Sunday, April 28, 2024

ప్రశ్నార్ధకంగా కార్మిక చట్టాలు!

- Advertisement -
- Advertisement -

Questionable labor laws!

నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుండి కీలక అంశాలపై సవివరంగా సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం తీసుకు వచ్చే ప్రయత్నం చేయక పోతుండడంతో కీలకమైన చట్టాల అమలులో సహితం వెనుకడుగు వేయవలసి వస్తున్నది. ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సంవత్సరం పాటు రైతుల నిరసనల కారణంగా వెనుకకు తీసుకు రావలసి రావడం చూశాము. అధికారంలోకి రాగానే తీసుకు వచ్చిన భూసేకరణ చట్టం సవరణకు కూడా అదే గతి పట్టింది. హడావుడిగా తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదం పొంది రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు అమలు ప్రారంభించలేకపోయారు. ఆర్టికల్ 370 రద్దును సహితం హడావుడిగా తీసుకు వచ్చిన కారణంగా జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు రెండేళ్లు దాటినా కుదుట పడలేదు. అక్కడ ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశాలు కనిపించడం లేదు.

తాజాగా కార్మిక సంస్కరణల విషయంలో సహితం అటువంటి సమస్యలు ఎదురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 1, 2022 నుండి అమలులోకి వస్తుందని విస్తృతంగా భావిస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లు ‘చివరి సంప్రదింపుల’ వరకు ఆలస్యం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఏకాభిప్రాయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ హామీ ఇస్తున్నా ఆ దిశలో ఎటువంటి పురోగతి కనబడటం లేదు. మొత్తం నాలుగు కోడ్‌లను వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రత-, ఆరోగ్యం -సెప్టెంబర్ 2020లో పార్లమెంటు ఆమోదించింది.
అయితే ఇవి ఇంకా అమలులోకి రాలేదు, మోడీ ప్రభుత్వ హయాం ప్రారంభంలోనే 29 కార్మిక చట్టాలను నాలుగు విభిన్న కోడ్‌లుగా విలీనం చేయాలని ప్రతిపాదించడం ద్వారా సంస్కరణల మార్గాన్ని ప్రారంభించింది. ఇలా చేయడం ద్వారా నేడు వ్యాపార, పరిశ్రమల పని తీరులో మార్పు తీసుకురావాలని కేంద్రం భావించింది. అయితే, ఈ కసరత్తు పట్ల మొదటి నుండి కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. చాలా కేంద్ర కార్మిక సంఘాలు వేతనాలు, సామాజిక భద్రతపై కోడ్‌లను అంగీకరించాయి.అయితే అవి సమీక్షించదలిచిన ఇతర రెండు కోడ్‌లపై మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. స్థూలంగా ఈ మార్పులు ప్రతిపాదిత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధమనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతున్నది.

మొదటి నుండి ఈ సంస్కరణలు తీసుకు రావడంలో కార్మికుల ప్రయోజనాలను కాకుండా పారిశ్రామికవేత్తల సౌలభ్యాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొంటున్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి. కార్మిక సంస్కరణలపై కరోనా మహమ్మారికి ముందు ఢిల్లీలో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఓ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. అయితే తాము చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొన్నట్లు అసలు కనిపించడం లేదని కార్మిక నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా ఈ కోడ్‌లు అమలులోకి వస్తే చాలా పరిశ్రమలలో కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడమే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలలో కార్మిక పట్ల యాజమాన్యాలు తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతున్నా చట్టపరంగా తమకు లభించవలసిన రక్షణలు, మద్దతు లభించడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి. కోడ్‌లు పని గంటలను 8 గంటల నుండి 12 గంటలకు పెంచడంపై కూడా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 48 గంటల- ఫర్ వీర్ సీలింగ్‌ను కొనసాగించాలని ప్రభుత్వ ప్రతినిధులు చాలా కష్టపడుతున్నప్పటికీ, 12- గంటల-రోజు అంటే వారికి నాలుగు రోజుల వారానికి అర్థం అవుతుందా? అని కార్మికులు ఆశ్చర్యపోతున్నారు. కార్మికుల సామూహిక బేరసారాల శక్తిని బలహీనపరచడం ఈ కోడ్‌ల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.

