Wednesday, May 1, 2024

బ్రిటన్ సింహాసనంపై ప్రిన్స్ చార్లెస్-3

- Advertisement -
- Advertisement -

Prince Charles ascended throne as King of Britain

ఎలిజబెత్ వారసత్వానికి
న్యాయం చేస్తా చార్లెస్
ఉద్వేగభరిత ప్రసంగం

లండన్ : ప్రేమకథ విషాదాంతం, రాజరికంలో నిరాడంబరత్వం సంతరించుకుని ఉన్న ప్రిన్స్ ఛార్లెస్, ఇప్పుడు ప్రపంచ స్థాయి సుదీర్ఘ చరిత్రక బ్రిటన్‌కు రాజుగా సింహాసనం అధిరోహించారు. ఇప్పటి వరకూ సామ్రాజ్ఞి రాజరిక ఏలుబడిలో ఉన్న బ్రిటన్ పండుటాకు దశలో క్వీన్ ఎలిజబెత్ అస్తమయంతో ఆమె పెద్ద వారసుడు రాజరిక వారసత్వం తీసుకోవడంతో తిరిగి సామ్రాట్ శకానికి దారితీసింది. తనను అధికారిక ధారదత్త మండలి రాజుగా ప్రకటించిన తరువాత , సింహాసన అధిష్టానపు చారిత్రక ఘట్టంలో కింగ్ ఛార్లెస్ శనివారం ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. లండన్‌లోని ప్రఖ్యాత సెయింట్ జేమ్స్ హాల్‌లో మండలి తరఫున ఆయనకు రాజరిక అధికారాలు కట్టబెట్టారు ఈ రాజరిక స్వీకార ఘట్ట దశలో ఛార్లెస్ ప్రసంగాన్ని బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా పౌరులందరికి విదితం అయ్యేలా ప్రత్యక్ష ప్రసారం చేశారు. తల్లి ఎలిజబెత్ పరిపూర్ణ జీవితం అనుభవించారు. బ్రిటన్ సేవలో అంకితభావంతో విధులు నిర్వర్తించారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ 2 సేవలను ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా తీసుకుని తాను దేశానికి సేవలు అందిస్తానని 73 సంవత్సరాల ఛార్లెస్ తెలిపారు.

రాణి జీవితకాలంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా ఉన్న ఛార్లెస్ ఇప్పుడు బ్రిటన్‌కు కింగ్ అయిన దశలో తల్లి చిత్రపటాన్ని తన పక్కన పెట్టుకుని ప్రసంగించారు. తన తల్లి జీవితకాలం అంతా దేశం కోసం అంకితం చేశారని, ఆమె వారసత్వాన్ని చెక్కుచెదరకుండా కొనసాగిస్తానని ప్రతిజ్ఞ వహిస్తున్నానని తెలిపారు. రాజుగా ఛార్లెస్‌నియామక ప్రకటన సంబంధిత మండలి ఉన్నతాధికారి మాటలతో మొదలైంది. గాడ్ సేవ్ ది కింగ్ అంటూ ప్రిన్స్ ఛార్లెస్ కింగ్ ఛార్లెస్ 3గా నియమితులు అయినట్లు ప్రకటించారు. ఎలిజబెత్ క్వీన్ మరణం తరువాత స్వతహసిద్ధంగానే ఆమెకు వారసుడిగా ఛార్లెస్ బ్రిటన్ రాజు అయ్యారు. అయితే తరతరాలు, శతాబ్దాల నుంచి నెలకొని ఉన్న పలు సాంప్రదాయాలు, రాజరిక పద్ధతుల నడుమ జరిగే కార్యక్రమాల తరువాతనే కింగ్‌గా అధికారిక తంతు తరువాతనే చలామణిలోకి వచ్చారు. ‘ రాణి అస్తమయంతో ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ ఇప్పుడు కొత్త రాజు అయ్యారు. దేశానికి ఇకపై కొత్త రాజుగా ఛార్లెస్ 3 అయ్యారని సంబంధిత కౌన్సిల్ ప్రకటించింది. ఈ సమయంలో ఆయన వెంట భార్య క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా, ఆయన కుమారుడు విలియం ఉన్నారు.

క్వీన్ అంకితభావమే స్ఫూర్తిగా సాగుతా

జీవితకాలం నిస్వార్థ , అంకిత భావ ప్రేమ ఆదరణల సుదీర్ఘ కాలపు సేవలకు ఉదాహరణగా ప్రతీకగా నిలిచిన క్వీన్ ఎలిజబెత్ 2 మరణాన్ని ప్రకటించాల్సిన విషాదకర బాధ్యతను తీసుకుంటూ, ఆమెను ఎల్లకాలం స్ఫూర్తిగా మలుచుకుంటూ ప్రస్థానం సాగిస్తానని తెలిపారు. రాజుగా తన బాధ్యతల గురించి పూర్తి అవగావహనతో ఉన్నానని ఛార్లెస్ ప్రకటించారు. తల్లి మరణాన్ని దేశపు రాణి కనుమరుగు అయిన విషయాన్ని ముందుగా తెలియచేసుకుంటున్నా, ఆమె నుంచి అందిన బాధ్యతల పట్ల అంకితభావంతో వ్యవహరిస్తానని చార్లెస్ ప్రకటించారు. తన తల్లికి తాను ఏమివ్వగలనని , ఒక్క థాంక్యూ తప్ప అని ఉద్వేగంగా తెలిపారు. ఆమె పాలనాకాలం అనితర సాధ్యం, నిబద్ధతలు, అంకితభావపు సమ్మేళనం. బాధాతప్త హృదయంతోనే మనమంతా ఓ అత్యంత విశ్వసనీయ జీవనానికి ధన్యవాదాలు తెలియచేసుకుందామన్నారు. ఆమె బాధ్యతలు తాను తీసుకుంటున్న ఈ దశలో తన ముందున్న అన్ని కర్తవ్యాలను పాటిస్తానని ఛార్లెస్ తెలిపారు. రాజ్యాంగపరమైన ప్రభుత్వ పరిరక్షణ, ఈ దీవుల దేశ ప్రజల సౌభాగ్యం శాంతి సామరస్య సాధనకు పాటుపడుతానని ప్రతిన వహిస్తున్నానన్నారు.

