతుందో చూద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News