కార్మికులు సంఘాలు ఏర్పాటు చేసుకున్నా వాటిని గుర్తించడంలో అడ్డంకులు ఏర్పడతాయని, పెద్ద సంఖ్యలో కార్మికులు న్యాయపరమైన పరిష్కారాన్ని ఆశ్రయించే అవకాశం నిరాకరించబడుతుందని భావిస్తున్నారు. పైగా, కార్మికుల సమ్మె హక్కును దాదాపు అసంభవం కావిస్తోందని భయపడుతున్నారు. ఈ కోడ్‌ల రూపకల్పన కార్మికుల కంటే యజమానులు, కార్పొరేట్‌లకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నట్లు భావిస్తున్నారు. కొందరు వామపక్ష కార్మిక సంఘాల నేతలయితే ఈ కోడ్ లను బానిసత్వానికి సంకేతాలుగా అభివర్ణిస్తున్నారు. కార్మిక హక్కులు, కార్మిక చట్టాలను సులభతరం చేయడానికి వీటిని ఉద్దేశించిన్నట్లు చెబుతున్నప్పటికీ ప్రధానంగా ‘వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి’ రూపొందించినట్లు భావిస్తున్నారు.
అందుకే కొత్త పెన్షన్ స్కీమ్‌ను కార్మికులు కూడా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తున్నది. ఈ కోడ్‌లకు సంబంధించి పరిశ్రమలతో, వారి థింక్ ట్యాంక్‌లతో సంప్రదించడమే గాని, కార్మికులను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని అభిప్రాయం బలపడుతున్నది. పర్యవసానంగా దశాబ్దాలు, శతాబ్దాల తరబడి కార్మికులు సాధించుకున్న హక్కులకు పాతర వేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. మరో వంక ఈ కోడ్‌లను సత్వరమే అమలులోకి తీసుకు రావాలని పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక పునరుద్ధరణ కోసం ఆర్థిక వ్యవస్థలో స్థిర ఆస్తుల సృష్టి వేగాన్ని కూడగట్టాల్సిన సమయంలో, వాటి అమలులో ఆలస్యం భారత దేశపు తాజా పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలను దెబ్బ తీస్తుందని హెచ్చరిస్తున్నాయి.

‘విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, దేశానికి అవసరమైన ఆర్థిక పునరుద్ధరణకు దేశంలో కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. అందువల్ల నాలుగు లేబర్ కోడ్‌లను ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కానప్పటికీ, లేబర్ కోడ్‌ల అమలు చాలా క్లిష్టమైనది’ అని ఈ సందర్భంగా ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఒకేసారి అమలులోకి తీసుకు రావాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా, ఆ ప్రక్రియలో జాప్యం జరిగే బదులు దశలవారీగా అమలులోకి తీసుకు రావాలని సూచనలు సహితం వస్తున్నాయి. ఈ మొత్తం కోడ్‌లు కార్మికుల ప్రయోజనాలను దెబ్బ తీస్తాయని కూడా చెప్పలేము. కార్మికుల దృష్టిలో వాటికి నిశితంగా సమీక్ష జరపవలసిన అవసరం మాత్రం కనిపిస్తుంది.

కార్మిక ఉత్పాదకతను పెంచడానికి సంస్కరణవాద, సామాజిక -భద్రతా దశల కలయికను కోడ్‌లు అందిస్తాయి. వ్యాపార వర్గాలకు అనుకూలమైన పలు ప్రతిపాదనలు ఉన్నాయనడంలో సందేశం లేదు. ముఖ్యంగా 300 మంది కార్మికులు (ఇప్పుడు 100 మంది నుండి) ఉన్న వ్యాపారాన్ని ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులను తొలగించడం లేదా యూనిట్లను మూసివేయడం, ట్రేడ్ యూనియన్‌ని నియంత్రించడం అందులో ముఖ్యమైనది. అయితే, కొత్త చట్టాలు కార్మికులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు కనీస వేతనాలు ఉండేలా చూడటం, వారందరినీ సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడానికి నిర్దుష్టమైన ప్రతిపాదనలు ఉండడం గమనార్హం. లేబర్ కోడ్‌లు స్వల్పకాలిక పని ఒప్పందాలను రూపొందించడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తాయని కూడా భావిస్తున్నారు.

అయితే, ఉద్యోగ నియామకం, తొలగింపులను యాజమాన్యాలు ఇష్టానుసారం జరిపే వీలు కల్పిస్తాయనే భయం కూడా నెలకొంటున్నది. అందుకనే కార్మిక సంఘాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపడం ద్వారా ఏకాభిప్రాయ సాధనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. అందుకు తన నిజాయితీని ప్రదర్శించాలి. జిఎస్‌టిని అమలులోకి తీసుకు రావడం కోసం ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో, వ్యాపార వర్గాలతో అనేక స్థాయిలలో సమాలోచనలు జరిపారో ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అమలులోకి తీసుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అనేక మార్పులను నిత్యం చేస్తూనే ఉన్నారు. ఈ కోడ్‌ల విషయంలో సహితం ప్రభుత్వం ప్రతిష్ఠలకు కాకుండా ఆచరణ సాధ్యమైన మార్గం అనుసరించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News