Saturday, April 27, 2024

కరోనా పై వదంతుల వ్యాప్తిని అడ్డుకోండి

- Advertisement -
- Advertisement -

supreme court

 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో సాగుతున్న కార్మికుల వలసలకు అడ్డుకట్ట వేయాలని, వదంతులు వ్యాపించకుండా సరైన సమాచారం సరైన సమయంలో అందించేందుకు 24 గంటల్లో ప్రత్యేక పోర్టల్ , ప్యానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎట్టి పరిస్థితి లోను వలసలు సాగకుండా నిరోధించాలని, వలస కార్మికులకు వసతి గృహాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించాలని సూచించింది. వసతి గృహాల నిర్వహణను పోలీసులకు కాకుండా వలంటీర్లకు అప్పగించాలని సూచించింది. కార్మికులకు ఆహారంతోపాటు వసతి, వైద్యసదుపాయాలు కల్పించాలని కోరింది. వసతి గృహాల్లో ఉంటున్న వలస కార్మికులకు ఉపశమనం కలిగించడానికి శిక్షణ పొందిన కౌన్సిలర్లను, కమ్యూనిటీ లీడర్లను నియమించాలని సూచించింది. వలస కార్మికుల స్థితి, కరోనా వైరస్ నివారణ చర్యలపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం కోర్టుకు కేంద్రం స్టేటస్ రిపోర్టును సమర్పించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తన వాదన వినిపించారు. గత గణాంకాల ప్రకారం దాదాపు 4.14 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని, వీరంతా కరోనాభయంతో తమ స్వస్థలాలకు చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే వారు తిరిగి గ్రామాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదని మెహతా చెప్పారు. అంతర్రాష్ట వలసలను పూర్తిగా నిషేధించడమైందని, కేంద్ర కంట్రోల్ రూమ్ వివరాల ప్రకారం ఇంతవరకు 6,63,000 మంది దేశం మొత్తం మీద వసతి పొందారని తెలిపారు. దాదాపు 22,౮౮,౦౦౦మందికి భోజనం కల్పించడమైందని, వీరిలో వలసకార్మికులు, దినసరి కార్మికులు తదితర అవసరమైన వారు ఉన్నారని, వీరంతా ఎక్కడో ఒక చోట చేరినప్పుడు వారిని ఆపివేసి వసతి గృహాలకు చేర్చుతున్నట్టు తెలిపారు. కరోనా బాధితుల చికిత్స కోసం 40000 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు.

కరోనాపై సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయడమైందని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోని జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సమర్ధులైన వైద్యులను ఈ యూనిట్‌లో ఏర్పాటు చేయడమైందని చెప్పారు. విమానాశ్రయాల్లో 15.25 లక్షల మంది ప్రయాణికులను స్క్రీనింగ్ చేయడమైందని, 12 ప్రధాన రేవు పట్టణాల్లో 65 చిన్న రేవు పట్టణాల్లో 40000 మందికి స్క్రీనింగ్ చేయడమైందని తెలిపారు. కరోనా పరీక్ష సామర్ధాన్ని కూడా పెంచినట్టు రోజుకు 15000 పరీక్షలు జరుగుతున్నట్టు వివరించారు.

కరోనా చికిత్సకు కావలసిన బ్లాకులు, ఆస్పత్రులు కల్పించాలని వివిధ శాఖలకు, ముఖ్యంగా రైల్వే, రక్షణ, పారామిలిటరీ దళాలకు, కార్మిక శాఖకు ఆదేశించినట్టు చెప్పారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల దగ్గర 20 లక్షల మందికి స్క్రీనింగ్ చేయడమైందని , ఇంతవరకు 1.35 లక్షల ఐసొలేషన్ బెడ్‌లను గుర్తించినట్టు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి బోబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ధర్మాసనం బాధితుల చికిత్సకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఏప్రిల్ 7 నాటికి ఈ విచారణ వాయిదా వేసింది.

 

Prevent the spread of rumors on Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News