అదే విధంగా కామన్‌వెల్తు కార్యకలాపాలు, ప్రయోజనాలు, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల వికాసం, సంక్షేమానికి పాటుపడుతానని ప్రకటించారు. 21 సంవత్సరాల వయస్సులోనే తన తల్లి ఎలిజబెత్ ఈ దేశం కోసం పాలకురాలిగా చేసిన ప్రతిజ్ఞను ఇప్పుడు దేశం ముందుకు తీసుకువస్తానని, అప్పట్లో ఆమె ఈ దశలో తన జీవితం పెద్దదిగా విస్తరించుకున్నా, చిన్నదిగా మిగిలిపోయినా దానిని దేశానికి అంకితం చేస్తానన్నారు. అది కేవలం మొక్కుబడి ప్రతిజ్ఞగా కాకుండా నిజంగానే ఈ ప్రతిజ్ఞపాలనలో ఆమె జీవితాంతం ముందుకు సాగారని, దేశం అంతా ఆమె కోసం శోకతప్తం అయిన దశలో తెలియచేసుకుంటున్నానని. ఆమె వారసత్వ బాధ్యతలను ఎంత కష్టం అయినప్పటికీ, తన జీవితంలో పలు మార్పులకు దారితీసే ప్రక్రియ అయినప్పటికీ అంకితభావంతో నిర్వరిస్తానని ఛార్లెస్ తెలిపారు. రాజుగా ఆయన అధికారిక ప్రకటన పత్రాలపై ఛార్లెస్‌తో పాటు కెమిల్లా, విలియం సంతకాలు చేశారు.

ఇక నుంచి వేల్స్ ప్రిన్స్‌గా విలియం వ్యవహరిస్తారు. రాజుగా బాధ్యతలు తీసుకునే క్రమంలో ఛార్లెస్ ఆదాయ లెక్కల పత్రాలు, రాజరిక ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలను బ్రిటన్‌లో రాజరిక కుటుంబ నిర్వహణల వ్యయానికి గ్రాంట్లు ఇతర అంశాలను నిర్ధారించే కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించారు. స్కాట్లాండ్‌లోని బాల్‌మోరల్ రాజప్రాసాదంలో క్వీన్ మరణించారు. ఆ తరువాత సంతాప సూచకంగా దేశంలో అవనతం చేసిన జాతీయ పతాకాన్ని తరువాత కింగ్ అధికారిక ప్రకటన దశలో తిరిగి యధాతధ స్థితికి తెచ్చారు. ఛార్లెస్ కుటుంబంతో పాటు లండన్‌లోని రాజప్రసాదం బకింగ్‌హాం పాల్యెస్‌కు వచ్చారు.
దేవదూతల దీవెనలు ఆశిస్తున్నా

హామ్లెట్ తుది అంకం డైలాగు ప్రస్తావన

కింగ్ ఛార్లెస్ తమ ప్రసంగంలో ప్రియమైన తల్లికి వీడ్కోలు అని చెపుతూ సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు గతించిన తన తండ్రివద్దకు అని, కుటుంబం పట్ల అంకితభావమే కాకుండా పలు దేశాలతో కూడిన ప్రపంచ కుటుంబం పట్ల కూడా ఇంతకాలం సేవలు అందించాని కొనియాడారు. ఈ దశలో ఆయన వాడిన దేవదూతలు ఆత్మశాంతికి దీవెనలు అందించాలని అత్యంత వేదాంత ధోరణిలో పేర్కొన్నారు. దీనిపై తరువాత పలు వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. విలియం షేక్స్‌పియర్ ఉదాత్తనాటకం హామ్లెట్‌లోని తుది విషాద ఘట్టంలోని పాత్రలు పేర్కొన్న పదాలను ఛార్లెస్ ఉటంకించారని భావిస్తున్నారు. నాటకం ముగింపు దశలో మిగిలిన ఒక పాత్ర గతించిన వారివైపు చూస్తూ పలికే పదాలను ఛార్లెస్ వాడారు. రాజుగా ఆ తరువాత ఛార్లెస్ తమ ప్రసంగంలో కుమారుడు విలియం , ఆయన భార్య కాటేలను వేల్స్ ప్రిన్స్‌గా ప్రిన్సెస్‌గా ప్రకటించారు.

రాజు అధికారిక ప్రకటన కార్యక్రమానికి బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ , నిర్ణీత ప్రముఖులు కొందరు హాజరయ్యారు. రాజుగా ఆయనను ప్రకటించిన వెంటనే గౌరవసూచకంగా కింగ్స్ ట్రూప్ తరఫున 41 గన్ సెల్యూట్ కార్యక్రమం జరిగింది. రాజుగా నియుక్తం చేసే ప్రక్రియల మండలి అత్యంత ప్రముఖులతో కూడిన వ్యవస్థగా ఉంటుంది. ఇందులో రాజకీయనాయకులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఉంటారు. వీరు ముందు ఆంతరంగికంగా భేటీ అయి రాజు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. ఛార్లెస్‌ను రాజుగా ప్రకటించే దశలో ఈ తతంగం అంతా సాగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News