Saturday, May 4, 2024

డ్రగ్స్ కేసులో ‘పూరీ’ విచారణ

- Advertisement -
- Advertisement -
Puri Jagannadh appears before ED
ఆర్థిక లావాదేవీలపై 10గంటలు ప్రశ్నించిన ఇడి,  అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై ఆరా

మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇడి అధికారులు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను మంగళవారం నాడు దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఇడి అధికారులు దానికి సంబంధించిన వివరాలు సేకరించారు.ఈక్రమంలో పూరీ జగన్నాథ్ చార్టెడ్ అకౌంట్ శ్రీధర్ కూడా ఇడి అధికారుల ఎదుట హాజరై ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సమర్పించారు. ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా ఇడి అధికారులు పూరీ జగన్నాథ్ ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలతోపాటు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్ల విషయంలో ఎంతమేర ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న అంశంపై విచారించారు.

పూరి జగన్నాథ్‌కు సంబంధించి మూడు బ్యాంక్ ఎకౌంట్లను పరీశీలించడంతో పాటు వైష్ణో బ్యానర్, పూరి కనెకట్స్ బ్యానర్ ఆడిట్ రిపోర్టులను పరిశీలించి వివరాలు సేకరించారు. గతంలో అరెస్టయిన నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా పూరి జగన్నాథ్‌ను ప్రశ్నించారు. డైరెక్టర్ స్టేట్‌మెంట్‌ను అధికారులు లిఖిత పూర్వకంగా నమోదు చేసుకోవడంతో పాటు పీఎమ్‌ఎల్‌ఏ యాక్ట్ సెక్షన్ 3.4 ప్రకారం విచారించారు. పూరీ జగన్నాధ్ ను ప్రశ్నించిన ఇడి అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను లిఖిత పూర్వకంగా నమోదు చేసుకున్నారు. అలాగే ఎప్పుడు పిలిచిన విచారణ కు హాజరు కావాలని ఇడి అదేశించింది. దీంతో ఇడి అధికారుల నుంచి సమాచారం రాగానే కచ్చితంగా హాజరవుతామని పూరీ హామీ ఇచ్చాడు. ఇడి కార్యాలయానికి పూరీ వెంట ఆయన కుమారుడు ఆకాశ్ పూరీ, సోదరుడు సాయిరాం శంకర్, ఆడిటర్ సతీశ్‌లు వచ్చారు.

ఇడి కార్యాలయంలో ‘బండ్ల’

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ను ప్రశ్నిస్తున్న సమయంలో ఇడి కార్యాలయానికి బండ్ల గణేశ్ రావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇడి అధికారులు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ను కార్యాలయానికి పిలిపించారు. ఇడి పిలుపు మేరకు కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేశ్ ఈ కేసులో ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. వక్కపొడి కూడా తినే అలవాటు లేని తనకు నోటీసులు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. పూరీ జగన్నాథ్‌ను కలిసేందుకే కార్యాలయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

లావాదేవీలపైనే విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇడి అధికారులు మనీలాండరింగ్ కోణంలోనే వివరాలు సేకరిస్తున్నారు. సినీరంగానికి చెందిన 12 మంది బ్యాంకు ఖాతాలు పరిశీలించే అవకాశమున్నట్లు సమాచారం. 12 మంది ప్రస్తావన లేకుండానే సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని సెప్టెంబరు 22 వరకు విచారించనుంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులను ఈడీ ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఆబ్కారీశాఖ సిట్ 11 నేరాభియోగ పత్రాలు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని విచారించిన సిట్ ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 మందిని నిందితులుగా చూపింది. మరికొంత మందిని కూడా నిందితులుగా చూపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News