Sunday, April 28, 2024

ప్రైవేట్ ఉపాధ్యాయుల వెతలు

- Advertisement -
- Advertisement -

ఇటీవల కరోనా విపత్తుతో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడింది. దీని ప్రభావం ప్రైవేట్ పాఠశాలల మనగడపై, ఆ ఉపాధ్యాయుల ఉద్యోగాలపై తీవ్రంగా పడింది. ఈ వృత్తిని నమ్ముకొని బతుకీడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల టీచర్ల పరిస్థితి గందరగోళంలో పడింది. కరోనాతో ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా కేంద్ర మార్గదర్శకాలనుసారం రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టాయి. ఈ బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తగ్గిన మాట వాస్తవం. కానీ సమన్వయకర్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరూ ఈ పని చేస్తున్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు జీతాలు ఇవ్వలేక అతి తక్కువ మందిని మాత్రమే ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు.

విద్యా బుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే జ్ఞాన శిఖరం గురువు. అందుకే భారతీయ సంస్కృతిలో గురువును దైవంగా కొలుస్తారు. కరోనా నేపథ్యంలో విద్యా స్వరూ పం మారింది. ముఖ్యంగా ఆన్‌లైన్ విద్య కొనసాగించడంతో ఆచార్య దేవోభవ అని పిలిచే గురువు ఆదరణకు నోచుకోక ఆసర కరువైంది. ఈ దుస్థితి నేడు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వినూత్నమైన విధానాలు, ఆధునికత, చక్కటి నిర్వహణ, ఆంగ్ల భాష బోధన లాంటి అంశాలు ప్రైవేట్ పాఠశాల పట్ల మక్కువ చూపించడానికి ప్రధాన కారణాలు. అంతేకాకుండా కుటుంబాల్లో పెరుగుతున్న ఆదాయంతో పాటు అవకాశాల దృష్ట్యా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత సగటు తలిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించడానికి వెనుకాడడం లేదు. దేశ వ్యాప్తంగా నమోదైన 25 కోట్ల మంది విద్యార్థుల్లో 12 కోట్ల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదుతున్నారనే యు డైస్ -2019(యుడిఐఎస్‌ఇ) గణాంకాలే దీనికి నిదర్శనం. ఈ సంఖ్య దేశంలో ఉన్న 10.9 లక్షలు ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే 4.5 లక్షల ప్రైవేట్ పాఠశాలలు ఉండడం గమనార్హం.
దేశంలో 73 శాతం తలిదండ్రులు మంచి నాణ్యమైన విద్య కొరకు ప్రైవేట్ పాఠశాలల పట్ల మక్కువ చూపిస్తున్నారని జాతీయ శాంపిల్ సర్వే సంస్థ(ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) ఫలితాలు చెబుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల వృద్ధి ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన మెజారిటీ నిరుద్యోగులకు ఉపాధినిస్తున్నది. వీటికి భిన్నంగా ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యల వలయంలో చిక్కడంతో వీటి ప్రభ రోజురోజుకూ తగ్గుతున్నది. వాస్తవంగా, వృత్తిపరంగా భద్రత కలిగి సకల సౌకర్యాలు గల ప్రభుత్వ టీచర్‌గా నియామకం కావాలని సగటు చాత్రోపాధ్యాయుని కల. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రావడం అసా ధ్యం. పోటీలో నిలబడలేనీ మెజారిటీ యువత ప్రైవేట్ ఉపాధ్యాయులుగా రాణిస్తూ జీవితంలో స్థిరపడిపోతున్నారు.
ఇటీవల కరోనా విపత్తుతో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడింది. దీని ప్రభావం ప్రైవేట్ పాఠశాలల మనగడపై, ఆ ఉపాధ్యాయుల ఉద్యోగంపై తీవ్రంగా పడింది. ఈ వృత్తిని నమ్ముకొని బతుకీడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల టీచర్ల పరిస్థితి గందరగోళంలో పడింది. కరోనాతో ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా కేంద్ర మార్గదర్శకాలనుసారం రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టాయి. ఈ బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తగ్గిన మాట వాస్తవం. కానీ సమన్వయకర్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరూ ఈ పని చేస్తున్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు జీతాలు ఇవ్వలేక అతి తక్కువ మందిని మాత్రమే ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు.
దీనితో మెజారిటీ ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాలలో రైతులుగా, ఉపాధి హామీ కూలీలుగా, కూరగాయల వ్యాపారాలుగా, తాపీ మేస్త్రీలుగా, పెయింటర్లుగా, కార్పెంటర్లుగా, గొర్రెల కాపరులు లాంటి వృత్తులను ఆశ్రయించి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి కొందరు కుటుంబాన్ని పోషించలేక బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయం. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ యజమాన్యాలు తమకు సగం వేతనం కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, లాక్‌డౌన్ సమయంలో కూడా ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేసినట్లు 25 శాతం మంది తలిదండ్రులు వెల్లడించారు. అయినప్పటికీ దాదాపు 50 శాతం ఉపాధ్యాయులకు మార్చి నెల వేతనం కూడా చెల్లించలేదని గ్లోబల్ స్కూల్ లీడర్ నివేదిక పేర్కొన్నది. ప్రస్తుతం ఆన్‌లైన్ విద్య పేరుతో కూడా ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తలిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు చిన్న, మధ్య స్థాయి ప్రైవేట్ పాఠశాలను నడపలేమని యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. నేటి అన్‌లాక్ ప్రక్రియలో కూడా విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో తెరిచే పరిస్థితి లేకపోవడంతో లాక్‌డౌన్ సమయంలో వలస కూలీల సమస్యల తర్వాత ప్రైవేట్ ఉపాధ్యాయులే నిలవనున్నారు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టే యువతరాన్ని ప్రభావితం చేస్తాయి.
విద్యాభివృద్ధిలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి ఉందనడంలో సందేహం లేదు. విద్యాపరంగా ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా ప్రైవేట్ పాఠశాలలు ముందుకు వెళ్లడమే దీనికి నిదర్శనం. కావున ప్రభుత్వాలు వారి సంక్షేమానికి చట్టపరమైన, విధాన పరమైన చర్యలకు శ్రీకారం చుట్టాలి. ఇన్నాళ్లు తమ సేవలను వినియోగించుకున్న యాజమాన్యాలు విధిగా వారికి జీతాలు చెల్లించే విధంగా కృషి చేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు సైతం సేవా నిబంధనలను అమలు పరుస్తూ, యాజమాన్యాలు వారిని ఇష్టారీతిగా తొలగించకుండా ఉండడానికి విధి విధానాలు రూపొందించాలి. వారి జీవన భద్రతకు ఆర్థిక తోడ్పాటు అందించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి.
నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగబద్ధ హక్కును ప్రైవేట్ పాఠశాలలు తప్పక అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ సదుపాయం, హెల్త్ కార్డు లాంటి సౌకర్యాలను కల్పించాలి . ఆన్‌లైన్ విద్యలో ప్రైవేటు ఉపాధ్యాయులను సైతం భాగస్వామ్యం చేసి వారికి కనీస వేతనం చెల్లించాలి. ప్రైవేటు యాజమాన్యం నడపలేని చిన్న, మధ్య స్థాయి బడ్జెట్ పాఠశాలలపై అధ్యయనం చేసి వాటిని ప్రభుత్వమే నడిపించాలి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ టీచర్లను విద్యా వాలంటీర్లుగా నియమించాలి.
యువతరానికి ఉపాధ్యాయ వృత్తిని ఒక అవకాశంగా మార్చాలి . ప్రైవేట్ పాఠశాలలు అనుమతులు, ఫీజులపై సమగ్రమైన విధానాన్ని అవలంబించాలి. దేశ వ్యాప్తంగా వీటిలో పని చేసే ఉపాధ్యాయుల సమాచారాన్ని యాజమాన్యాలు ఎప్పటికప్పుడు విద్యాశాఖకు చేరవేయాలి. విద్యా హక్కు చట్టం పటిష్ఠంగా అమలు జరిగేటట్లు చర్యలు చేపట్టాలి. కోవిడ్ -19 నియమావళితో సాధ్యమైనంత త్వరగా పాఠశాలను ప్రారంభించే విధంగా కసరత్తు చేయాలి. అప్పుడే వారి సమస్యలు పరిష్కరించబడి సామాజిక న్యాయం చేకూరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News